కోటి రూపాయలు ఎగ్గొట్టిన వర్మ

FWICE: Ram Gopal Varma Not Paying Rs 1 Crore To Technicians - Sakshi

వివాదాలు, విమర్శలతోనే చెలగాటం ఆడే రామ్‌గోపాల్‌ వర్మకు చుక్కెదురైంది. ఆయన తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్లకు కోటి రూపాయల మేర డబ్బులు చెల్లించనేలేదట. దీంతో ఆగ్రహించిన ఎఫ్‌డబ్ల్యూఐసీఈ(ఫెడరేషన్‌ ఆఫ్‌ వెస్టర్న్‌ ఇండియా సినీ ఎంప్లాయూస్‌) ఇకపై ఆర్జీవీతో పని చేయకూడదని కీలక నిర్ణయం తీసుకుంది.

కరోనా కాలంలో కూడా వరుస సినిమాలు తీసుకుంటూ పోయిన వర్మ పలువురు ఆర్టిస్టులు, టెక్నీషియన్లకు అసలు జీతాలే ఇవ్వలేదట. సుమారు కోటి రూపాయల డబ్బులు చెల్లించకుండా తిరుగుతున్నాడట! దీంతో వీలైనంత త్వరగా వారికి డబ్బులు చెల్లించమని కోరుతూ ఎఫ్‌ఐసీఈ వర్మకు సెప్టెంబర్‌ 17 నుంచి లేఖలు పంపుతూనే ఉంది. కానీ అటు వైపు నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో లీగల్‌ నోటీసులు సైతం పంపించింది. అయినా ఆర్జీవీ నిమ్మకు నీరెత్తనట్లు ఊరుకుండిపోయారు. (చదవండి: స్త్రీల కోసం సాగిన సుమధుర గీతం)

అయితే సెప్టెంబర్‌లో వర్మ గోవాలో చిత్రీకరణ జరుపుతున్నారన్న విషయం తెలిసి ఏకంగా అక్కడి ముఖ్యమంత్రికి కూడా లేఖను పంపామని ఎఫ్‌డబ్ల్యూఐసీఈ అధ్యక్షుడు బీఎన్‌ తివారీ పేర్కొన్నారు. కరోనా కాలంలో చాలా మంది పేద ఆర్టిస్టులు, టెక్నీషియన్లతో పని చేయించుకుని వారికి చిల్లిగవ్వ ఇవ్వకుండా తిరుగుతున్నాడన్న విషయాన్ని బయటపెట్టారు. వెంటనే వారికి ఇవ్వాల్సిన మొత్తాన్ని చెల్లించమని ఎంత మొర పెట్టుకున్నా ఆయన స్పందించడం లేదని అసహనం వ్యక్తం చేశారు. అందుకే భవిష్యత్తులో ఆయనతో కలిసి పని చేయకూడదని ఓ నిర్ణయానికి వచ్చామన్నారు. కాగా ఆర్జీవీ ప్రస్తుతం తను తెరకెక్కించిన 12'O' క్లాక్‌ సినిమాను రిలీజ్‌ చేసే పనిలో ఉన్నారు. (చదవండి: తెలుగింట్లో తమిళ కోడలు)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top