అమెరికాలో ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరణ
* ఆవిష్కరించిన కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు
* ఏపీ స్పీకర్, పలువురు మంత్రుల హాజరు
లాస్ ఏంజెలిస్: తెలుగు సినీరంగంలో విశ్వవిఖ్యాత నటసార్వభౌమునిగా ఖ్యాతిగాం చిన స్వర్గీయ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) విగ్రహం అమెరికాలోని లాస్ ఏంజెలిస్ నగరంలో కొలువుదీరింది. శరత్ కామినేని, కుమారి అనే ఎన్‌ఆర్‌ఐ దంపతులు తమ నివాస ప్రాంగణంలో కృష్ణావతారంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆయనపై అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు.
స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు పలువురు ప్రముఖుల సమక్షంలో ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ ఎన్టీఆర్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. నటుడిగా, రాజకీయ నాయకుడిగా, తెలుగు వ్యక్తిగా ఎన్టీఆర్‌ను ఎంతగా గౌరవించిందీ నెమరేసుకున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ రాజకీయరంగ ప్రవేశం చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభల్లో పోటెత్తిన జనసంద్రాన్ని చూశానని వెంకయ్య చెప్పారు.
ఎన్నికలకు కేవలం తొమ్మిది నెలల వ్యవధిలో ఎన్టీఆర్ టీడీపీని స్థాపించడమే కాకుండా అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించడం అపూర్వమని కొనియాడారు. జాతీయ స్థాయిలో తృతీయ ఫ్రంట్ ప్రతిపాదన తెచ్చిన తొలి వ్యక్తి ఎన్టీఆరేనన్నారు. ఆయన అమలు చేసిన ప్రజాసంక్షేమ పథకాలను నేటికీ వివిధ రాష్ట్రాలు అమలు చేస్తున్నాయన్నారు. శరత్ కామినేని మాట్లాడుతూ ఎన్టీఆర్‌పై ఉన్న ప్రేమాభిమానాల వల్లే ఆయన విగ్రహ ఏర్పాటుకు ముందుకొచ్చానన్నారు. కృష్ణ భగవానుడిలా ఎన్టీఆర్ విగ్రహం ఎల్లవేళలా తనను, తన కుటుంబాన్ని కాపాడుతుందని భావిస్తున్నట్లు చెప్పారు.
విగ్రహ రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన హర్షవర్దన్ ముప్పావరపు, రూపశిల్పి రాజ్‌కుమార్ వుడయార్ సహా ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించేందుకు ఎవరైనా, ఎప్పుడైనా తన ఇంటికి రావచ్చన్నారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మాట్లాడుతూ డాక్టరైన తనను 1980లలో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి తెచ్చారన్నారు. ఏపీ వైద్యారోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్టీఆర్ స్ఫూర్తితోనే తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు.
ఎన్టీఆర్‌తో కలసి పనిచేయడాన్ని ఎంతో గౌరవంగా భావించానని ఏపీ పంచాయతీరాజ్‌శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు చెప్పా రు. మరో మంత్రి పరిటాల సునీత మాట్లాడుతూ ఎన్టీఆర్ వల్లే తాను ఈ స్థితిలో ఉండగలిగానన్నారు. అనంతరం ఏపీ హిందీ అకాడమీ చైర్మన్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ ఎన్టీఆర్‌కు చెందిన, ఆయన నివసించిన ప్రాంతాల్లో ఒక చోట మ్యూజియం ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు.
ఎన్టీఆర్‌తో 12 చిత్రాలు చేసిన దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్‌పై పద్యాన్ని చదివి వినిపించారు. ప్రముఖ సంగీ త దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్... ఎన్టీఆర్ రాజకీయ ప్రచార గేయం ‘జన్మభూమి...’ ని ఆలపించారు. సుమారు 500 మంది అతిథు లు పాల్గొన్న ఈ కార్యక్రమంలో సినీ నటుడు సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు.