వైకుంఠం క్యూకాంప్లెక్సులలో 108 అంగుళాల టీవీలు
తిరుమల వైకుంఠం క్యూకాంప్లెక్సులోని మొత్తం 32 కంపార్టుమెంట్లలో 108 అంగుళాల టీవీలను ఏర్పాటు చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. అలాగే.. శని, ఆదివారాల్లో రద్దుచేయాలని తలపెట్టిన దివ్యదర్శనాన్ని యథాతథంగా కొనసాగించాలని కూడా నిర్ణయించింది. శుక్రవారం తిరుమలలో సమావేశమైన టీటీడీ పాలకమండలి ఈ మేరకు పలు నిర్ణయాలు తీసుకుంది.
వేసవికాలంలో నీటి ఎద్దడిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, తిరుపతి మున్సిపాలిటీ నుంచి రోజుకు ఏడు మిలియన్ గ్యాలన్ల నీళ్లను కొనుగోలు చేస్తారు. శ్రీవారి ప్రసాదం తయారుచేసే పోటులో 472 మంది కాంట్రాక్ట్ సిబ్బందిని 2016 వరకు కొనసాగించడానికి ఆమోదించారు. కేజీ రూ. 42 చొప్పున 6. 32 కోట్ల కేజీల బియ్యం కొనుగోలుకు ఆమోదం తెలిపారు. శేషాచలం అడవుల్లో అగ్ని ప్రమాద నివారణకు 186 మంది కాంట్రాక్ట్ సిబ్బంది ఏర్పాటును ఆమోదించారు. అలాగే, ఎంఎంపీసీ నుంచి 15 వేల శ్రీవారి వెండి డాలర్ల కొనుగోలుకు ఆమోదం తెలిపారు.