రామంతాపూర్ ఆర్టీసి కాలనీలో పవన్ కుమార్, వసుంధర నివాసముంటున్న ఇల్లు
తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచులూరు సమీపంలో ఆదివారం జరిగిన లాంచీ ప్రమాదంలో పలువురు హైదరాబాద్ నగర వాసులు గల్లంతు కావడంతో ఆయా కుటుంబాల వారు విషాదంలో మునిగిపోయారు. సరదాగా నీటిపై వెళ్లిన వారు గల్లంతు కావడాన్నితట్టుకోలేకపోతున్నారు.
రామంతాపూర్/బోడుప్పల్: లాంచి ప్రమాదంలో బోడుప్పల్ శ్రీనివాస కాలనికి చెందిన చింతామణి శివజ్యోతి(50)మృతి చెందగా, ఆమె భర్త జానకి రామారావు(65) గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. జానకి రామారావు తన భార్య శివజ్యోతితో పాటు రామంతాపూర్ అర్టీసీ కాలనీకి చెందిన బావమరిది అంకెం పవన్‌కుమార్(50), అతని భార్య వసుంధర భవాని(45), వీరి కుమారుడు సుశీల్(22) కలిసి శనివారం ఉదయం దేవరపల్లిలోని సమీప బంధువుల ఇంటికి వెళ్లారు. చినతిరుపతి దర్శనం అనంతరం ఆదివారం ఉదయం 8.40 గంటలకు లాంచీలో షికారుకు వెల్లారు. కచ్చులూరు వద్ద జరిగిన లాంచి ప్రమాదం జరగడంతో అందరూ నీటిలో పడిపోయారు. ఈ ప్రమాదంలో జానకి రామారావు గాయాలతో బయట పడ్డారు. ప్రస్తుతం ఆయన రంపచోడవరం అసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. అతని భార్య జ్యోతి ఈ ప్రమాదంలో మృతి చెందినట్లు సమాచారం. మిగిలిన ముగ్గురి ఆచూకీ లభించక పోవడంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన జానకి రామారావు రైల్వేలో ఫుడ్ అండ్ హెల్త్ ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తూ బోడుప్పల్ శ్రీనివాస కాలనీలో స్థిరపడ్డారు. ఇతనికి మొదటి భార్యకు ఇద్దరు కుమార్తెలు కాగా పెద్ద కుమార్తె హిమబిందు ఆనారోగ్యంతో చనిపోగా రెండవ కుమార్తె నీలిమ అమెరికాలో స్థిరపడింది. మొదటి భార్య చనిపోయిన తరువాత రామంతాపూర్‌కు చెందిన శివజ్యోతిని రెండవ పెళ్లి చేసుకున్నారు. శ్రీనివాస కాలనీ రెసిడెన్సియల్ వెల్‌ఫేర్ అసోసియోషన్‌కు జానకి రామారావు అధ్యక్షుడిగా సేవలు అందిస్తున్నారు. జానకి రామారావు బావమరిది అంకెం పవన్‌కుమార్(50) స్థానికంగా కిరాణా షాపు నడిపిస్తుండగా, అతని భార్య వసుందర భవాని(45) అంబర్‌పేట ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా పని చేస్తుంది. వీరి కుమారుడు సుశీల్(22) బీటెక్ పూర్తి చేశాడు.
మా పిల్లలు ఎప్పుడొస్తారు?: వృద్ధ తల్లిదండ్రుల విలవిల
కొడుకు, కోడలు, మనుమడు క్షేమ సమాచారం కోసం రామంతాపూర్‌లోని ఆర్టీసీ కాలనీలో పవన్‌కుమాన్ తండ్రి శంకర్‌రావు తల్లి విలవిల్లాడుతున్నారు. క్షేమంగా తిరిగి రావాలని దేవుళ్లకు పూజలు చేస్తున్నారు. తమ పిల్లలు కళ్లముందే ఉన్నట్టున్నారని ఎప్పుడు వస్తారని స్థానికులను అడగడం అందిరినీ కంట తడి పెట్టించింది. పవన్ ఇంటికి ఇరుగు పొరుగు వారు చేరుకుని క్షేమ సమాచారం తెలుసుకుంటున్నారు.
సొంత మనుషుల్లా చూసుకునేవారు
ఆదివారం ఉదయమే ప్రమాదం జరగిందని తెలుసుకుని బాధపడ్డా. జానకి రామారావు బంధువులను ఫోన్‌లో సంప్రదించి క్షేమ సమాచారాలు తెలుసుకున్నా.. కిరాయి దారులను సొంతమనుషుల్లా చూసుకునే వారు.
– శ్రీనాథ్
క్షేమంగా తిరిగి రావాలి
జానకి రామారావు కుటుంబసభ్యులు కాలనీలో అందరితో కలిసి మెలిసి ఉండేవారు. ఇలాంటి కష్టం వారి కుటుంబానికి రావడం దురదృష్టం. ఎలాంటి ఇబ్బంది కలుగకుండా క్షేమంగా తిరిగి రావాలి.
– రామంతాపూర్ అర్టీసీ కాలనీఅధ్యక్షులు ప్రభాకర్‌రెడ్డి
అన్యోన్య దంపతులు
జానకి రామారావు దంపతులు అన్యోన్యంగా ఉండటమే కాక అందరితో కలసి పోయే మనస్తత్వం వారిది. వారి కుటుంబానికి ఇంత అన్యాయం జరిగిందంటే నమ్మలేక పోతున్నాం.
–డా. కనకాచారి శ్రీనివాస కాలని వాసి
కలిసిమెలిసి ఉండే జ్యోతి..
