ఐఏఎస్ కావాల్సిన యువతి...
ఐఏఎస్ కావాల్సిన యువతి...
Published Thu, Jan 19 2017 11:49 AM | Last Updated on Sat, Sep 22 2018 7:37 PM
ఆమె ఉన్నత విద్యావంతురాలు. ఇప్పటికే ఎంబీఏ పూర్తిచేసి, ఐఏఎస్ కావాలనే లక్ష్యంతో సివిల్స్‌కు ప్రత్యేకంగా కోచింగ్ తీసుకుంటోంది. సంక్రాంతి సెలవుల కోసం ఇంటికి వచ్చిన ఆమె.. అంతలోనే తాగుబోతుల కారణంగా రోడ్డు ప్రమాదంలో మరణించింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆమె చెల్లెలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు - నరసాపురం రోడ్డులో దిగమర్రు వద్ద ఈ ప్రమాదం జరిగింది. పాలకొల్లు నుంచి నరసాపురం వెళ్తున్న సఫారీ కారు అదే రోడ్డులో వెళ్తున్న హోండా యాక్టివా స్కూటర్‌ను ఢీకొంది. ఆ స్కూటర్‌పై అక్కాచెల్లెళ్లు దంగేటి గౌతమి, దంగేటి పావని వెళ్తున్నారు.
ఆ కారు గౌతమిని సుమారు 200 మీటర్ల దూరం ఈడ్చుకుపోయి, నరసాపురం పెదకాలువలోకి దూసుకుపోయింది. స్కూటర్ దిగమర్రు పంటకాలువలో పడిపోయింది. అక్కాచెల్లెళ్లు తీవ్రంగా గాయపడటంతో వారిని స్థానికులు నరసాపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. గౌతమికి రెండు కాళ్లు విరిగిపోయి తీవ్రంగా గాయపడింది. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మరణించింది. పావని చికిత్స పొందుతోంది. కాగా, గౌతమి తండ్రి ఏడాది క్రితమే చనిపోయారు. ఆ దుఃఖం నుంచి కుటుంబం కోలుకోకముందే గౌతమి మరణించడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
మద్యం మత్తు వల్లే ప్రమాదం
టాటా సఫారీలో వెళుతున్న యువకులు మద్యం సేవించి ఉన్నారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కారుకు సమీపంలో మద్యం బాటిల్ కవరు రోడ్డుకి అతుక్కుపోయి ఉంది. బాటిల్ నుజ్జునుజ్జు అయ్యింది. మద్యం మత్తులో మోటారు సైకిల్‌ను ఢీకొట్టారని అంటున్నారు. ప్రమాదానికి కారకులైన నిందితులు పారిపోయారు.
Advertisement