టాటా స్టీల్ యూకే టేక్ ఓవర్ పూర్తి
లండన్: బ్రిటన్‌లో అమ్మకాలు పడిపోయి సంక్షోభంలో పడిన టాటా గ్రూప్ టాటా స్టీల్ యూకె కు భారీ ఊరట లభించింది. వ్యాపారం దెబ్బతినడంతో తీవ్ర ఇబ్బందుల నేపథ్యంలో సంస్థను విక్రయానికి పెట్టిన టాటా స్టీల్ గ్రూప్ చివరకు తన వ్యాపార అమ్మకాన్ని పూర్తి చేసుకుంది. లండన్కు చెందిన పెట్టుబడి సంస్థ గ్రే బుల్ క్యాపిటల్ ఎల్ ఎల్ పీ దీన్ని ట్రేక్ ఓవర్ చేసింది. మొత్తం 400 మిలియన్ పౌండ్లకు ఈ డీల్ కుదిరింది. ఈ కొనుగోలుకు సంబంధించి గ్రే బుల్ నామమాత్రపు చెల్లింపులు చేసింది. ఉద్యోగుల భద్రతపై ఏప్రిల్ లోజరిగిన ఒప్పందం ప్రకారం 4,800 ఉద్యోగాలు సహా, ప్రొడక్ట్స్ బిజినెస్, ఆస్తులు, అప్పుల కొనుగోలు పూర్తయింది.
దీనిపై టాటా స్టీల్ యూరప్ లిమిటెడ్ సంతోషం వ్యక్తం చేసింది. గ్రే బుల్ యాజమాన్యం ఆధ్వర్యంలో సంస్థ భవిష్యత్తులో మంచి పురోగతి సాధించాలని కోరకుంటున్నామని టాటాస్టీల్ యూకే చీఫ్ ఎగ్జిక్యూటివ్, ఆఫీసర్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బిమ్ లేంద్ర ఝా బుధవారం తెలిపారు. తమ మధ్య వేగవంతమైన చర్చల ప్రక్రియ ద్వారా ఈ డీల్ కుదిరిందని ఇరు సంస్థలు ఒక సంయక్త ప్రకటనలో స్పష్టం చేశాయి.
బ్రిటన్ ప్లాంట్ల విక్రయానికి సిద్ధమైనట్టు, విక్రయం కొలిక్కిరాకపోతే ఆరు వారాల్లో ఆ ప్లాంట్లను మూసివేసేయోచనలో ఉన్నామని ఇటీవల టాటాస్టీల్ యూకె లిమిటెడ్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో నష్టాలతో కాలం వెళ్లదీస్తున్న సంస్థను ఆదుకోవడంతోపాటు ప్లాంట్ మూసివేత వల్ల రోడ్డుమీద పడనున్న 15 వేల మంది కార్మికుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అన్ని విధాలుగా సహాయం అందిస్తామనీ బ్రిటన్ ప్రధాని కామెరాన్ తెలిపారు.
కాగా 2007లో టాటాస్టీల్ బ్రిటన్‌లో రెండో అతిపెద్ద స్టీల్ ప్లాంట్ కోరస్‌ను 1,420 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసింది. చైనానుంచి చౌకగా స్టీల్ లభ్యత, , అమ్మకాల క్షీణత, యూరప్ దేశాల ఆర్థిక పరిస్థితుల కారణంగా స్టీల్ గిరాకీ భారీగా పడిపోయింది. దీంతో బ్రిటన్ టాటా స్టీల్ వ్యాపారం కుదేలైన సంగతి తెలిసిందే.