కాలినడకన వెళ్లి మొక్కు చెల్లించుకున్న మంత్రి!
సాక్షి, తిరుమల: తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి టీ హరీశ్‌రావు శనివారం కాలినడకన తిరుమలకొండకు వచ్చారు. తెలంగాణలో టీఆర్‌ఎస్ అధికారం చేపట్టి రెండేళ్లు పూర్తయిన నేపథ్యంలో ఆయన శనివారం తిరుమలేశుడి సన్నిధికి చేరుకున్నారు. సతీమణి శ్రీనితతో కలసి అలిపిరి మెట్లమార్గంలో నడిచివచ్చారు. రాత్రి 8.30 గంటలకు తిరుమలకొండకు చేరుకున్న ఆయన వెంకన్న స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించనున్నారు.
కాగా, తెలంగాణకు చెందిన రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా కుటుంబసభ్యులతో కలసి రోడ్డుమార్గంలో తిరుమలకు చేరుకున్నారు. వీరికి టీటీడీ రిసెప్షన్ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఓఎస్‌డీ లక్ష్మీనారాయణయాదవ్ పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికి బస ఏర్పాట్లుచేశారు. ఆదివారం ఉదయం శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు.