పోటీ నుంచి తప్పుకుంటున్నా

Telangana: Kadiyam Kavya Resigns to BRS - Sakshi

బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు కడియం కావ్య లేఖ 

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: వరంగల్‌లో బీఆర్‌ఎస్‌ గట్టి షాక్‌ తగిలింది. మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుమార్తె, బీఆర్‌ఎస్‌ వరంగల్‌ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య పోటీ నుంచి తప్పుకున్నారు. ఈ మేరకు ఆమె పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు గురువారం రాత్రి లేఖ రాశారు. పార్టీపై వచి్చన అవినీతి, భూ కబ్జాలు, ఫోన్‌ ట్యాపింగ్‌ ఆరోపణల నేపథ్యంలో పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో నాయకుల మధ్య సమన్వయం లేకపోవడంతో పార్టీకి తీవ్ర నష్టం జరుగుతోందని, ఇలాంటి పరిస్థితుల్లోనే పోటీనుంచి విరమించుకుంటున్నానని తెలిపారు. కేసీఆర్, బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు తనను మన్నించాలని విజ్ఞప్తి చేశారు. 

కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య? 
కడియం శ్రీహరి, కడియం కావ్యలు కాంగ్రెస్‌ పార్టీలో చేరే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఈ కారణంగానే కావ్య బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా తప్పుకున్నారని అంటున్నారు. ఇందుకోసమే ఇప్పటివరకు కాంగ్రెస్‌ కూడా తన అభ్యర్థిని ప్రకటించ లేదని చెబుతున్నారు. బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేయనున్న తండ్రీకూతుళ్లు ఈ నెల 30న ఢిల్లీలో కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే వరంగల్‌ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థిగా కడియం శ్రీహరి బరిలోకి దిగే అవకాశం ఉందని, కానిపక్షంలో కావ్య కాంగ్రెస్‌ తరఫున పోటీ చేస్తారని అంటున్నారు.

ఒకవేళ కడియం శ్రీహరిని కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థిగా ప్రకటిస్తే... ఆయన ఎంపీగా గెలిచిన అనంతరం కావ్యను స్టేషన్‌ ఘనపూర్‌ ఎమ్మెల్యేగా కాంగ్రెస్‌ బరిలోకి దింపవచ్చనే ఊహాగానాలు సాగుతున్నాయి. ఈ హామీల మేరకే శ్రీహరి, కావ్యలు బీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పాలనే నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పష్టత కోసం శ్రీహరి, కావ్యలను ఫోన్‌లో సంప్రదించేందుకు ప్రయత్నించగా వారు స్పందించలేదు. కావ్య ఎపిసోడ్‌లో ప్రభుత్వ సలహాదారు, కడియం శ్రీహరికి చిరకాల మిత్రుడు వేం నరేందర్‌రెడ్డి చక్రం తిప్పారన్న ప్రచారం కూడా జరుగుతోంది.

Election 2024

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top