కేటీఆర్ చెప్పిన బిగ్‌న్యూస్ ఇదేనా?
హైదరాబాద్ : యాపిల్ కంపెనీ సీఈవో టిమ్ కుక్ హైదరాబాద్ చేరుకున్నారు. ముంబై నుంచి ప్రత్యేక విమానంలో ఆయన హైదరాబాద్‌కు వచ్చారు. ఈ సందర్భంగా శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఆయనకు ఘన స్వాగతం లభించింది. అక్కడి నుంచి టిమ్ కుక్ బృందం నేరుగా నానక్ రామ్ గూడా చేరుకున్నారు. అక్కడ వేవ్ రాక్ బిల్డింగ్ లోని ఆపిల్ కార్యాలయంలో డిజిటల్ మాపింగ్ కేంద్రాన్ని టిమ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ఉత్పత్తులైన ఐ ఫోన్, ఐ ప్యాడ్, మ్యాక్, వాచ్ లపై దృష్టిపెట్టనున్నట్టు చెప్పారు. హైదరాబాద్ లో తమ కొత్త కార్యాలయం ప్రారంభించడం చాలా థ్రిల్లింగా ఉందని కుక్ తెలిపారు. దీనిద్వారా సుమారు 4 వేలమంది ఉద్యోగాలు లభించనున్నాయని చెప్పారు. ఇక్కడ అపారమైన ప్రతిభగల నిపుణులు ఉన్నారని, వారితో సంబంధాలను విస్తరించడంకోసం ప్రయత్నిస్తామన్నారు.
యాపిల్ తమ కార్యాలయంకోసం హైదరాబాద్ ను ఎంచుకోవడం ఆనందంగా ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అన్నారు. ఇది వేలమందికి ఉద్యోగాలు కల్పించనుందన్నారు. తమ ప్రభుత్వం అనుసరించిన ప్రోయాక్టివ్ విధానానికి ఇది తార్కాణమని సీఎం అన్నారు. ప్రపంచంలో అత్యంత వినూత్నమైన కంపెనీల్లో యాపిల్ కూడా ఒకటని, ఈ ముఖ్యమైన ప్రాజెక్ట్ లో భాగస్వామ్యం కావడం చాలా గర్వంగా ఉందని ఆర్ఎంఎస్ఐ సీఈవో అనూప్ జిందాల్ అన్నారు
హైదరాబాద్ క్యాంపస్‌లో 4వేల ఉద్యోగాలు ఇస్తామని కుక్ ప్రకటించారు. కాగా, గురువారం నాడు ఒక బిగ్ న్యూస్ చెబుతానని, అది అప్పటివరకు సస్పెన్స్ అని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావు చెప్పారు. ఆయన చెప్పదలచుకున్న బిగ్ న్యూస్ ఇదే కావచ్చని ఐటీ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒకేసారి 4 వేల ఐటీ ఉద్యోగాలు.. అది కూడా కేవలం హైదరాబాద్ క్యాంపస్‌లోనే అంటే అది నిజంగా బిగ్ న్యూసేనని అంటున్నారు.