'దేవరపల్లిలో ఎమర్జెన్సీ.. ఇంతదారుణమా?'
హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దళిత వ్యతిరేకి అని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ధ్వజమెత్తారు. ఏపీలో పోలీసులు రాజ్యమేలుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గడిచిన మూడేళ్లలో ఏపీలో దళితులపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల దళితులపై దాడుల నేపథ్యంలో ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వాన్ని ఎండగట్టారు. నేషనల్ బ్యూరో రికార్డుల ప్రకారం దళితులపై దాడుల విషయంలో ఏపీ రెండోస్థానంలో ఉందన్నారు.
తుందుర్రులో దళిత, బీసీ మహిళల అరెస్టులు సిగ్గుతో తలదించుకునేలా ఉన్నాయని, ప్రకాశం జిల్లా దేవరపల్లి ఎమర్జెన్సీని తలపిస్తుందని మండిపడ్డారు. ఇప్పటికే ఒక చెరువు ఉన్నప్పటికీ కావాలనే దళితుల భూములు లాక్కొని అర్థరాత్రి ప్రొక్రెయిన్లతో చెరువు తీసే కార్యక్రమానికి తెరలేపారన్నారు. ఎమర్జెన్సీని తలపించేలా 200 దళిత కుటుంబాలకు 400మంది పోలీసులను పెట్టి వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాలను తాను కేంద్ర హోంమంత్రి, జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ దృష్టికి కూడా తీసుకెళ్లనట్లు తెలిపారు.
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు దళితులకు మద్దతు ఇస్తే ఇంత దారుణంగా వ్యవహరిస్తారా అని నిలదీశారు. ఎన్ని బెదిరింపులకు దిగినా దళితులకు, బలహీన వర్గాలకు తమ పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. దేవరపల్లి ఘటనపై న్యాయస్థానాన్ని, హెచ్‌ఆర్‌సీని ఆశ్రయిస్తామని ఆయన స్పష్టం చేశారు. పాదయాత్రకు అనుమతులు అవసరమేమిటని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు ప్తరిపక్షంలో ఉన్నప్పుడు ఎవరిని అడిగి పాదయాత్రం చేశారని నిలదీశారు. నంద్యాలలో గెలుపుకోసం దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయాన్ని కూడా తాము ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళతామని స్పష్టం చేశారు.