
పశ్చిమ గోదావరి జిల్లాలో విషాదం
నరసాపురం: పశ్చిమ గోదావరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గురువారం మొగల్తూరు మండలం నల్లావారి చెరువులోని ఆనంద్ ఆక్వా ఫ్యాక్టరీలో విషవాయువులు వెలువడి ఐదుగురు కార్మికులు మరణించారు. రసాయనిక ట్యాంకును శుభ్రం చేస్తుండగా విషవాయువులు లీక్ అయినట్టు తెలుస్తోంది. మృతులను ఈగ ఏడుకొండలు, జక్కంశెట్టి ప్రవీణ్, నల్లం ఏడుకొండలు, బొడ్డు రాంబాబు, తోట శ్రీనుగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.
పశ్చిమ గోదావరిలోనే తుందుర్రు వద్ద మెగా ఆక్వా ఫుడ్ పార్క్‌ను ఏర్పాటు చేయడాన్ని స్థానిక రైతులు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ పరిధిలోని గ్రామాల ప్రజలు నిరసన తెలియజేశారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తుందుర్రు వెళ్లి రైతులకు మద్దతు తెలిపారు. ఇక్కడ భారీగా పోలీసులను మోహరించి తమను వేధిస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. అయినా ప్రభుత్వం మెగా ఆక్వా ఫుడ్ పార్క్ ఏర్పాటుకే మొగ్గు చూపించింది. ఈ నేపథ్యంలో మొగల్తూరు సమీపంలో ఆక్వా పరిశ్రమలో ప్రమాదం చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.