‘ఫ్యాక్షనిస్టు అంటే చంద్రబాబే’
ఆటవిక పాలనపై తీర్మానం ప్రవేశపెట్టిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
అమరావతి: ఫ్యాక్షనిస్టు అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబే అని, టీడీపీ నేతలను ఆయన రెచ్చగొడుతున్నారని వైఎస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ జాతీయ ప్లీనరీలో టీడీపీ ఆటవిక పాలనపై పెద్దిరెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. ‘ఆటవిక పాలన ఇంతవరకు మన రాష్ట్రంలో చూడలేదు. ఉగాండ దేశంలో ఆటవిక పాలన చేశారు. ఇక్కడ చంద్రబాబు కుట్రపూరితంగా, నయవంచనతో పాలిస్తున్నారు. ఇది ఆటవిక పాలన కంటే ప్రమాదకరమైంది. సామాన్య ప్రజలకు వారి, ధన, మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. ప్రతి నియోజకవర్గంలో కూడా టీడీపీ ఎమ్మెల్యేలు చెప్పే వారినే ఎస్‌ఐలుగా నియమిస్తున్నారు. వారితో వైఎస్‌ఆర్‌సీపీ నాయకులను, కార్యకర్తలను అణగద్రొక్కే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎక్కడా చూసినా నేరాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో కాల్‌మనీ–సెక్స్ రాకెట్‌తో దోచుకున్నారు. సోషల్ మీడియా గొంతు నొక్కుతున్నారు.
చంద్రబాబుకు వ్యతిరేకంగా పోస్టులు పెడితే వలంటీర్లపై కేసులు పెడుతున్నారు. సోషల్ మీడియా ద్వారా అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఈ రోజు నిర్భందం విధిస్తున్నారు. లోకేష్‌కు వ్యతిరేకంగా పోస్టులు పెడితే కేసులు పెడుతున్నారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కెండేయ ఖట్జూ కూడా రాష్ట్ర పాలనపై ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని చెప్పారు. కుట్ర పూరిత వ్యవహారంతో పాలన సాగిస్తున్నారు. వైఎస్ జగన్ అంటే చంద్రబాబుకు చాలా భయం. టీడీపీ మహానాడులో చంద్రబాబు వైఎస్ జగన్ జపం చేశారు. వైఎస్ జగన్ నాయకత్వం ఉండకూడదనే ఉద్దేశంతో మన పార్టీలో గెలిచిన వారిని డబ్బులిచ్చి కొనుగోలు చేశారు’..
ఏపీలో హత్యా రాజకీయాలు
‘మన నాయకులను చంపే ప్రయత్నం చేస్తున్నారు. కర్నూలు జిల్లాలో ఇసుక దందాను అడ్డుకుంటున్నారనే కారణంతో వైఎస్‌ఆర్‌సీపీ ఇన్‌చార్జ్ చెరుకులపాడు నారాయణరెడ్డి, అయన అనుచరుడు సాంబశివుడిని చంపారు. వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులను అతికిరాతకంగా హత్య చేస్తున్నారు. ఇసుక, మట్టిలో అవినీతికి పాల్పడుతున్నారు. కాల్‌మనీ–సెక్స్ రాకెట్ కేసులో టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. వారిని చంద్రబాబే కాపాడుతున్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 132 జీవోలు ఇచ్చి టీడీపీ నేతలపై ఉన్న కేసులు ఎత్తి వేసింది’
బాబు జీవితం అంతా రక్త చరిత్రే
‘చంద్రబాబు జీవితమంతా రక్త చరిత్రే అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. విజయవాడ నగరంలో ఓ జర్నలిస్టును, వంగవీటి మోహన్‌రంగాను హత్య చేయించింది చంద్రబాబే. ఇందులో నీ పాత్ర లేకుండా సీబీఐ విచారణకు సిద్ధమా? గతంలో పరిటాల రవి హత్య కేసులో వైఎస్ జగన్ ప్రమేయం ఉందని నాడు ఆరోపిస్తే.. వైఎస్ రాజశేఖరరెడ్డి విచారణకు ఆదేశించారు. ఆ కేసులో వైఎస్ జగన్ సచ్చిలత కూడా తెలిసింది. హైదరాబాద్‌లో ఓటుకు కోట్లు కేసులో సాక్ష్యాధారాలతో చంద్రబాబు పట్టుబట్టారు. అయితే ఇంతవరకు ఆయనపై ఎలాంటి చర్యలు లేవు. టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తహశీల్దార్ వనజాక్షిపై దాడి చేశారు. అంబేడ్కర్ విగ్రహం వ్యవహారంలో గరగప్రరులో వివాదం తలెత్తితే అక్కడ ప్రభుత్వం స్పందించలేదు. 144 సెక్షన్ పెట్టి ప్రజలను భయందోళనకు గురి చేసింది. వైఎస్ జగన్ అక్కడికి వెళ్లి సమస్యను సామరస్యంగా పరిష్కరించారు’..
