ఐవైఆర్ కృష్ణారావుపై ఏపీ ప్రభుత్వం వేటు
విజయవాడ: ఐవైఆర్ కృష్ణారావుపై చంద్రబాబు నాయుడు సర్కార్ అనూహ్య వేటు వేసింది. సోషల్ మీడియాలో కృష్ణారావు చేసిన పోస్టులను సాకుగా చూపిస్తూ ఆయనను బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి తొలగించింది. అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు. టీడీపీ నేతల ఫిర్యాదుతోనే చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. చైర్మన్ కృష్ణారావును ఎలాంటి వివరణ అడగకుండానే ఆయనను పదవి నుంచి తొలగించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఐవైఆర్ స్థానంలో వేమూరి ఆనంద సూర్యను చైర్మన్‌గా నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే చంద్రబాబు సర్కార్ తీరును రాష్ట్ర బ్రాహ్మణ సంఘాలు తప్పుపడుతున్నాయి. ఉన్నత హాదాలో ఉన్న వ్యక్తిని అడిగి వివరణ తెలుసుకోకుండానే కృష్ణారావును బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి ఎలా తొలగిస్తారని బ్రాహ్మణ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.
కార్పొరేషన్ నిధులపై ఐవైఆర్ ప్రశ్నించడాన్ని తట్టుకోలేకే సీఎం చంద్రబాబు ఆయనను తప్పించారన్న వాదనలు వినిపిస్తున్నాయి. నేటి మధ్యాహ్నం మూడు గంటలకు కృష్ణారావు మీడియా సమావేశంలో పాల్గొని తనకు జరిగిన అన్యాయాన్ని వివరించనున్నారు. గతంలో ఎన్నో ఉన్నత హాదాల్లో పనిచేసిన ఆయనకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా చేసిన విశిష్ట అనుభవం ఉంది. అయినప్పటికీ కేవలం సోషల్ మీడియాలో బ్రాహ్మణ కార్పొరేషన్ పై పోస్టులు చేశారన్న కారణంగా చైర్మన్ బాధ్యతల నుంచి తప్పించడంతో ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
టీడీపీ నేతల సిఫారసులను ఏ మాత్రం పట్టించుకోకుండా, నిజాయతీగా పూర్తి నిబద్ధతతో పనిచేస్తున్న కృష్ణారావును ఉద్దేశపూర్వకంగానే తొలగించారన్న వాదనలు వినిపిస్తున్నాయి. సీనియర్ ఐఏఎస్‌ల వాక్ స్వాతంత్ర్యపు హక్కులను కాలరాస్తుండటంతో తమ పరిస్థితి ఏంటని ఇతర ఐఏఎస్‌లు ఆందోళన చెందుతున్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ నిధులను పక్కదారి పట్టిస్తున్నారన్న పోస్ట్‌లు షేర్ చేశారని, ప్రభుత్వాన్ని ఎప్పుడూ విమర్శించలేదని తెలుస్తోంది.