పుస్తకాలు కొంటున్నారు ప్రచారం చేయండి... | Books are buying.. Please campaign it | Sakshi
Sakshi News home page

పుస్తకాలు కొంటున్నారు ప్రచారం చేయండి...

Published Sat, Jun 7 2014 12:06 AM | Last Updated on Mon, Aug 13 2018 7:54 PM

పుస్తకాలు కొంటున్నారు ప్రచారం చేయండి... - Sakshi

పుస్తకాలు కొంటున్నారు ప్రచారం చేయండి...

ప్రచారం వల్ల జరిగే మేలు ఏమిటంటే ప్రచారం చేసిన వాడు ప్రధాని అవుతాడు. చేయనివాడు రాహుల్‌గాంధీ అవుతాడు. పుస్తకాలది కూడా ఇదే సూత్రం. ఈ మధ్య నేను కొన్ని తెలుగు పుస్తకాలు చూశాను. తొలి ముద్రణ 2013. మలిముద్రణ కూడా 2013. అన్ని ఖర్చులు పోగా రచయితకు 35 వేలు మిగిలాయి. ఒక పుస్తకం ఆగస్టు 2013లో అచ్చయ్యి డిసెంబర్ 2013కు రీప్రింట్ అయ్యింది. ప్రింటింగ్ ఖర్చు స్పాన్సరర్ చూసుకోవడం వల్ల అమ్మకాల్లో విశాలాంధ్రకు ఫిఫ్టీ పర్సెంట్ కమిషన్ ఇచ్చినా సరే రచయితకు 70 వేలు వచ్చాయి. మరో పుస్తకం కాస్త స్లోగా పోతూ ఉండింది. దానికి అవార్డు వచ్చింది. వెంటనే కాపీలు చెల్లిపోయాయి. ఈ మూడుపుస్తకాలలో సామ్యం ఏమిటంటే మూడు తన గురించి తాను ప్రచారం చేసుకున్నాయి. అంతర్జాలం అనండి సోషల్ మీడియా అనండి... పాఠకుడంటే పత్రికలు చదువుతూ కనిపించేవాడే కాదు కంప్యూటర్ వాడుతూ కనిపించేవాడు కూడా. ఇటీవల కథ 2013కు ఆవిష్కరణకు వెళ్లాను. వేదిక దగ్గరే తెచ్చిన కాపీలు అయిపోయాయి. అంటే కొనే పాఠకులు ఉన్నారు. అమ్మడంలోనే లోపం ఉంది.
 
 అనంతరామ్ పేరు విన్నారా? అతడు ఒక యువ బ్లాగర్. 2013లో ‘రామ్ ఎట్ శ్రుతి డాట్‌కామ్’ అనే పేరుతో తన తొలి ప్రేమ కథా నవలని ఈబుక్‌గా ప్రచురించుకున్నాడు. అంటే అచ్చులో కాకుండా ఎలక్ట్రానిక్ బుక్‌గా ఇంటర్‌నెట్ పాఠకుల కోసం అందుబాటులోకి తెచ్చాడు. పెద్ద హిట్ అయ్యింది. వచ్చిన రాయల్టీతో అచ్చు పుస్తకం తెచ్చుకున్నాడు. అంటే  తెలుగు భూభాగం మీద ఉండే పాఠకుడే కాక ఆక్‌లాండ్ నుండి, ఆసియా నుండి,  ఆఫ్రికా నుండి, అమెరికా సంయుక్త రాష్ట్రాల దాకా వాటి మధ్య ఉన్న దేశాలలోని తెలుగు పాఠకుడు ఈ రోజు తెలుగు పుస్తకాలు కొనుక్కుంటున్నాడు. లక్షల రూపాయలు వెచ్చిస్తున్నాడు. ఏటా అనధికార గణాంకాల ప్రకారం మన రాష్ట్రంలో (ఇరు రాష్ట్రాల్లో) సుమారుగా పదిహేను కోట్ల రూపాయల విలువ గల పుస్తక క్రయ విక్రయాలు జరుగుతున్నాయి. ఈ లెక్కలో జాలం ద్వారా అమ్మిన అచ్చు పుస్తకాలు కాని డిజిటల్ పుస్తకాలు కాని కలపలేదు. అలాగే విదేశాలలో ముద్రణ పొంది అమ్ముడవుతున్న తెలుగు పుస్తకాల గణాంకాలు లేవు. తెలుగువారు ఎనిమిది కోట్లు అనుకుంటే కనీసం మనిషికి రెండ్రూపాయలు ఖర్చు పెడుతున్నట్టే లెక్క. 
 
