
చంద్రబాబుది పిండారి పాలన: ఉండవల్లి
రాజమండ్రి: ఏపీ ప్రభుత్వ పనితీరుపై కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మండిపడ్డారు. శనివారం రాజమండ్రిలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆయన విమర్శించారు. అసలు పోలవరం ప్రాజెక్టును కట్టే ఉద్దేశం ప్రభుత్వానికి ఉందా? అని ప్రశ్నించారు. ప్రాజెక్టు పనుల్లో నాణ్యతా లోపాలు ఉన్నాయన్నారు. పల్లెల్లో నిర్మించే సీసీ రోడ్లలను(సిమెంట్) తలపించేలా పోలవరం స్పిల్‌వేలను నిర్మస్తున్నారని మండిపడ్డారు. కోట్లు ఖర్చు చేసి నిర్మించిన స్పిల్‌వే అప్పుడే బీటలు వచ్చిందన్నారు. పోలవరం నిర్మణ వ్యయాన్ని రూ. 40 వేల కోట్లకు ఎందుకు పెంచారో అర్ధం కావడం లేదని అన్నారు.
పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులపై టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి విసిరిస సవాలుపై ఆయన స్పందించారు. ప్రాజెక్టులపై చర్చకు సిద్ధమని పేర్కొన్నారు. టీడీపీ పాలనను ప్రజలు వ్యతిరేకిస్తున్నారని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం పిండారి పాలనును మించిపోయిందని ఉండవల్లి ఎద్దేవా చేశారు. వైఎస్ పోలవరాన్ని ఆరంభిస్తే చంద్రబాబు తానే పూర్తి చేస్తున్నానని ఇది తన కల అని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. వైఎస్ ప్రతిపాదించిన విధంగా పోలవరం నిర్మిస్తే అనుకున్న బడ్జెట్ కే పూర్తయ్యేదని, కానీ ప్రభుత్వాలు ఆలస్యం చెయ్యడం వల్ల బడ్జెట్‌ను పెంచేశారని ఆయన విమర్శించారు.