ఎన్టీఆర్ సినిమాలో విలన్ ఆయనే!
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జోగి రమేష్
గుంటూరు: మూడు సంవత్సరాల టీడీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలను వేధిస్తూ, అరాచక పాలన సాగిస్తున్నారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జోగి రమేష్ ధ్వజమెత్తారు. అంగన్‌వాడీ కార్యకర్తలను ఏనుగులతో తొక్కించి పోలీస్ స్టేషన్‌లో బంధించిన విషయం ప్రజలందరికీ తెలుసని ఆయన గుర్తుచేశారు. ఎన్టీఆర్ జీవిత చరిత్రలో అసలు విలన్ చంద్రబాబేనని అన్నారు. 'దర్శకుడు రాంగోపాల్‌వర్మ ఎన్టీఆర్ జీవిత చరిత్రపై సినిమా తీస్తున్నారు. దాంట్లో హీరోగా మా మామ బాలకృష్ణ అయితే సరిపోతాడని లోకేశ్ చెబుతున్నారు. హీరో బాలకృష్ణ కరెక్టే కానీ విలన్ ఎవరు?' అని ప్రశ్నించగా.. పార్టీ శ్రేణుల నుంచి 'చంద్రబాబు' అని స్పందన వచ్చింది. చంద్రబాబును విలన్‌గా పెట్టి ఎన్టీఆర్ సినిమాను తీయాలని ఆయన వర్మను కోరారు. ఎన్టీఆర్‌ని రాళ్లతో, చెప్పులతో కొట్టించి ఆయన చావుకు కారణం అయ్యింది చంద్రబాబు కాదా అని నిలదీశారు. ఎన్టీఆర్ పుట్టుక నుంచి మరణం వరకు స్పష్టంగా సినిమా తీసి ఆయన చావుకు చంద్రబాబే కారణం అని చెప్పాలని రాంగోపాల్‌వర్మను కోరారు.
బీసీలకు ఏం చేశారు?
1995 నుంచి 2004 వరకు బీసీలంతా టీడీపీకి అండగా ఉంటే చంద్రబాబు బీసీలకు ఏం చేశారని నిలదీశారు. ఆదరణ, ముందడుగు పథకాలతో ఏ కులంలో పుట్టినవారు అదే కుల వృత్తి చేసుకోవాలని అణగదొక్కారని మండిపడ్డారు. 2004లో టీడీపీని బంగాళాఖాతంలో కలిపిన వైఎస్‌ఆర్ 24 లక్షల మంది బీసీ పిల్లలు బీటెక్, ఎంబీబీఎస్ చదువుకునేలా చేశారని కొనియాడారు. రాష్ట్రంలో ఏ ఒక్క కష్టం వచ్చినా పేదల పక్షాన వీరుడిలా ప్రత్యక్షమయ్యేది వైఎస్ జగన్ ఒక్కరే. వైఎస్ జగన్‌న్ను చూస్తే చంద్రబాబుకు వణుకుపడుతుంది. 'చేసిన పాపాలకు చంద్రబాబు జైలుకు వెళ్లడం కాదు.. సరాసరి కృష్ణా, గోదావరి సంగమంలో కలిసిపోతాడు. ఓటుకు కోటు కేసులో దొరికిపోయావు. అడ్డంగా ఆడియో టేపులతో దొరికిపోతే నువ్వు దొంగవి కాక దొరవా చంద్రబాబు. నిన్నగాక మొన్న హెరిటేజ్ వాహనంలో ఎ్రర చందనం దుంగలు దొరికాయి' అని జోగి రమేశ్ విమర్శించారు.