యమపురికి ద్వారాలు
సాక్షి, సంగారెడ్డి: కాపలాలేని రైల్వే క్రాసింగ్‌లు యమపురికి ద్వా రాలుగా మారుతున్నాయి. వెల్దుర్తి మండలం మాసాయిపేట ప్రమాద ఘటనే ఇందుకు తార్కాణం. మాసాయిపేట వద్ద కాపలాలేని రైల్వే క్రాసింగ్ వద్ద నాందేడ్ ప్యాసింజర్ రైలు తూప్రాన్‌కు చెందిన కాకతీయ టెక్నోస్కూల్ బస్సును ఢీకొట్టడంతో 16 మంది మృతి చెం దిన విషయం తెలిసిందే. పలువురు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉంది. జిల్లా చరిత్రలోనే మాసాయిపేట ఘటన అతిపెద్ద ప్రమాదంగా చెప్పుకోవచ్చు. రైల్వే శాఖ తీరుపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. రైల్వే శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే గురువారం నాటి ఘటన చోటు చేసుకుందని చెబుతున్నారు. తాజా ప్రమాదంతో జిల్లాలోని రైల్వే క్రాసింగ్‌ల వద్ద భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో జహీరాబాద్, మెదక్, గజ్వేల్, పటాన్‌చెరు నియోజకవర్గాల గుండా మొత్తం 82 కిలోమీటర్లకుపైగా రైలుమార్గం ఉంది. 30 రైల్వే క్రాసింగ్‌లకుగాను 13 చోట్ల కాపలాలేని రైల్వే క్రాసింగ్‌లున్నాయి. కాపలాలేని 13 రైల్వే క్రాసింగ్‌ల వద్ద రైల్వే శాఖ సత్వరం భద్రతా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.
కాపలాలేని రైల్వే క్రాసింగ్స్ ఇవీ ..
జహీరాబాద్ నియోజకవర్గం పరిధిలో మొత్తం 12 రైల్వే క్రాసింగ్స్ ఉండగా వీటిలో ఐదుచోట్ల కాపలా లేరు. కోహీర్-పైడిగుమ్మల్ గ్రామానికి వెళ్లే రోడ్డుకు కాపాలా లేని రైల్వే గేటు ఉంది. జహీరాబాద్ మండలం అల్లీపూర్ గ్రామంలో వ్యవసాయ పొలాలకు వెళ్లే దారిలో కాపలాలేని లెవెల్ క్రాసింగ్ ఉంది.
న్యాల్‌కల్ మండలంలో మామిడ్గి-బసంత్‌పూర్ వెళ్లే రోడ్డుకు రాష్ట్ర సరిహద్దులో గల రాజోలా వద్ద కాపలాలేని లెవెల్ క్రాసింగ్ ఉంది. న్యాల్‌కల్ మండలం గంగ్వార్ నుంచి కర్ణాటక వెళ్లే రోడ్డుకు కాపలాలేని లెవెల్ క్రాసింగ్ ఉండగా ఇటీవల మూసివేశారు. కోహీర్ నుంచి పోతిరెడ్డిపల్లి గ్రామానికి వెళ్లే రోడ్డుకు కాపలాలేని లెవెల్ క్రాసింగ్ ఉంది. దీనిని రైల్వే శాఖ మూసివేసేందుకు రెండేళ్ల క్రితం ప్రతిపాదించింది. ప్రజల ఆందోళనలతో వాయిదా వేశారు. గజ్వేల్ నియోజకవర్గంలో 18 కిలోమీటర్ల మేర రైల్వేలైన్ ఉండగా మొత్తం 8 రైల్వే క్రాసింగ్‌లు ఉన్నాయి.
వీటిలో నాలుగు రైల్వే క్రాసింగ్‌ల వద్ద కాపలా లేవు. మాసాయిపేట, కూచారం తండా, లింగారెడ్డిపేట, పడాలపల్లి రైల్వేక్రాసింగ్ వద్ద కాపలాలేక తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. శుక్రవారం మాసాయి రైల్వేక్రాసింగ్ వద్ద రైల్వేశాఖ అవసరమైన భద్రతా చర్యలు చేపట్టింది. మెదక్ నియోజకవర్గంలో 14 కిలోమీటర్ల మేర రైల్వేలైన్ ఉండగా 8 రైల్వే క్రాసింగ్‌లు ఉన్నాయి. వీటిలో నాలుగుచోట్ల కాపలా లేదు. శేరిపల్లి-మిర్జాపల్లి గ్రామాల మధ్యన రైల్వే క్రాసింగ్, కామారం తండా-కామారం రైల్వే క్రాసింగ్, కామారం తండా-చిన్నశంకరంపేట రైల్వేక్రాసింగ్, పోలంపల్లి వద్ద రైల్వేక్రాసింగ్ వద్ద కాపలాలేవు.
వాహనదారుల నిర్లక్ష్యం తోడవుతోంది...
రైల్వేశాఖ నిర్లక్ష్యానికితోడు వాహనదారులు నిర్లక్ష్యం ప్రమాదాలకు దారితీస్తోంది. రైల్వేక్రాసింగ్స్ వద్ద వాహనదారులు, రోడ్డుదాటే పాదచారులు అజాగ్రత్తగా వ్యవహరిస్తున్న సందర్బాలున్నాయి. రైలు వచ్చేలోగా పట్టాలు దాటేయవచ్చన్న ధీమాతో వాహనదారులు తమ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. దీనికితోడు వాహనదారులు డ్రైవింగ్ చేస్తూ ఫోన్‌లో సంభాషించటం ప్రమాదాలకు కారణమవుతోంది. రైలు డ్రైవర్లు రైల్వేక్రాసింగ్‌ల వద్ద హారన్ మోగించకపోవటం, కొన్నిచోట్ల రైళ్లు క్రాసింగ్‌వద్ద కానరాకపోవటం ప్రమాదాలకు దారితీస్తోంది.