నిమ్స్ మార్చరీకి ఉదయ్ కిరణ్ మృతదేహం
హైదరాబాద్ : సినీనటుడు ఉదయ్ కిరణ్ మృతదేహానికి పోస్ట్మార్టం పూర్తయింది. ఉస్మానియా వైద్యులు పోస్ట్మార్టం పూర్తి చేశారు. అనంతరం మృతదేహాన్ని నిమ్స్ మార్చరీకి తరలించారు. అయితే మార్చరీకి తాళం వేసి ఉండటంతో సుమారు 20 నిమిషాల పాటు మృతదేహాన్ని బయటే ఉంచారు. కాగా ఉదయ్ కిరణ్ అంత్యక్రియలు మంగళవారం పంజాగుట్ట స్మశాన గుట్టలో జరగనున్నట్లు తెలుస్తోంది.
కాగా అతని సోదరి మస్కట్ నుంచి ఈరోజు సాయంత్రానికి హైదరాబాద్ చేరుకోనున్నారు. అనంతరం అంత్యక్రియలపై ఓ స్పష్టత రానుంది. ఉదయ్ కిరణ్ రాత్రి 12:15 నిమిషాలకు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. మరోవైపు ఉదయ్ కిరణ్ మృతిపై ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలని మానవ హక్కుల కమిషన్లో ఓ న్యాయవాది ఫిర్యాదు చేశారు.
ఇక ఉదయ్ కిరణ్ అంత్యక్రియలపై సందిగ్దత నెలకొంది. అతని కుటుంబ సభ్యులు కూడా పట్టించుకోకపోవటంపై అభిమానులు ఆవేదన చెందుతున్నారు. ఉదయ్ కిరణ్ తండ్రికాని, భార్య విషిత కుటుంబ సభ్యులు కానీ, మృతదేహాన్ని తీసుకు వెళ్లేందుకు రాకపోవటంపై వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ అభిమాన హీరోకి ఇలాంటి దుస్థితి రావటం బాధాకరమన్నారు.