మిరియాల వెంకట్రావును సన్మానిస్తున్న మంత్రి గంటా తదితరులు
విశాఖపట్నం: రానున్న రోజుల్లో సీమాంధ్రను శాసించేది కాపు కులస్తులేనని మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్రలో రానున్న రోజుల్లో కాపులే అధికారం చేపడతారని ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ కాపు, తెలగ, బలిజ, ఒంటరి, మున్నారు, తూర్పుకాపు, మిరియాల వెంకట్రావు సన్మాన ఆహ్వానసంఘం సంయుక్త ఆధ్వర్యంలో బీచ్‌రోడ్డులోని వైఎంసీఏలో ఆదివారం ఆంధ్రప్రదేశ్ కాపునాడు చైర్మన్ మిరియాల వెంకట్రావును సన్మానించారు.
కార్యక్రమంలో ముఖ్య అతిథి మంత్రి గంటా మాట్లాడుతూ తాను కాపు కులంలో పుట్టడం వల్లే ఎంపీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా రాజకీయ రంగంలో వివిధ హోదాల్లో పనిచేయగలిగానని, అలాంటి కాపు కులాన్ని బీసీల్లో చేర్చేందుకు శాయశక్తులా కృషి చేస్తానన్నారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ రాష్ట్రంలో సగం వంతు ఉన్న కాపుల్ని బీసీల్లో చేర్చేవరకు ప్రతిపక్షం తరఫున శాసనసభలో పోరాడతానన్నారు.
కాపునాడు రాష్ట్ర గౌరవాధ్యక్షుడు హనుమంతరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి మాణిక్యాలరావు, ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు పంచకర్ల రమేష్‌బాబు, తోట త్రిమూర్తులు, వరుపుల సుబ్బారావు, ఎమ్మెల్సీ కందుల దుర్గేష్, ఆప్కో వైస్ చైర్మన్ రత్నం, కాపు సంఘం నేతలు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మిరియాలను గజమాల, బంగారు కంకణంతో సత్కరించారు. సమావేశానికి రాలేకపోయిన డిప్యూటీ సీఎం చినరాజప్ప విమానం దిగిన వెంటనే నేరుగా మిరియాల వెంకట్రావు ఇంటికివెళ్లి ఆయన్ను సత్కరించారు.