మారిషస్‌కూ పుల్లారెడ్డి స్వీట్స్ | research on making cancer prevention sweets | Sakshi
Sakshi News home page

మారిషస్‌కూ పుల్లారెడ్డి స్వీట్స్

Published Sat, Mar 15 2014 1:04 AM | Last Updated on Sat, Sep 2 2017 4:42 AM

మారిషస్‌కూ పుల్లారెడ్డి  స్వీట్స్

మారిషస్‌కూ పుల్లారెడ్డి స్వీట్స్

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్వీట్స్ షాపు.. ఈ పేరు వినగానే.. గల్లీకొకటి ఉంటుందిలే అని తేలిగ్గా కొట్టిపారేస్తాం. కానీ, 66 ఏళ్లుగా మిఠాయిల వ్యాపారంలో నిలదొక్కుకోవడమంటే మామూలు విషయం కాదు. అక్షరాలు కూడా సరిగా రాని ఓ సాధారణ వ్యక్తి ప్రారంభించిన మిఠాయి కొట్టు... నేడు దేశం దాటి మారిషస్‌లోనూ వ్యాపారం చేసే స్థాయికి చేరిందంటే మాటలు కాదు. ఎవరా వ్యాపారి.. ఏంటా షాపు.. ఎవరా వ్యాపారి అనుకుంటున్నారా? అదే పుల్లారెడ్డి స్వీట్స్! యజమాని జి.పుల్లారెడ్డి!!


 1948 నాటి మాట..
 కర్నూల్ జిల్లా ఆత్మకూరు మండలంలోని గోకవరం గ్రామవాసి జి.పుల్లారెడ్డి. చదువు అంతగా అబ్బకపోవడంతో కసిరెడ్డి వెంకటరెడ్డి అనే వ్యాపారి బంగారం దుకాణంలో పనిలో చేరాడు. కాస్త డబ్బు సంపాదించాక ఉద్యోగం మానేసి టీ, మజ్జిగ అమ్మే చిన్నపాటి కొట్టును అక్కడే ప్రారంభించాడు పుల్లారెడ్డి. స్వీట్లంటే ఇష్టమున్న వెంకటరెడ్డి తాను కూడా మిఠాయిల వ్యాపారంలోకి రావాలని నిర్ణయించుకున్నాడు. మరి బంగారం దుకాణాన్ని, స్వీట్స్ వ్యాపారాన్ని ఒకే సమయంలో రెండింటినీ నిర్వహణ చేయడం కష్టంగా ఉంటుందనే కారణంతో అప్పట్లో రూ. వెయ్యి అప్పు ఇచ్చి మరీ పుల్లారెడ్డి చేత బలవంతంగా కర్నూల్‌లోని పాతబస్టాండ్ ప్రాంతంలో మిఠాయి కొట్టును తెరిపించాడు కసిరెడ్డి వెంకటరెడ్డి. అలా మొదలైన పుల్లారెడ్డి స్వీట్స్ ప్రస్థానం.. కర్నూల్‌లో 4, హైదరాబాద్‌లో 8, బెంగళూరులో 6 ఔట్‌లెట్లతో స్వీట్స్ వ్యాపారంలో దూసుకుపోతోంది.


 18 ఔట్‌లెట్లు.. రూ.45 కోట్ల టర్నోవర్
 హైదరాబాద్‌లోని సోమాజిగూడ, అబిడ్స్, కూకట్‌పల్లి, విక్రంపురి, దిల్‌సుఖ్‌నగర్, పీఅండ్‌టీ కాలనీ, మెహదీపట్నం, కొండాపూర్‌లో, కర్నూల్‌లోని పాత బస్‌స్టాండ్, కొత్త బస్‌స్టాండ్, కలెక్టర్ ఆఫీస్, రాజ్ విహార్ సెంటర్‌లలో, బెంగళూరులోని జయ నగర్, మారతాహళ్లి, వైట్‌వీల్డ్స్, బీటీఎం లేఅవుట్, ఇంద్రానగర్, కడిగుడిలో మొత్తం 18 పుల్లారెడ్డి స్వీట్స్ ఔట్‌లెట్లున్నాయి. వార్షిక టర్నోవర్ రూ.45 కోట్లు. జీడిపప్పు పాకం, కోవాపురి, అజ్మీరీ కలాకాన్ వంటివి పుల్లారెడ్డి స్వీట్స్ ప్రత్యేకతలు.