 పోయిన రోజుల్లో రచయితలకు చిన్న చిన్న లౌల్యాలు చూపి వారి చేత పుస్తకాలు రాయించుకుని పబ్లిషర్లు బాగుపడేవారు (అని అంటారు). కాని ఇవాళ పబ్లిషర్ల బెడద దాదాపు లేదు. రాసిన వాడే వేసుకోవచ్చు. అమ్మగలిగితే లాభాలు చూడవచ్చు. పూర్వం లేదా ఇప్పటికీ కొందరు  ‘నా పుస్తకంలో దమ్ముంటే అదే అమ్ముడవుతుంది’ అనే ధోరణిలో పుస్తకం తెచ్చి పుస్తకాల షాపుల్లో పడేసి మిన్నకుండటం చూస్తున్నాం. అలా చేయడం సరి కాదు. పాఠకుడి చూపు కేవలం మీ పుస్తకం మీదే ఉండదు. అతణ్ణి చుట్టు ముట్టేసిన విషయాలు చాలా ఉంటాయి. పొద్దున లేచినప్పటినుంచి ఫోనులో ఎస్‌ఎంఎస్ ప్రకటనలు, దినపత్రికల్లో ప్రకటనలు, మళ్లీ వాటిలో లీఫ్‌లెట్లు కరపత్రాలు, ఇంటి గేటుకి ప్లేటులు, బస్సుల మీద ప్రకటనలు, రహదారికి అటూ ఇటూ హోర్డింగ్‌ల మీద ప్రకటనలు.. ఇన్ని ఊదరగొడుతుంటే వాటి మధ్య మీ పుస్తకాన్ని గుర్తు పట్టి అతడు కొనుక్కోవాలంటే మీరూ దానిని విస్తృతంగా ప్రచారం చేయాలి.
 
 ఇటీవల ఒక యువ రచయిత ప్రచారానికి ముందే సోషల్ మీడియాలో తన పుస్తకం రాబోతున్నదని ఇదిగో దాని కవర్ ఇలా ఉంటుందని అందులో సారం ఇలా ఉంటుందని ప్రచారం చేస్తూ వచ్చాడు. ఆవిష్కరణకు ముందే పత్రికాఫీసులన్నీ తిరిగి ఆ పుస్తకం మీద రివ్యూల హామీ తీసుకున్నాడు. ఆవిష్కరణ అవుతుండగానే బుక్‌స్టాల్‌లో కాపీలు ఉండేలా చూసుకొని విదేశాల్లో ఉన్న పాఠకుల కోసం ఇ బుక్ కూడా రిలీజ్ చేశాడు. అప్పుడు ఆ పుస్తకం నలుగురి దృష్టిలో పడి విడుదలైన వెంటనే బాగా అమ్మకం జరిగింది. 
 
 కాబట్టి మీ పుస్తకంలో దమ్ముండడం ఒక్కటే చాలదు. ఆ దమ్మున్న సంగతి నలుగురికీ తెలియాలి. డీలా పడాల్సిన అవసరం లేదు. మీది మంచి పుస్తకమే అయితే దానిని కొనే పాఠకులు ప్రపంచమంతా ఉన్నారు. నమ్మండి. ప్రచారం చేయండి.
 - అనిల్ అట్లూరి 8142642638

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement