
సినీ పరిశ్రమకు విశాఖ అనువు
ఆంధ్రప్రదేశ్‌లో సినీపరిశ్రమ అభివృద్ధికి విశాఖపట్నం అనువైన ప్రాంతమని సీనియర్ క్యారెక్టర్ నటుడు జీవా అభిప్రాయపడ్డారు. ఒకప్పుడు చెన్నైలో స్థిరపడిన సినీపరిశ్రమ హైదరాబాద్‌కు రావడానికి అప్ప టి సినీపెద్దల దశాబ్దాల కృషి ఉందని గుర్తుచేశారు. ఇప్పుడు రాష్ట్ర విభజన నేపథ్యంలో హైదరాబాద్‌కు ప్రత్యామ్నాయంగా నవ్యాంధ్రలోనూ తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. దీనిపై ఆలోచించాల్సింది.. ఆచరణలో పెట్టాల్సింది సినీ పెద్దలేనని చెప్పారు. శ్రీ హరిహర ఆర్ట్ మూవీ స్ పతాకంపై నిర్మితమవుతున్న ‘అందాల చందమామ’ సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు కాకినాడ వచ్చిన ఆయన సాక్షితో ముచ్చటించారు.
సినీరంగ ప్రవేశం?
దర్శకుడు కె.బాలచందర్ నాలోని నటుడిని గుర్తించి అవకాశమిచ్చారు. తమిళ్‌లో నా మొ దటి సినిమా ‘ఎంగ వూర్ కండగి’ తెలుగులో ‘తొలికోడికూసింది’.
సినీ యానం ఎలా ఉంది?
ఇక్కడ అవకాశాలు వడ్డించిన విస్తరి కాదు. ఎంతో కష్టపడాలి. నేనూ ఒడిదుడుకులు ఎదుర్కొన్నా. దర్శక నిర్మాతలు, నటుల ప్రోత్సాహం వల్ల ప్రయాణం సాఫీగా సాగుతుంది.
ఎన్ని భాషల్లో నటించారు?
విలన్‌గా, హాస్యనటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుగుతోపాటు తమిళం, హిందీ, కన్నడ భాషల్లో సుమారు వెయ్యికిపైగా సినిమాలు చేశా. తెలుగులో గులాబీ, నిన్నేపెళ్లాడతా వంటి ఎన్నో చిత్రాల్లో గుర్తుండిపోయే పాత్రలు చేశా. హిందీలో సర్కార్ సినిమా పేరు తెచ్చింది.
సినీ పరిశ్రమలో వస్తున్న మార్పులపై?
మార్పు సహజం. సమాజంలో వస్తున్న మార్పుకనుగుణంగానే మనం మారాలి.అప్‌గ్రేడ్ చేసుకోవాలి. అవకాశాలను అందిపుచ్చుకుంటేనే రాణింపు.
అందాల చందమామ గురించి?
కాకినాడకు చెందిన పీడీఆర్ ప్రసాద్‌రెడ్డి నిర్మిస్తున్న ‘అందాల చందమామ’ చక్కని కథాంశంతో తెరకెక్కుతుంది. ఈ సినిమాలో నేను సీబీఐ ఆఫీసర్‌గా చేస్తున్నా. నా పాత్రకు మంచి ఆదరణ, గుర్తింపు వస్తుంది.