 కేన్సర్ నివారణ స్వీట్లు..
 ‘‘స్వీట్లంటే మనలో చాలా మంది ఎక్కువ తినొద్దంటారు. దగ్గొస్తుందని హెచ్చరిస్తారు. కానీ, అది తప్పు. స్వచ్ఛమైన నెయ్యి, పాలతో తయారు చేసే స్వీట్లు ఆరోగ్యానికి మంచివే అని వైద్యులు కూడా చెబుతున్నారు. దేశీ ఆవుల మూత్రం, పేడతో కేన్సర్ వ్యాధిని నయం చేయవచ్చని అంతర్జాతీయ స్థాయిలో పరిశోధనల్లోనూ తేలింది’’ అంటారు పుల్లారెడ్డి స్వీట్స్ పార్ట్‌నర్ జి.ఏకాంబరరెడ్డి. అందుకే దేశీ ఆవుల నుంచి వచ్చే పాలు, నెయ్యితో కేన్సర్ నివారణ మిఠాయిలు తయారు చేయడంపై దృష్టి సారించామని, సాధ్యాసాధ్యాలపై చర్చిస్తున్నామని చెప్పారాయన. ‘‘ఇందుకోసం షిమోగా నుంచి 30 దేశీ ఆవులు దిగుమతి చేసుకునే యోచనలో ఉన్నాం. వాటి కోసం ప్రత్యేకమైన గోశాల ఏర్పాటు, పర్యవేక్షణ వంటి కీలకాంశాలపై క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నాం. అయితే కేన్సర్ నివారణ స్వీట్ల తయారీ నిర్ణయం వ్యాపారం కోసం మాత్రమే కాదు.. సమాజ సేవలో భాగంగానే చేస్తాం’’ అని తెలియజేశారు.


 మారిషస్‌కూ విస్తరణ యోచన...
 మారిషస్‌లో పుల్లారెడ్డి స్వీట్స్ వ్యాపారాన్ని ప్రారంభించే యోచనలో ఉన్నామని, ఇందుకోసం అక్కడి వ్యాపార అవకాశాలు, పర్యాటక ప్రాంతాలు, ప్రజల ఆహారపు అలవాట్లు, రుచుల గురించి వివిధ మార్గాల ద్వారా అధ్యయనం చేస్తున్నామని ఏకాంబరరెడ్డి తెలియజేశారు. రాయితీలు, ప్రోత్సాహకాలపై కుటుంబ సభ్యులతో చర్చించిన తర్వాతే మారిషస్‌లో వ్యాపారాన్ని ప్రారంభిస్తామని ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. ఈ ఏడాది ఉగాదికి హైదరాబాద్‌లోని ఏఎస్ రావ్ నగర్‌లో కొత్త ఔట్‌లెట్‌ను ప్రారంభిస్తున్నట్లు తెలియజేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కొత్త రాజధాని ఖరారయ్యాక అక్కడ కూడా తమ వ్యాపారాన్ని విస్తరిస్తామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారాయన.


 ల్యాబ్‌లో పరీక్షించిన తర్వాతే..
 స్వీట్ల తయారీకి అవసరమైన పాలు, నెయ్యి, పెరుగు వంటి వాటిని సొంత ల్యేబొరేటరీలో పరీక్షించిన తర్వాతే కొనుగోలు చేస్తారు. నంద్యాల, తమిళనాడు నుంచి నెయ్యి దిగుమతి అవుతుంటుంది. రోజుకు 20 డబ్బాలు (ఒక్కోటి 15 కేజీలు) కొనుగోలు చేస్తారు. పాలు రోజుకు 1,500 లీటర్లు కొంటారు. సుగంధ ద్రవ్యాలు, ఇతరరత్రా దినుసులన్నీ బేగంబ జార్ నుంచే కొనుగోలు చేసుకుంటారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement