హైదరాబాద్: ‘ప్రత్యక్ష ఎన్నికల్లో నిలబడి ఎమ్మెల్యేగా ఏపీ ప్రభుత్వంలోకి అడుగుపెట్టు. ఎమ్మెల్సీగా రావాల్సిన అవసరం ఏముంది. అమెరికాలో ట్రంప్‌నే గెలిపించాను. అలాంటిది ఈ ఎమ్మెల్సీ ఎంత? నీకోసం ప్రచారం చేసి ఎమ్మెల్యేగా గెలిపించలేనా’ అని క్రైస్తవ మత ప్రచారకుడు డాక్టర్ కేఏ పాల్ నారా లోకేశ్‌కు సూచించారు.
టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుమారుడు నారా లోకేశ్‌కు సోమవారం ఆయన హితబోద చేశారు. లోకేశ్ ఎమ్మెల్సీగా రావొద్దని, ఎమ్మెల్యేగా బరిలోకి దిగాలని సూచించారు. అవసరమైతే తానే స్వయంగా లోకేశ్‌ను గెలిపించేందుకు ప్రచార బాధ్యతలు భుజానికెత్తుకుంటానని, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కోసం ప్రచారం చేసి గెలిపించినట్లుగానే లోకేశ్‌కు ప్రచారం చేస్తానని హామీ కూడా ఇచ్చారు. ఈ విషయంలో లోకేశ్ ఏమాత్రం వెనకడుగు వేయోద్దంటూ ట్వీట్ ద్వారా చురకలంటించారు.
ఇప్పటికే నారా లోకేశ్ ఎమ్మెల్సీ పదవిని చేపట్టడం ద్వారా ఏపీ మంత్రి వర్గంలోకి అడుగుపెట్టబోతుండటంపై పలు వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తూ పరోక్షంగా విమర్శలు చేస్తున్నాయి. దమ్ముంటే లోకేశ్ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవిని చేపట్టాలే తప్ప ఇలా దొడ్డిదారిలో ఎమ్మెల్సీ ముసుగు రావడమేమిటంటూ పెదవి విరుస్తున్నారు. పైగా తన సామర్థ్యాన్ని మెచ్చి పొలిట్ బ్యూరో తనకు ఎమ్మెల్సీ బాధ్యతలు కట్టబెట్టినందుకు ధన్యవాదాలు చెబుతూ లోకేశ్ ట్వీట్ చేయడంపై జనాలు ఒకింత ఆశ్చర్యపోతున్నారు. దానికి అదనంగా ఇప్పుడు కేఏ పాల్ చేసిన ట్వీట్ ఇప్పుడు ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తోంది.
@naralokesh Contest in elections and be an MLA, I will campaign for you like the way I did for Trump. Never give up
— Dr K.A. Paul (@KAPaulOffiicial) 27 February 2017