
అమరుడికి ‘అశోకచక్ర’
- మార్టూరులో గంభీర వాతావరణం
- విషణ్ణ వదనాలు.. ఘననివాళులు ..
- {పసాద్ స్మృతులతో గ్రామస్తుల ర్యాలీ
అనకాపల్లి, న్యూస్‌లైన్: యా వత్తు జాతి గర్వించదగ్గ అశోకచక్ర అవార్డును మరణానంతరం పొందిన కరణం ప్రసాద్ స్వగ్రామంలో ఆదివారం గం భీర వాతావరణం నెలకొంది. ఒకవైపు తమ ఊరి బిడ్డ మావోయిస్టులతో పోరాడి అసువులు బాసిన ఘటనను గుర్తు చేసుకొని విషణ్ణ వదనంలో మునిగి పోయారు. మరోవైపు దేశరక్షణ లో పోరాడి అమరుడయ్యాడంటూ గర్వంగా కొనియాడారు.
అనకాపల్లి మండలం మార్టూరుకు చెందిన కరణం సోమునాయు డు, సత్యవతిల కుమారుడు ప్రసాద్ గతేడా ది ఏప్రిల్ 16న మావోయిస్టులతో జరిగిన పోరులో చనిపోయిన సంగతి తెలిసిందే. ప్రసాద్‌కు కేంద్ర ప్రభుత్వం అశోక చక్ర ప్రకటించగా, అతని తల్లిదండ్రులు ఆదివారం న్యూఢి ల్లీలో గణతంత్ర దినోత్సవంలో రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. దీనిని టీవీలో చూసిన మార్టూరువాసులు ఆనాటి ఘటనను గుర్తు చేసుకున్నారు. కన్నీరొలికారు. బరువెక్కిన గుండెలతో గ్రామంలో ర్యాలీ నిర్వహించా రు. ప్రసాద్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. ప్రసాద్ వీరత్వాన్ని స్పూర్తిగా తీసుకోవాలని, తల్లి లాంటి దేశం కోసం ప్రాణాలర్పించిన ప్రసాద్ మార్టూరు ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతారని శ్లాఘించారు.
విషాద రోజులు గుర్తుచేసుకొని...
2013 ఏప్రిల్ 16న ఛత్తీస్‌గఢ్-ఆంధ్ర సరిహద్దు అటవీప్రాంతంలో గ్రేహౌండ్స్ దళాలకు మావోయిస్టులకు జరిగిన ఎదురు కాల్పుల్లో తొమ్మిది మంది మావోయిస్టులు మృతి చెందారు. ఆ సంఘటనలో గ్రే హౌండ్స్ రిజర్వు ఇన్‌స్పెక్టర్ కరణం వీర వెంకట శ్రీనివాస శ్రీహరి నాగ వరప్రసాద్‌బాబు దళసభ్యులకు చిక్కినట్లు రెండు రోజుల వరకూ తెలియలేదు. 18న ఈ విషయం బహిర్గతమైంది. అప్పటికే వర ప్రసాదను మావోయిస్టులు చంపినట్లు సమాచారం రాష్ట్రమంతటా వ్యాపించింది. భీకరమైన అటవీ ప్రాంతంలో మావోయిస్టులు తొమ్మిది మంది మరణించడంతో వారు పగతో రగిలిపోయారు.
ప్రతీకారంగా వర ప్రసాద్ మృతదేహాన్ని ఉపయోగించుకోవాలని ప్రయత్నించారు. తర్వాత ప్రసాద్ తల్లిదండ్రులు మీడియా ద్వారా మావోయిస్టులను మానవతా ధృక్పథంతో తమ కుమారుడి శవాన్ని అప్పగించాలని వేడుకున్నారు. దీంతో ఏప్రిల్ 21 నాటికి మార్టూరు గ్రామనికి వరప్రసాద్ మృతదేహం చేరింది. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.
ఇదిలాఉండగా సోమునాయుడు, సత్యవతి దంపతులకు రెండవ సంతానమైన వర ప్రసాద్‌కు ఇద్దరు సోదరులు. వరప్రసాద్ బావ సీఐఎస్‌ఎఫ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. వర ప్రసాద్ తండ్రి రిటైర్డు ఏఎస్‌ఐ. వరప్రసాద్ పెదనాన్న కొడుకు డీఎస్పీగా పనిచేస్తున్నారు. ఇలా పోలీసు శాఖలో వివిధ హోదాల్లో ఉన్న ‘కరణం’ కుటుంబం అంటే మార్టూరులో ఎంతో గౌరవం. దివంగత ప్రసాద్‌కు ప్రఖ్యాత అశోకచక్ర అవార్డు ప్రదానంతో ఇప్పుడు దేశం గ ర్వించదగ్గ ముద్దుబిడ్డ అయ్యాడు.