లోకేశ్.. నీవో మంత్రివా!?
చంద్రబాబు, లోకేశ్ బెదిరింపులకు తాను భయపడబోనని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) అన్నారు.
- నీ బెదిరింపులకు భయపడం
- బాబు జైలుకెళ్లే వరకూ నిద్రపోను: లోకేశ్‌పై ఆర్కే నిప్పులు
సాక్షి, హైదరాబాద్ : జయంతికి, వర్థంతికి కూడా తేడా తెలియని నీవు ఓ మంత్రివా అంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) మంత్రి నారా లోకేష్‌పై నిప్పులు చెరిగారు. తనపై ఐటీ దాడులు చేయిస్తానంటూ లోకేష్ బెదిరించడంపై ఆర్కే తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దమ్ముంటే నీ ఆస్తులు, నా ఆస్తులపై సీబీఐ విచారణ వేయిద్దాం రా అని లోకేష్‌కు ఆర్కే సవాల్ విసిరారు.
బుధవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆర్కే మాట్లాడుతూ... ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు జైలుకెళ్లే వరకు నిద్రపోనన్నారు. వేయి నుంచి రూ.1200కోట్ల ధర పలికే సదావర్తి భూములను రూ.22 కోట్లకే బాబు, ఆయన బినామీలు కొట్టేస్తుండడంవల్లే తాము న్యాయస్థానాన్ని ఆశ్రయించామన్నారు. దేవాదాయ శాఖా మంత్రి మాణిక్యాలరావు హైకోర్టు తీర్పుపై స్పందించాక కూడా ఐటీ దాడులు చేయిస్తానంటూ మాట్లాడడానికి లోకేష్ ఎవరని ఆర్కే ఫైర్ అయ్యారు.
రూ.2 లక్షల కోట్లు ఎక్కడివి: ‘రెండు ఎకరాల నుంచి వచ్చిన మీరు రూ.2లక్షల కోట్లకు ఎలా ఎదిగారో సమాధానం చెప్పాలి..? మీరు చేస్తే వ్యాపారం వేరేవాళ్లు చేస్తే వ్యాపారం కాదా..? 600పై చిలుకు అబద్ధపు హామీలతో మీ నాన్న అధికారంలోకి వచ్చారని, వాటిపై దృష్టిపెట్టండి కానీ మమ్మల్ని బెదిరిస్తే బెదిరిపోం. అడ్డదారి లో అదృష్టం కొద్ది మంత్రివి అయ్యావు. బాధ్యతగా ఆలోచించాలి’ అని ఆర్కే హితవు పలికారు.