
‘ఆ భూములకు రూ.60.30 కోట్లు సమంజసమే’
సాక్షి, చెన్నై: తమ శక్తి మేరకే బహిరంగ వేలంలో పాల్గొన్నామని సదావర్తి సత్రం భూములను దక్కించుకున్న సత్యనారాయణ బిల్డర్స్ తెలిపారు. ఆ భూములకు రూ.60.30 కోట్లు చెల్లించడం సమంజసమేనని అన్నారు. 48 గంటల్లో సగం డబ్బును డిపాజిట్ చేస్తామని పేర్కొన్నారు. అన్ని విషయాలు పరిగణనలోకి తీసుకున్న తర్వాతే బహిరంగ వేలంలో పాల్గొన్నామని సత్యనారాయణ బిల్డర్స్ అన్నారు. కాగా రెండోసారి జరిగిన వేలంలో అధిక ధర చెల్లించి సదావర్తి భూములను కడపకు చెందిన సత్యనారాయణ బిల్డర్స్ చేజిక్కించుకున్నారు. సదావర్తి భూముల వేలం వివరాలను సుప్రీంకోర్టుకు నివేదిస్తామని ఏపీ దేవాదాయశాఖ కమిషనర్ అనురాధ తెలిపారు. కోర్టు ఆదేశాల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని ఆమె చెప్పారు.
కాగా గుంటూరు జిల్లా అమరావతిలో రాజా వాసిరెడ్డి వంశీయులు వేద విద్యను అభ్యసించేవారికి చేయూతనందించాలన్న ఉద్దేశంతో సత్రాలు ఏర్పాటు చేశారు. భక్తులు, యాత్రికులు బస చేయడానికి ఇవి ఉపయోగపడ్డాయి. రాజా వాసిరెడ్డి వంశీయులు సేవా నిరతిని మెచ్చిన పలువురు సంపన్నులు సదావర్తి సత్రానికి భారీగా భూములు, నగదు విరాళాలు అందించారు. అందులో భాగంగా ఇప్పటి తమిళనాడులోని మహాబలిపురం రహదారిని ఆనుకుని ఉన్న తాళంబూర్‌లో సదావర్తి సత్రం కోసం 471 ఎకరాల భూమిని దానంగా ఇచ్చారు.
కాల క్రమంలో సత్రం ధర్మకర్తలు 350 ఎకరాల భూమిని వివిధ సందర్భాల్లో విక్రయించారు. మిగిలిన భూమి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దేవాదాయశాఖ స్వాధీనం చేసుకుంది. ఇందులో కబ్జాలు పోనూ 83.11 ఎకరాల భూమి దేవాదాయ శాఖ పరిధిలో ఉంది చంద్రబాబు 2014లో ముఖ్యమంత్రి కాగానే ఈ భూములపై తెలుగు తమ్ముళ్ల కన్ను పడింది. రాజా వారి తలచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లు వెంటనే ఆ 83.11 ఎకరాల భూమిని అమ్మేయాలని నిర్ణయించుకున్నారు. దానికి ఓ సాకు కూడా వెతుక్కున్నారు.
సదావర్తి భూములు అన్యాక్రాంతమైపోతున్నాయని వాటిని విక్రయించాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయిస్తూ కేవలం 22కోట్ల రూపాయలకే తమ అనుయాయులకు కట్టబెట్టింది. సదావర్తి భూములపై అసలు నిజాలు బయటకు రావడంతో - చంద్రబాబు ఎదురుదాడికి దిగారు. 5 కోట్లు రూపాయలు ఎక్కువిస్తే భూములను వారికే ఇస్తామంటూ చంద్రబాబు ప్రకటించారు. ముఖ్యమంత్రి ప్రకటన ఆధారంగా మంగళగిరి వైఎస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే హైకోర్టులో సదావర్తి భూములపై పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు... మరోసారి వేలం నిర్వహించాలని ఆదేశించిన విషయం విదితమే.