
కన్నీళ్లు పెట్టుకున్న ఎమ్మెల్యే
గుంటూరు: ఇలాంటి దారుణం తానెప్పుడూ చూడలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తాఫా కన్నీళ్లు పెట్టుకున్నారు. మేడికొండూరు వద్ద టీడీపీ కార్యకర్తలు తమపై దాడి చేసి నలుగురు మహిళా ఎంపీటీసీలను కిడ్నాప్ చేసిన ఘటనపై ఆయన చలించిపోయారు. ఎమ్మెల్యే అయిన తనపైనే దాడి చేశారంటే సామాన్యుడి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. టీడీపీ కార్యకర్తలు తనను విచక్షణారహితంగా కొట్టారని వాపోయారు.
మహిళా ఎంపీటీసీలను దౌర్జన్యంగా లాక్కెళ్లారని తెలిపారు. కన్నీళ్లు పెట్టుకున్నా, ఫ్యామిలీ ఉందని చెప్పినా వినిపించుకోలేదన్నారు. చిన్నపిల్లలు ఉన్నారు వదలమని చెప్పినా పట్టించుకోలేదని చెప్పారు. ఇలా చేయడం చాలా తప్పు, చాలా దారుణమని పేర్కొన్నారు. సినిమాల్లో తప్ప బయట ఇలాంటి దౌర్జన్యాలు చూడలేదంటూ కన్నీళ్ల పర్యంతమయ్యారు. దాడిపై తాము సమాచారం అందించినా పోలీసులు స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.