
‘అసెంబ్లీ టైగర్.. ఆంధ్ర ప్యూచర్ వైఎస్ జగన్’
అమరావతి: మరో రెండేళ్ల తరువాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ శ్రీకారం చేస్తారని, అసెంబ్లీ టైగర్.. ఆంధ్ర ఫ్యూచర్ ఆయనే అని వైఎస్‌ఆర్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు ఆర్కే రోజా అన్నారు. గుంటూరులో జరుగుతున్న వైఎస్‌ఆర్‌సీపీ ప్లీనరీలో ఆమె మహిళా సంక్షేమంపై పలు తీర్మానాలు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆర్కే రోజా మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనపై నిప్పులు చెరిగారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న ప్లీనరీ చూస్తున్న చంద్రబాబుకు ముచ్చెమటలు పడుతున్నాయని ఎద్దేవా చేశారు. ‘రాజన్న మనల్ని వదిలేసి వెళ్లినా.. వైఎస్ విజయమ్మ కడుపున పుట్టిన ముద్దు బిడ్డ వైఎస్ జగనన్న మన మధ్య ఉన్నారు. మనకు జగనన్న ఉన్నారు. జగనన్నకు మనమందరం అండగా ఉండాలా? వద్దా? జగనన్నను ముఖ్యమంత్రి చేయడమే మనం రాజన్నకు నిజమైన నివాళి’..
జగనన్నే నాకు అమ్మా, నాన్న
‘నాకు తల్లిదండ్రులు లేరు. నాకు అండగా నిలిచిన జగనన్నకు నా చివరి రక్తపు బొట్టు వరకు తోడుంటాను. మహిళలంటే ఆకాశంలో సగం అంటారు. ఏపీలో మాత్రం ఆడవాల్లకు ఆత్మగౌరవం లేదు. ఆడవాళ్లు కన్నీళ్లు పెడితే ఆ రాష్ట్రం సుభిక్షంగా ఉండదంటారు. అందుకే వైఎస్‌ఆర్ పాలనలో ఆడబిడ్డలకు ఆస్తులుగా సొంత ఇల్లు ఇచ్చారు. పావలా వడ్డీకే రుణాలు ఇచ్చారు. తన సొంత బిడ్డ షర్మిలమ్మలాగా అందర్ని భావించారు. ఆడబిడ్డలు ఉన్నత చదువులు చదవాలని ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ప్రవేశపెట్టారు. యూనివర్సిటీ వరకు నడిపించిన గొప్ప అభ్యుదయవాది రాజన్న. భర్త లేని వితంతువులకు బతుకుతెరువునిచ్చారు. ప్రపంచంలోని తెలుగు వారంతా వైఎస్‌ఆర్‌ను గుండెలో గుడి కట్టుకున్నారు. రాఖి కట్టకపోయిన మనకు వైఎస్‌ఆర్ భద్రతనిచ్చారు’..
పాలకులే కాలయముళ్లు
ఇవాళ చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ కరవైంది. ఎక్కడైతే స్త్రీలను గౌరవిస్తారో అక్కడ దేవతలు నడియాడతారు అంటారు. ఇక్కడ కాల్‌మనీ–సెక్స్ రాకెట్లు నడుపుతున్నారు. పాలకులే కాలయముళ్లుగా మారుతున్నారు. డ్వాక్రా మహిళలను వంచించారు. మహిళలను కోర్టు మెట్లు ఎక్కించిన వంచకుడు చంద్రబాబు. రూ.14200 కోట్ల రుణమాఫీ హామీని బంగాళాఖాతంలో కలిపి డ్వాక్రా మహిళలకు టోకరా పెట్టారు. డ్వాక్రాను నేనే కనిపెట్టాను అంటారు. సత్య నాదేళ్ల, పీవీ సింధులను తానే తయారు చేశానని, అంబేడ్కర్‌కు భారతరత్న ఇప్పించింది తానే అని చంద్రబాబు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నారు. ప్రతి మహిళా కూడా రాజన్న రాజన్న అని కలవరిస్తున్నారు. ఈ రాష్ట్రంలో 6.64 లక్షల డ్వాక్రా సంఘాలు ఉంటే కేవలం 700 సంఘాలు మాత్రమే ఏ గ్రేడ్‌లో ఉన్నాయట. డ్వాక్రా మహిళ రుణమాఫీ కోసం వైఎస్ జగన్ అసెంబ్లీలో, బయట పోరాటం చేస్తున్నారు. వడ్డీనే రూ.7500 కోట్లు చెల్లించడం లేదు. డ్వాక్రా సంఘాల రుణాల వడ్డీలు రూ.10 వేల కోట్లకు చేరుకున్నాయి. చంద్రబాబు ఇచ్చింది కనీసం వడ్డీకి కూడా సరిపోవడం లేదు. 2015 నుంచి ఇప్పటి వరకు వడ్డీ లేని రుణాలకు సబ్సిడీ చిల్లి గవ్వ కూడా చెల్లించడం లేదు. కొత్త రుణాలు పుట్టడం లేదు. రాబోయే ఎన్నికల్లో మళ్లీ మోసపోకుండా చంద్రబాబుకు బుద్ధి చెబుదాం’..
