
‘సేవ్ విశాఖ’ ధర్నాకు పోలీసుల అడ్డంకులు
విశాఖపట్నం: కబ్జారాయుళ్ల కబంధహస్తాల్లో చిక్కుకున్న విశాఖ నగరాన్ని రక్షించేందుకు గురువారం ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ ‘సేవ్ విశాఖ’ పేరుతో మహాధర్నాను నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. కాగా.. సేవ్ విశాఖ మహాధర్నా సందర్భంగా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ధర్నాలో పాల్గొనేందుకు బయలుదేరిన వైఎస్సార్ సీపీ నేతలు, కార్యర్తలను పోలీసులు వేధింపులకు గురిచేశారు. ర్యాలీలకు అనుమతి లేదంటూ ఆంక్షలు విధించారు.
అంతకుముందు విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న వైఎస్ జగన్‌కు పార్టీ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లిన కార్యకర్తలనూ పోలీసులు వేధింపులకు గురిచేశారు. కార్యకర్తల వాహనాల నెంబర్లు, పేర్లు, వివరాలు తీసుకొని ఎయిర్‌పోర్ట్‌కు అనుమతించారు. పలు చోట్ల కార్యకర్తలు, అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను అధికారులు బలవంతంగా తొలగించారు. మరోవైపు టీడీపీ నేతల భూ కబ్జాల వల్ల రూ. కోట్ల విలువైన భూములను కోల్పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విశాఖ వాసులు మహాధర్నాలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.