కాలనీలో జరిగే ప్రతి పండుగలో జ్యోతి అందరితో కలివిడిగా ఉండేది. శుక్రవారం రాత్రి టూర్‌కు వెళుతున్నామని చెప్పి వెళ్లింది. రెండు రోజుల్లో వస్తా అని చెప్పి తిరిగి రాని లోకాలకు వెళ్లడం బాధాకరం. – విష్ణుప్రియ,శ్రీనివాస కాలని వాసి
కుటుంబ సభ్యుల విలవిల
గచ్చిబౌలి: ప్రమాదంలో మాదాపూర్‌కు చెందిన ఈరన్ సాయికుమార్(24) గల్లంతయ్యారు. మాదాపూర్‌లోని లాష్ జిమ్‌లో సాయికుమార్ ట్రైనర్‌గా పని చేస్తున్నాడు. అతనితో పాటు ట్రైనర్లుగా టోలీచౌకికి చెందిన తలీబ్, అజర్, మియాపూర్‌కు చెందిన అక్బల్‌తో కలిసి శనివారం సాయంత్రం పాపి కొండలకు బయలుదేరారు. ఆదివారం గోదావరి నది ప్రవాహంలో లాంచీ బొల్తా పడటంతో సాయికుమార్, తలీబ్‌లు పటేల్ గల్లంతయ్యారు. అజర్ గాయాలతో బయటపడి రాజమండ్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బోట్ ఎక్కక పోవడంతో అక్బల్ సురక్షితంగా బయటపడ్డాడు. మాదాపూర్‌కు చెందిన ఈరన్ చిన్న ముత్యాలు, కౌసల్య దంపతులకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. ప్రమాదంలో పెద్ద కొడుకు సాయి కుమార్ గల్లంతు కావడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం తెలియలేదని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు.
ముగ్గురు సేఫ్... ఒకరు గల్లంతు
హయత్‌నగర్: లాంచీ ప్రమాదంలో హయత్‌నగర్‌కు చెందిన నలుగురు యువకులు గల్లంతయ్యారనే సమాచారంతో హయత్‌నగర్‌లోని పోచమ్మ బస్తీలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. నలుగురు యువకుల్లో జరణి కుమార్, విశాల్, అర్జున్‌లు సుర క్షితంగా ఉన్నారని, భరణి ఆచూకీ తెలియలేదనే వార్తలు రావడంతో వారి కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదం నెలకొంది. స్థానికుల కథనం ప్రకారం... పోచమ్మ బస్తీకి చెందిన పాడి రాజు కుమారులు భరణి(25), అతని సోదరుడు జరణి(23) కోదండ బాబూరావు కొడుకు విశాల్(27), కోదండ సత్యనారాయణ కొడుకు అర్జున్(22)లు స్నేహితులు. గత శుక్రవారం స్థానికంగా నెలకొల్పిన గణేశున్ని అబ్దుల్లాపూర్‌మెట్టులోని చెరువులో నిమజ్జనం చేశారు. నలుగురు కలిసి పాపికొండలను చూసేందుకు శనివారం రాత్రి బస్సులో రాజమండ్రికి బయలు దేరారు. ఆదివారం ఉదయం అక్కడి నుంచి బయలుదేరారు. సంఘటన జరిగి 8 గంటలైనా సరైన సమాచారం లేక పోవడంతో స్థానికుల్లో ఉత్కంఠ నెలొంది.
సరైన సమాచారంలేదు
పోచమ్మ బస్తీకి చెందిన నలుగురు యువకుల గల్లంతు విషయమై తమకు పోలీసులు సరైన సమాచారం ఇవ్వడం లేదని భరణి సోదరి వాపోయారు. ముందుగా భరణి, జరణిలు మిస్సయినట్లు విశాల్, అర్జున్‌లు సేఫ్‌గా ఉన్నట్లు సమాచారం అందిందని. అనంతరం జరణి సురక్షితంగా ఉన్నాడని తెలిసిందని ఆమె తెలిపారు. భరణికూడా సేఫ్‌గా ఉన్నాడనే సమాచారం వస్తున్నా ఎవరూ ధృవీకరించడం లేదని చెప్పారు. మూడు కుటుంబాలకు చెందిన వారు హుగాహుటిన సంఘటనా స్థలానికి బయలుదేరి వెళ్ళారు.
అంతా స్నేహితులే...
పక్క పక్క ఇండ్లలో నివసించే భరణి, జరణి, అర్జున్, విశాల్ నలుగురు స్నేహితులు భరణి ఫోన్‌పే కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తుండగా అతని సోదరుడు జరణి సికింద్రాబాద్‌లోని వెస్లీ కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. తండ్రి జీఎస్‌ఐలో ఉద్యోగి. అర్జున్ ఆర్టీసీ కండక్టర్ కాగా విశాల్ డిగ్రీ చదువుతున్నాడు.
ప్రాణాలతో బయటపడ్డ కిరణ్
అంబర్‌పేట: లాంచీ ప్రమాదంలో అంబర్‌పేట సీపీఎల్‌లో నివసించే కిరణ్‌కుమార్(24) ప్రాణాలను నుంచి బయపడ్డాడు. ఆయన ధరించిన లైఫ్ జాకెట్లు ప్రాణాలు కపాడాయి. పోలీస్ హౌసింగ్ బోర్డు విభాగంలో కాంట్రాక్ట్ విధానంలో అసిస్టెంట్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. మిత్రులతో కలిసి శనివారం విహార యాత్రకు వెళ్లాడు. ఆదివారం జరిగిన పడవ ప్రమాద భాదితుల్లో ఇతను ప్రాణాల నుంచి బయటపడ్డారు. సహాయక బృందాలు రక్షించి సమీప ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. తాను క్షేమంగా ఉన్నట్లు నల్గొండ జిల్లా చిట్యాలలో ఉన్న కుంటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
Comments
Please login to add a commentAdd a comment