వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా టీటీడీ బోర్డు భేటీ

TTD board Meeting Start First Ever video conference  - Sakshi

సాక్షి, తిరుమల: టీటీడీ ధర్మకర్తల మండలి గురువారం తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో సమావేశమైంది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో సుమారు 60 రోజులుగా శ్రీవారి దర్శనం నిలిచిపోయిన తరుణంలో తొలిసారిగా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా టీటీడీ బోర్డు భేటీ అయింది. బోర్డు చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరుగుతున్న ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో తిరుపతి నుంచి ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్, అదనపు ఈవో ధర్మారెడ్డి, ప్రత్యేక ఆహ్వానితులు కరుణాకర్‌ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి పాల్గొంటుండగా మిగిలిన సభ్యులు వారివారి స్వస్థలం నుంచి పాల్గొన్నారు. టీటీడీ చరిత్రలో మొట్టమొదటి సారిగా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాలకమండలి సమావేశం నిర్వహిస్తోంది. (అవన్నీ నిరర్థక ఆస్తులే: వైవీ సుబ్బారెడ్డి)

సమావేశం ప్రారంభంగా కాగానే ముందుగా టీటీడీ మాజీ ఈవో కే.ఉమాపతిరావు మృతికి టీటీడీ బోర్డు సంతాపం తెలిపింది. సుమారు 36మంది సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ మేరకు అన్నమయ్య భవన్‌లో మూడు పెద్ద స్క్రీన్లను ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ప్రధానంగా టీటీడీ ఆస్తుల విక్రయాలపై నిర్ణయాన్ని ప్రకటించనుంది. ఇప్పటికే ఈ అంశం వివాదాస్పదంగా మారడం, ప్రభుత్వం గత పాలకమండలి తీర్మానాలను నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో ఈ అంశంపై పాలకమండలి చర్చించి నిర్ణయం తీసుకోనుంది. (వెంకన్న సాక్షిగా.. పాపాలన్నీ బాబువే)

అలాగే  మార్చి 20వ తేదీ నుంచి శ్రీవారి దర్శనాలు నిలిపివేత కారణంగా టీటీడీ ఇప్పటికే రూ.400 కోట్ల రాబడి కోల్పోయింది. మే నెల జీతాలు చెల్లింపు తరువాత టీటీడీ వద్ద నిధుల కొరత ఏర్పడనుంది. ఈ నేపథ్యంలో ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల నుంచి నిధులు వాడకుండా ఓడీ (ఓవర్‌డ్రాప్ట్‌)కి వెళ్లే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఎస్‌బీఐలో టీటీడీకి రూ.300 కోట్లు ఓడీ 0.75 శాతం వడ్డీకే లభించే అవకాశం ఉంది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top