
‘సాక్షి’ విలేకరిపై హత్యాయత్నం
► విశాఖలో లాటరైట్ మాఫియా దుశ్చర్య
► దాడికి పాల్పడ్డ వారిలో రౌడీ షీటర్‌ను పట్టుకున్న స్థానికులు
సాక్షి, విశాఖపట్నం: లాటరైట్ మాఫియా అక్రమాలపై వార్తలు రాశాడనే కక్షతో విశాఖ జిల్లా నాతవరం మండల ‘సాక్షి’ విలేకరి ఏడీ బాబుపై కొందరు దుండగులు మంగళవారం హత్యాయత్నం చేశారు. రాత్రి ఏడున్నర గంటల సమయంలో నాతవరం తాండవ జంక్షన్ వద్ద నెట్ సెంటర్‌లో ఉన్న బాబు వద్దకు మూడు ద్విచక్రవాహనాల్లో వచ్చిన ఆరుగురు వ్యక్తులు బీరు సీసాలు, ఇనుప రాడ్లతో దాడి చేశారు. విచక్షణా రహితంగా కొట్టడంతో బాబు తలకు, భుజానికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే అప్రమత్తమై దుండగులను నియంత్రించడానికి ప్రయత్నించారు.
స్థానికులు ప్రతిఘటించడంతో అక్కడి నుంచి ఐదుగురు వ్యక్తులు పారిపోయారు. ఒకరిని మాత్రం పట్టుకున్నారు. పట్టుబడిన వ్యక్తి నర్సీపట్నం ప్రాంతానికి చెందిన రౌడీషీటర్ బండారు సంతోష్‌గా గుర్తించారు. అతనిని నాతవరం పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. బాబును హుటాహుటిన నర్సీ పట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రాణాపాయం లేదని వైద్యులు వెల్లడించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కన్వీనర్ పెట్ల ఉమాశంకరగణేష్ ఆస్పత్రికి వచ్చి బాధితుడిని పరామర్శించారు. అనంతరం ఏఎస్పీ ఐశ్వర్య రస్తోగిని కలసి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.