గుండె ‘చెరువు’! | 13 people killed in the Raft accident | Sakshi
Sakshi News home page

గుండె ‘చెరువు’!

Published Sat, Apr 29 2017 12:42 AM | Last Updated on Tue, Jun 4 2019 5:58 PM

గుండె ‘చెరువు’! - Sakshi

గుండె ‘చెరువు’!

‘అనంత’లో తిరగబడిన తెప్ప.. 13 మంది మృతి
- మృతుల్లో నలుగురు మహిళలు, తొమ్మిదిమంది చిన్నారులు
- కుటుంబ సభ్యుల మరణవార్త విని గుండెపోటుతో మరొక వ్యక్తి మృతి
- తెప్పలో పరిమితికి మించి వెళ్లడమే ప్రమాదానికి కారణం


సాక్షి ప్రతినిధి, అనంతపురం: అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం వై.తిమ్మన చెరువు (వైటీ చెరువు) గ్రామంలో శుక్రవారం పెను విషాదం చోటుచేసుకుంది. గ్రామసమీపంలోని చెరువులో తెప్ప తిరగబడడంతో 13 మంది దుర్మరణం పాలయ్యారు. ముగ్గురు ప్రాణాలతో బయటపడగా, ఒక చిన్నారి గల్లంతయ్యాడు. ప్రయాణిస్తున్నవారిలో అధికశాతం మహిళలు, చిన్నారులే కావడం, వారికి ఈత రాకపోవడం ఘోర ప్రమాదానికి కారణమైంది. మృతుల్లో నలుగురు మహిళలు, తొమ్మిదిమంది చిన్నారులే. గ్రామంలో ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమానికి వచ్చి అర్ధంతరంగా కన్నుమూసిన వీరంతా బంధువులే.

ఈ విషాదాన్ని తట్టుకోలేక రోదిస్తూ చంద్రప్ప అనే వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఒకేరోజు గ్రామంలో 14మంది మరణించడంతో గ్రామమంతా విషాదంలో మునిగిపోయింది. మనసును కలిచివేసిన ఈ దుర్ఘటన వివరాలిలా ఉన్నాయి. వైటీ చెరువులో శనివారం కోదండరామస్వామి ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమానికి గ్రామంలోని ప్రతి ఒక్కరూ తమ బంధువులను ఆహ్వానించారు. ఈ క్రమంలోనే బెస్త రామన్న ఇంటికి పదిమంది చిన్నారులతో సహా 20 మందికిపైగా బంధువులు వచ్చారు. వారంతా శుక్రవారం ఉదయం గుడిలో జరిగిన పూజా కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. మధ్యాహ్నం అందరూ కలిసి ఆలయంలోనే భోజనం చేశారు. ఆపై సరదాగా కబుర్లు చెప్పుకున్నారు.

ఆ తర్వాత గ్రామ సమీపంలోని చెరువు నీళ్లతో కళకళలాడుతూ ఉండటంతో సరదాగా చూసొద్దామని 17 మంది వెళ్లారు. వారంతా గట్టు అవతలివైపు ఉన్న లింగమయ్య గుట్టలోని పురాతన దేవాలయాన్ని చూడాలనుకున్నారు. రామన్న కుమారుడు రాజు మూడు విడతలుగా వారిని తెప్పలో అవతలి గట్టుకు తీసుకు వెళ్లాడు. అక్కడ సరదాగా గడిపిన తర్వాత అందరూ ఒకేసారి తిరుగు ప్రయాణమయ్యారు. అందరూ ఒకేసారి వెళితే తెప్ప తిరగబడుతుందేమోనని వారిలో వారు చర్చించుకున్నారు. అయితే.. ఎక్కువగా చిన్నపిల్లలు ఉండటంతో ఏం కాదనే ధీమాతో బయలుదేరారు. కానీ చెరువులో కొద్దిదూరం రాగానే తెప్ప తిరగబడింది. అందరూ నీటిలోకి పడిపోయారు. దీంతో ఒక్కసారిగా గందరగోళం ఏర్పడింది. తెప్ప నడుపుతున్న బెస్త రాజు... సుమిత్ర (7) అనే చిన్నారిని తీసుకుని ఒడ్డుకు చేర్చాడు. బోయ రాజు అనే మరో యువకుడు ఈత కొడుతూ ఒడ్డుకు చేరుకున్నారు. బెస్త రాజు ఈతకొడుతూ తిరిగి తెప్ప వద్దకు వచ్చేసరికి ఎవ్వరూ కన్పించలేదు.

