'గౌతమిపుత్ర'పై ప్రశ్నించడమే ఐవైఆర్ తప్పా?'
గుంటూరు: ఐవైఆర్ కృష్ణారావును ఉద్దేశపూర్వకంగానే బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి తొలగించారని వైఎస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. ఇది కేవలం బ్రాహ్మణ సమాజం మాత్రమే కాదు సభ్య సమాజం బాధ పడే విషయమని, చంద్రబాబుకు ఓటేసిన ప్రతి బ్రాహ్మణుడు లెంపలేసుకుంటున్నాడని చెప్పారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. '30 ఏళ్లకు పైగా ఐఏఎస్‌గా బాధ్యతలు నిర్వర్తించిన వ్యక్తి కృష్ణారావు. ఆయన నీతి, నిజాయతీని కొలమానంగా తీసుకుని గతంలో ఏపీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించడం నిజం కాదా?. ఆర్టీఐ కమిషనర్ హోదా ఇస్తామని చంద్రబాబు చెబితే.. బ్రాహ్మణ సామాజిక వర్గానికి సేవ చేయాలని, వారి వృద్ధిని ఆకాంక్షించి బ్రాహ్మణ చైర్మన్ పదవిని చేపట్టారని' ఈ సందర్భంగా అంబటి గుర్తుచేశారు.
'సిన్సియర్ అధికారిని మీ కార్యకర్తలాగో, పార్టీ నేతలానో వ్యవహరించలేదని పదవి నుంచి తొలగించారు. జన్మభూమి కమిటీ సభ్యులకు మాత్రమే లబ్ధి పొందేలా చూడాలని కృష్ణారావుపై ఒత్తిడి తీసుకొచ్చారు. ముక్కుసూటిగా వ్యవహరించే అధికారి ఐవైఆర్ వారి ఆదేశాలను తిరస్కరించారు. ఈ కమిటీల పేరుతో సంక్షేమ పథకాల నిధులు పచ్చ తమ్ముళ్లకు మాత్రమే అందేలా చేయాలన్నదే వారి ధ్యేయమనడానికి ఇది నిదర్శనంగా కనిపిస్తోంది. కమిటీలు చెప్పిన వారికి మాత్రమే లోన్లు ఇస్తూ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ లో టీడీపీ నేతల జోక్యాన్ని అడ్డుకునే యత్రం చేసినందుకు కక్షగట్టి ఆయనపై వేటు వేశారు. అడిగితే రాజీనామా చేసేవాడినని స్వయంగా ఐవైఆర్ చెప్పడం ఆయనపై ఉన్న ఒత్తిడిని తెలియజేస్తుందని' అంబటి వివరించారు.
గౌతమిపుత్ర శాతకర్ణికి రాయితీలు ఎందుకిచ్చారు.. వివాదాలలో చిక్కుకున్న సినిమాకు రాయితీ ఇవ్వడం సరైన నిర్ణయం కాదని కృష్ణారావు ప్రశ్నించడమే ఆయన చేసిన తప్పా అని సీఎం చంద్రబాబను అంబటి ప్రశ్నించారు. బాహుబలి-2 సినిమా గొప్ప సినిమానే కానీ, ప్రత్యేక కేటగిరి ఇచ్చి రోజుకు ఆరు, ఏడు షోలకు అనుమతి ఇచ్చేందుకు కారణాలు చెప్పమని అడగటంతో కృష్ణారావుపై కక్ష పెంచుకున్నారని అభిప్రాయపడ్డారు. కృష్ణారావు మాత్రమే కాదు, టీడీపీ ఎంపీ శివప్రసాద్ విషయంలోనే సీఎం చంద్రబాబు చాలా కఠినంగా ప్రవర్తించారు. తనను కలుసుకునేందుకు అవకాశం ఇవ్వలేదని శివప్రసాద్ నెత్తినోరు కొట్టుకున్న విషయాన్ని అందరూ చూశారని గుర్తుచేశారు. సిన్సియర్ అధికారికి నోటీసు ఇవ్వకుండా, అవమానకర రీతిలో తొలగించడాన్ని ఎవరూ అంత తేలికగా తీసుకోరని చెప్పారు.