
బెజవాడ శిశువు మిస్సింగ్ కథ సుఖాంతం
విజయవాడ: పాత ప్రభుత్వ ఆస్పత్రిలో శిశువు కిడ్నాప్ ఉదంతంలో మూడు రోజుల ఉత్కంఠకు తెర పడింది. రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన బెజవాడ శిశువు కిడ్నాప్ కథ సుఖాంతమైంది. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో గురువారం అపహరణకు గురైన శిశువు ఆచూకీ ఎట్టకేలకు లభ్యమైంది. నిందితురాలు కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం తుంగలవారిపాలేనికి చెందిన గంగు నాగమల్లేశ్వరిగా పోలీసులు గుర్తించారు.
వివరాల్లోకి వెళితే బిడ్డను అపహరించిన నాగమల్లేశ్వరికి గతంలో వివాహమైంది. భర్తతో వివాదాల కారణంగా విడిగా ఉంటున్న ఆమె ఏడాది క్రితం కగ్గావారిపాలేనికి చెందిన రాజును రెండో పెళ్లి చేసుకుంది. వీరిద్దరూ అవనిగడ్డ వెంకటేశ్వర ధియేటర్ రోడ్డులో నివాసముంటున్నారు. వీరికి సంతానం లేరు. అయితే ఇంటి నుంచి శిశువు ఏడుపు వినిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో అసలు విషయం బట్టబయలైంది.
డీఎస్పీ ఖాదర్ బాషా నేతృత్వంలో అవనిగడ్డ సీఐ మూర్తి రాత్రి పదిన్నర సమయంలో నాగమల్లేశ్వరి ఇంటికి వెళ్లారు. మహిళను,శిశువును పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. వారి ఫోటో తీసి విజయవాడ కమిషనరేట్‌కు ఫోన్‌లో పంపించారు. శిశువు తమ బిడ్డేనని తల్లిదండ్రులు సుబ్రమణ్యం,కళ్యాణి గుర్తించారు. ఈ మేరకు ఎస్పీకి సమాచారమందించిన పోలీసులు పసికందును విజయవాడకు తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించారు. అనంతరం శిశువును తల్లి ఒడికి చేర్చారు. బిడ్డను సురక్షితంగా తీసుకొచ్చిన పోలీసులకు,సహకరించిన మీడియాకు తల్లిదండ్రులు, బంధువులు కన్నీటితో కృతజ్ఞతలు చెప్పారు.