మృతదేహాల వెలికితీత
సాయంత్రం 5.45 గంటలకు జరిగిన ఘటన గురించి వైటీ చెరువు గ్రామస్తులకు తెలియడంతో  చెరువువద్దకు చేరుకున్నారు. గ్రామంలోని మత్స్యకారుల సహాయంతో రాత్రి ఏడు గంటలలోపు అన్ని మృతదేహాలను వెలికి తీశారు. తెప్పలో ప్రయాణించిన 17 మందిలో 13మంది దుర్మరణం చెందారు. ముగ్గురు ప్రాణాలతో బయటపడగా, వైటీచెరువు గ్రామానికి చెందిన శివ(3) అనే చిన్నారి గల్లంతయ్యాడు. మృతి చెందినవారిలో తొమ్మిది మంది చిన్నపిల్లలు (2–13 ఏళ్లలోపు), నలుగురు మహిళలు ఉన్నారు. వీరిలో ఎవ్వరికీ ఈత రాదు. తెప్ప తిరగబడటంతో అంతా కేకలు వేస్తూ, క్షణాల్లోనే నీటిలో మునిగిపోయి ప్రాణాలు కోల్పోయారు.

మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గుంతకల్లు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రాణాలతో బయటపడిన సుమిత్ర (7) అనే చిన్నారిని కూడా చికిత్స కోసం గుంతకల్లు ఆస్పత్రిలోనే చేర్పించారు. తన తల్లి ఎర్రమ్మ నీళ్లలో మునిగి చనిపోయిందని, తాను రాజు అన్న బనియన్‌ పట్టుకుని ఒడ్డుకు చేరినట్లు సుమిత్ర విలపిస్తూ చెప్పింది. తెప్ప సామర్థ్యంకన్నా ఎక్కువమంది ఎక్కడం వల్లే ప్రమాదం జరిగిందని అనంతపురం రేంజ్‌ డీఐజీ ప్రభాకర్‌రావు, ఎస్పీ రాజశేఖర్‌బాబు తెలిపారు  

 రూ.3 లక్షల పరిహారం
సాక్షి, అమరావతి: వైటీ చెరువు విషాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల్లో పెద్దలకు రూ.3లక్షలు, చిన్నపిల్లలకు రూ.లక్ష చొప్పున పరిహారాన్ని ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్‌ వీరపాండియన్‌ ఓ ప్రకటనలో తెలిపారు

వైఎస్‌ జగన్‌ సంతాపం....
సాక్షి, హైదరాబాద్‌:  వైటీ చెరువులో జరిగిన తెప్ప ప్రమాదంలో 13 మంది మృతి చెందడం పట్ల వైఎస్సార్‌ సీపీ అద్యక్షుడు వై.ఎస్‌.జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.

ఒక గుండె ఆగింది..
బోయ రాజు తండ్రి చంద్రప్ప కూడా మృత దేహాలను వెలికి తీశాడు. వాటిని ఒడ్డుకు చేర్చి వరు సగా పేర్చాడు. బంధువులు చనిపోవడం, అందులో చిన్నపిల్లలు, మహిళలు ఉండటంతో చంద్రప్ప బోరున విలపిస్తూ గుండెపోటుతో అక్కడికక్కడే కుప్పకూలిపోయి ప్రాణాలు వదిలాడు. చనిపోయిన వారంతా విడపనకల్లు మండలం పెంచలపాడు, గుంతకల్లు మండలం దంచర్ల, గుంతకల్లు, వైటీ చెరువు గ్రామానికి చెందినవారు.

తలెట్లా ఎత్తుకు తిరగాలి..
గుత్తి రూరల్‌: ‘ బంధువులందరూ వచ్చినారని సంబరపడిపోతే అంతలోనే ఎంత పని జరిగింది మామా.. రేప్పొద్దున అందరూ రాముడింటికి వచ్చిన వాళ్లు సచ్చిపోయినారంట అంటే నేను తలెట్లా ఎత్తుకుని తిరగాల్రా దేవుడా’ అంటూ    బెస్త రామన్న గుండెలు బాదుకుని విలపించారు.

మృతులు వీరే..
లావణ్య (13), దుర్గమ్మ (12),  లలిత     (40), నేత్ర     (3), ముకుల్‌(2), రాజేశ్వరి (23), లక్ష్మీ(12), నితిన్‌కుమార్‌ (4), బన్ని(12), అనంతలక్ష్మి(35), సుధాకర్‌ (4), స్పందన (3), ఎర్రమ్మ (35).

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement