డీ శ్రీనివాస్ ఆరోగ్యంపై ఆందోళనగా ఉందని ఆయన కుమారుడు ధర్మపురి సంజయ్ తెలిపారు. తన తండ్రికి ఫిట్స్ వస్తే ఇంట్లోనే ఎందుకు ఉంచారని ప్రశ్నించారు. తన తమ్ముడు ధర్మపురి అరవిందే తండ్రిని బ్లాక్‌మెయిల్ చేసి లేఖలు రాయిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. అరవింద్ దిగజారి వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తండ్రి చుట్టూ ఉన్నవాళ్లపై తనకు అనుమానం ఉందని సంజయ్ చెప్పారు. డీఎస్ రాజీనామా లేఖలు బీజేపీ చేస్తున్న డర్టీ పాలిటిక్స్ అని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తే అరవింద్‌పై పోటీ చేసేందుకు తాను సిద్ధమని ప్రకటించారు.
డీఎస్, ఆయన కుమారుడు సంజయ్ ఆదివారమే కాంగ్రెస్ గూటికి తిరిగివెళ్లారు. అయితే 24 గంటల్లోనే ఆ పార్టీకి రాజీనామా చేస్తునట్లు డీఎస్ ప్రకటించారు. ఈ మేరకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఆయన లేఖ రాశారు. డీఎస్ లేఖ రాస్తున్న వీడియోను కూడా విడుదల చేశారు. రాజీనామా లేఖను ఆయన సతీమణి విజయలక్ష్మి మీడియాకు విడుదల చేశారు.
డీఎస్ ఆరోగ్యం సహకరించట్లేదని, కాంగ్రెస్ వాళ్లు తమ ఇంటి వైపు రావొద్దని డీఎస్ భార్య విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో సోదరుడు అరవింద్‌పై సంజయ్ తీవ్ర ఆరోపణలు చేయడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. డీఎస్ రాజీనామానా వ్యవహారం కాస్తా ఆయన కుమారుల పంచాయితీగా మారింది. అన్న సంజయ్ ఆరోపణలపై తమ్ముడు అరవింద్ ఇంకా స్పందించాల్సి ఉంది.
మరోవైపు తన కుమారుడు సంజయ్ కాంగ్రెస్‌లోకి తిరిగి చేరిన సందర్బంగానే గాంధీభవన్ వెళ్లానని, కానీ తానూ పార్టీలో చేరినట్లు ప్రచారం చేశారని డీఎస్ లేఖలో పేర్కొన్నారు. ఒకవేళ తాను కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు భావిస్తే ఈ లేఖను రాజీనామాగా భావించి ఆమోదించాలని కోరుతున్నట్లు తెలిపారు.
చదవండి: చేరికల చిచ్చు.. ఒక్క రోజుకే కాంగ్రెస్‌కు డీఎస్ రాజీనామా.. అసలేమైంది?
Comments
Please login to add a commentAdd a comment