అక్రమ కేసులతో వేధింపులు
‘టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కలెక్టర్ల మీటింగ్‌లో తమ పార్టీ కార్యకర్తల వ్యవహారంలో చూసి చూడనట్లు పోవాలని చంద్రబాబు ఆదేశించారు. మనం ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులకు విలువ లేకుండా చేశారు. ఎమ్మెల్యేలపై మర్డర్ కేసులు పెడుతున్నారు. ప్రభుత్వ భూములు అక్రమించిన వారిపై కేసులు పెట్టకుండా మా పార్టీ ఎమ్మెల్యేపై కేసులు పెట్టారు. నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో నాడు భూమా నాగిరెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. ఎమ్మెల్యే రోజాపై కూడా అట్రాసిటీ కేసు పెట్టారు. ముస్తఫా, అంబటి రాంబాబు మీద దౌర్జన్యం చేసి కేసులు పెట్టారు.
గతేడాది డిసెంబర్‌లో తిరుపతి కొండల్లో కూలీలను ఎన్‌కౌంటర్ చేశారు. ర్యాంగింగ్ భూతానికి రిషితేశ్వరి బలైంది. ఆ కేసులో నిందితులను చంద్రబాబే రక్షించారు. తిరుపతి మున్సిపల్ చైర్‌పర్సన్ శాంతి మానవహక్కుల సంఘాన్ని ఆశ్రయిస్తే ఇంతవరకు చర్యలు లేవు. గిరిజన ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిపై దేశద్రోహం కేసు పెట్టారు. దీన్ని హైకోర్టు కూడా తప్పు పట్టింది. అంగన్‌వాడీ కార్యకర్తలపై కూడా లాఠీచార్జ్ చేయించారు. టీడీపీ మంత్రి రావెల కిశోర్ తనయుడు హైదరాబాద్‌లో అమ్మాయిని వేధించారు. ఆశా వర్కర్లపై కూడా లాఠీ చార్జ్ చేశారు. మహిళా ప్రొఫెసర్‌ను టీడీపీ నేత అసభ్యంగా ప్రవర్తిస్తే ఎలాంటి చర్యలు లేవు.
రాష్ట్రంలో 3594 మంది పిల్లలు కిడ్నాప్‌కు గురయ్యారు. బ్రాండిక్స్ కార్మికులపై నిరంకుశంగా వ్యవహరించారు. మాజీ మున్సిపల్ చైర్మన్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె భర్త కూడా టీడీపీ లీడర్ల వేధింపుల కారణంగా అకాల మరణం పొందారు. సంధ్యారాణి అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటే ప్రొఫెసర్‌ను కాపాడారు. మంత్రి రావెలతో ప్రాణహాని ఉందని జెడ్పీ చైర్మన్ జానీమూన్ ఫిర్యాదు చేసింది. గుంటూరు జిల్లాలో ఎమ్మెల్యే యరపతినేని మైనింగ్ పేరుతో దోచుకుంటున్నారు. వరపుల సుబ్బారావు కుమారుడు ఓ ఎస్టీ అమ్మాయిని ప్రేమించి మోసం చేశారు. ఆమెకు న్యాయం చేయడం లేదు.
వెంకటగిరి ఎమ్మెల్యే రామకృష్ణ రైల్వే కాంట్రాక్టర్‌ను బెదిరించారు. హైకోర్టులో కేసు ఉన్నా కూడా దాన్ని పక్కన పెట్టి ఎమ్మెల్యే బోడే ప్రసాద్ కోసం ప్రత్యేక జీవో ఇచ్చారు. విశాఖలో భూ కుంభ కోణం దేశంలోనే పెద్ద కుంభకోణం. ఇంత దారుణమైన, అరాచకమైన పాలనను చూస్తూ ఊరుకోవాలా?. ఆటవిక పాలనకు అంతం పలికేలా అందరం ఒక్కటై పనిచేద్దామ’ని పెద్దిరెడ్డి పిలుపునిచ్చారు. ఈ తీర్మానాన్ని వెల్లంపల్లి శ్రీనివాస్ బలపరిచారు.
సంబంధిత కథనాలు:
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోలేదు: ధర్మాన
అవినీతి చక్రవర్తి పుస్తకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి
ఎన్టీఆర్ సినిమాలో విలన్ ఆయనే!
వైఎస్ జగన్ సీఎం కాకూడదనే..