అరాచక ఆంధ్రప్రదేశ్‌గా మార్చారు
‘ఆంధ్రప్రదేశ్‌ను చంద్రబాబు అరాచక ఆంధ్రప్రదేశ్‌గా మార్చారు. చంద్రబాబు పాలనలో కనీసం పట్టపగలు కూడా రక్షణ లేకుండా పోయింది. రావణాసురులు, నరకాసులుమాదిరిగా పాలకులు మారిపోయారు. బెడవాడ కనకదుర్గమ్మ చెంత జరుగుతున్న ఈ ప్లీనరీలో చంద్రబాబు పాలనకు చరమగీతం పాడుదాం. కడుపులో ఉన్న బిడ్డను కూడా మోసం చేసే మోసగాడు చంద్రబాబు. ఆడబిడ్డలకు మోసం చేస్తున్నారు. ఏపీలో ఆడబిడ్డలపై ఆరాచకాలు ఎంతగా పెరిగిపోయాయో కళ్లముందే కనిపిస్తోంది. ఇక్కడ ఉండి కూడా కాల్‌మనీ సెక్స్‌రాకెట్ వెలుగు చూసింది. నీవున్నా చోటే రైతుల భూములు లాక్కోని రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. ఆడవాళ్ల తాళిబొట్లు తెంచుతున్నారు.
రాజధానిలో మూడేళ్లలో విపరీతమైన అరాచకాలు జరుగుతున్నాయని డీజీపీనే చెబుతున్నారు. గతంలో కంటే 11 శాతం ఆడవాళ్లపై నేరాలు పెరిగిపోయాయి. టీడీపీ అధికారంలోకి వచ్చాక మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇన్ని జరుగుతున్నా ఆ ముఖ్యమంత్రి సీటును పట్టుకుని వేలాడుతున్నారంటే ఆయనకు నిజంగా సిగ్గు ఉందా? వరకట్నం హత్యలు పెరిగిపోయాయి. వరకట్నం వేదింపుల్లో 14 శాతం పెరిగాయి. ఆడవాళ్లపై అఘాయిత్యాలకు కారణమైన చింతమనేని, అచ్చి, బుచ్చి, గాలి, దూళి వంటి నాయకులను శిక్షించాలి’..
మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చారు
‘రాష్ట్రంలో కొత్తగా మద్యం పాలసీ తీసుకొచ్చి మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చారు. మశానానికి ముగ్గు ఉండదు... చంద్రబాబుకు సిగ్గు ఉండదు. ఇంటింటికి మద్యాన్ని సరఫరా చేసేందుకు చంద్రబాబు దగ్గరుండి ఏర్పాట్లు చేస్తున్నారు. 2022 వరకు మద్యం దుకాణాలకు లైసెన్స్ ఇచ్చారంటే ఆయన ఎలా పాలిస్తున్నారో అర్థం అవుతుంది. నారా వారి పాలన.. సారా పాలనగా మారింది. చీఫ్ మినిస్టర్ ఛీప్ లిక్కర్‌కు ప్రమోటర్‌గా వ్యవహరిస్తున్నారు. తాగినోడికి తాగినంత అన్నట్లు మద్యం తాగిస్తున్నారు. చంద్రబాబు విజన్ అంటే ఏమో అనుకున్నారు. ప్రభుత్వ బడులు మూసివేస్తుంటే ఇదేనా విజన్ అని అందరు భయపడుతున్నారు.
మద్యం దుకాణాల ఏర్పాటుపై 21 రాష్ట్రాలు సుప్రీంకోర్టు ఆదేశాలను పాటిస్తుంటే.. మన రాష్ట్రంలో ఇష్టారాజ్యంగా, అహంకారపూరితంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇలాంటి ప్రభుత్వంపైన మహిళలు తిరగబడాలి. చంద్రబాబు వాస్తు బాగోలేదని అసెంబ్లీకి దార్లు మార్చుతున్నారట. పిస్తా బస్తా లాంటి చిన్నబాబును కేబినెట్లోకి తీసుకుంటే బరువు తేడా వచ్చి మీ వాస్తు మారింది. మీరు ప్రజా తీర్పును గౌరవించి ఉంటే బాగుండేది. మద్యాన్ని ఓ మంత్రి హెల్త్ డ్రింక్ అంటున్నారు. రేపొద్దున్న బడులు, అంగన్‌వాడీ కేంద్రాల్లో కూడా మద్యం ఇస్తారేమో. ఇలాంటి మతిస్థిమితం లేని వారిని వెంటనే మెంటల్ ఆసుపత్రిలో చేర్పించాలి. ఆడవాళ్ల కన్నీళ్లలో చంద్రబాబు కొట్టుకుని పోతారు. డ్వాక్రా మహిళలను మోసం చేసిన చంద్రబాబు మెడలు వచ్చాలని, ఆడవాళ్లకు అండగా నిలవాలని జగన్ననకు ఓ చెల్లిలా కోరుతున్నాన’ని ఆర్కే రోజా అన్నారు.
సంబంధిత కథనాలు:
‘నంద్యాలలో టీడీపీ సంగతి చూస్తాం’
‘ఫ్యాక్షనిస్టు అంటే చంద్రబాబే’
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోలేదు: ధర్మాన
అవినీతి చక్రవర్తి పుస్తకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి
ఎన్టీఆర్ సినిమాలో విలన్ ఆయనే!
వైఎస్ జగన్ సీఎం కాకూడదనే..