ఎయిరిండియాపై కన్నేసిన టాటా
ఎయిరిండియాపై కన్నేసిన టాటా
Published Wed, Jun 21 2017 3:39 PM | Last Updated on Tue, Sep 5 2017 2:08 PM
న్యూఢిల్లీ : ప్రభుత్వానికి గుదిబండలా మారిన ఎయిరిండియా వదిలించుకునే ప్రక్రియలో ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. ఈ అమ్మకానికి కేబినెట్ తుది ఆమోదం తెలుపబోతున్న నేపథ్యంలో మరో కొత్త అంశం తెరపైకి వచ్చింది. ప్రైవేటీకరణ చేయబోతున్న ఎయిరిండియాను దేశీయంగా ఎంతో ప్రతిష్టాత్మకమైన గ్రూప్ గా పేరున్న టాటా గ్రూప్ దీన్ని కొనుగోలు చేయాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. సింగపూర్ ఎయిర్ లైన్ భాగస్వామ్యంతో ఎయిరిండియాను కొనుగోలుచేయాలని టాటా గ్రూప్ యోచిస్తున్నట్టు ఈటీ నౌ రిపోర్టు చేసింది. ఇప్పటికే టాటా గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ దీనిపై ప్రభుత్వంతో అనధికారిక చర్చలు కూడా జరుపుతున్నట్టు ఈ న్యూస్ ఛానల్ పేర్కొంది. ఎయిరిండియాలోని కంట్రోలింగ్ స్టాక్ 51 శాతం ఈక్విటీ హోల్డింగ్ ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్టు తెలిపింది.
ఈ విమానయాన సంస్థను పూర్తిగా ప్రైవేటైజేషన్ చేయాలనే నీతిఆయోగ్ ప్రతిపాదనను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని ఈ దిశగా ముందుకు కదులుతోంది. ఎయిరిండియా జాతీయం కాకముందు టాటాగ్రూప్‌లోనే ఓ భాగంగా ఉండేది. కానీ ఎయిరిండియాను పూర్తిగా ప్రైవేటైజేషన్ చేయకుండా, కొంత మేర స్టాక్ ను ప్రభుత్వం వద్ద ఉంచుకోవాలని ఏవియేషన్ మంత్రిత్వశాఖ సూచిస్తోంది. ఎయిర్ ఇండియా వాటా అమ్మకం ప్రభావం సంస్థ ఉద్యోగులపై భారీగా పడనున్న నేపథ్యంలో ప్రభుత్వం పునరాలోచించాలని ఆ మంత్రిత్వశాఖ మంత్రి భావిస్తోంది. ఈ నేపథ్యంలో అమ్మక ప్రక్రియకు మరి కొంతకాలం సమయం పట్టేలా కూడా కనిపిస్తోంది.
Advertisement
Advertisement