ఊరందూరు పెద్దాయన ఇక లేరు | former MLA BOJJALA Ganga Subbarami Reddy, passes away | Sakshi
Sakshi News home page

ఊరందూరు పెద్దాయన ఇక లేరు

Published Thu, Jan 8 2015 2:24 AM | Last Updated on Wed, Apr 3 2019 5:55 PM

ఊరందూరు పెద్దాయన  ఇక లేరు - Sakshi

ఊరందూరు పెద్దాయన ఇక లేరు

మాజీ ఎమ్మెల్యే బొజ్జల గంగ సుబ్బరామిరెడ్డి కన్నుమూత
పలువురు నాయకుల సంతాపం
శుక్రవారం అంత్యక్రియలు

 
శ్రీకాళహస్తి: రాష్ట్ర అటవీశాఖమంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తండ్రి, మాజీ ఎమ్మెల్యే బొజ్జల గంగసుబ్బరామిరెడ్డి (95) బుధవారం స్వగ్రామం ఊరందూరులోని తమ నివాసంలో కన్నుమూశారు. వెంటనే ఆయన చిన్న కుమారుడు హరినాథరెడ్డి హైదరాబాద్‌లో ఉన్న మంత్రి గోపాలకృష్ణారెడ్డికి సమాచారం ఇచ్చారు. బుధవారం ఉదయం గంగసుబ్బరామిరెడ్డి కారులో రోడ్డుపక్కనే ఉన్న పంట పొలాలను పరిశీలించడంతో పాటు, పట్టణంలోని బంధువుల ఇంటికి వెళ్లి పలకరించారు. సాయంత్రం ఆరుగంటల సమయంలో శ్వాస అందక మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఆయన భార్య బొజ్జల విశాలాక్ష్మి 1995లోనే మరణించారు.

 శ్రీకాళహస్తి మండలం ఊరందూరు గ్రామంలో 1920 మే 14 వ తేదీన  బొజ్జల గంగిరెడ్డి, పోలమ్మ దంపతులకు బొజ్జల గంగసుబ్బరామిరెడ్డి జన్మించారు. వ్యవసాయ కుటుంబానికి చెందిన ఆయన తొమ్మిదో తరగతి వరకు మాత్రమే విద్యాభ్యాసం చేశారు.ఆయనకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. రాష్ట్ర అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి రెండో సంతానం.
 
రాజకీయ ప్రస్థానం

 ఊరందూరు గ్రామ కమిటీ చైర్మన్‌గా గంగసుబ్బరామిరెడ్డి 1957లో రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. గ్రామంలోని చెన్నకేశవస్వామి, నీలకంఠేశ్వరస్వామి ఆలయాలకు పదేళ్ల పాటు చైర్మన్‌గా పనిచేశారు. 1964లో సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1967లో ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్‌గా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి, అప్పటి విద్యాశాఖ మంత్రి అద్దూరు బలరామిరెడ్డిపై విజయం సాధించారు. 1972 ఎన్నికల్లో గంగ సుబ్బరామిరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఇండిపెండెంట్ అభ్యర్థి బలరామిరెడ్డి చేతిలోనే ఓడిపోయారు.
 
గంగసుబ్బరామిరెడ్డి మృతికి సంతాపం

 మాజీ ఎమ్మెల్యే గంగ సుబ్బరామిరెడ్డి మృతికి పలువురు సంతాపం తెలిపారు. వైఎస్సార్సీపీ శ్రీకాళహస్తి సమన్వయకర్త బియ్యపు మధుసూదన్‌రెడ్డితో పాటు పార్టీ నాయకులు గుమ్మడి బాలకృష్ణయ్య, మిద్దెల హరి, అంజూరు శ్రీనివాసులు, కొట్టేడి మధుశేఖర్, బర్రి హేమభూషణ్‌రెడ్డి, బర్రి సుదర్శన్‌రెడ్డి, వయ్యాల క్రిష్ణారెడ్డి తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌పార్టీ మాజీ ఎమ్మెల్యే తాటిపర్తి చెంచురెడ్డి ఊరుందూరుకు వెళ్లి గంగసుబ్బరామిరెడ్డి కుటుంబసభ్యులను ఓదార్చారు. టీడీపీ నాయకుడు, మున్సిపల్ చైర్మన్ పేట రాధారెడ్డి, వైస్ చైర్మన్ ముత్యాల పార్థసారథి, కొండుగారి శ్రీరామమూర్తి, పోతుగుంట గురవయ్యనాయుడు, రాంబాబు, తాటిపర్తి ఈశ్వరరెడ్డి, చెలికం పాపిరెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి, కంఠారమేష్, షాకీర్ అలీ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.
 
రేపు అంత్యక్రియలు


 బొజ్జల గంగసుబ్బరామిరెడ్డి మూడో సంతానమైన కుమార్తె విజయలక్ష్మి అమెరికాలో ఉన్నారు. దీంతో ఆయన అంత్యక్రియలు శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు నిర్వహించాలని భావించారు. ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, తెలంగాణ సీఎం కే చంద్రశేఖర రావు,  పలువురు మంత్రులు, వివిధ పార్టీల నాయకులు అంత్యక్రియలకు హాజరు కానున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement