మాట్లాడుతున్న మల్‌రెడ్డి రంగారెడ్డి
సైదాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీంతో కలిసి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి భూ దందాలు కొనసాగించాడని మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ఆరోపించారు. నయీం దాచిపెట్టిన నగదు మంచిరెడ్డి వద్దే ఉందని ఆ విషయాన్ని అతడిని అరెస్ట్ చేసి విచారిస్తే తెలుస్తుందని అన్నారు. అమాయక రైతులను బెదిరించి మంచి ఇన్ ఫ్రా పేరుతో లూటి చేశాడన్నారు. సైదాబాద్ డివిజన్ తిరుమలాహిల్స్‌లోని తన నివాసంలో ఆదివారం మల్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.
ఎమ్మెల్యేతో పాటు అతని కుమారుడు ప్రశాంత్‌రెడ్డి చేసిన భూ దందాలు స్థానికులకు తెలుసన్నారు. టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన వరకు కిషన్ రెడ్డి ఎన్నో అక్రమాలకు పాల్పడ్డాడని అన్నారు. నయీంను అడ్డు పెట్టుకొని దందాలు సాగించడాని తెలిపారు. ఇబ్రహీంపట్నంలో సిట్ అధికారులు అరెస్ట్ చేసిన శ్రీహరితో కలిసి మంచిరెడ్డి భూ లావాదేవీలు సాగించారని అన్నారు. ఆదిభట్లలో సర్వేనెంబర్లు 165–197, 216–218, 292, 290, 209, 300 నెంబర్లలో గల భూములను నయీంతో కలిసి మంచిరెడ్డి కాజేశాడని విమర్శించారు.
ఒకే డాక్యుమెంట్‌లో శ్రీహరితో పాటు మంచిరెడ్డి పేరు ఉంటే శ్రీహరిని మాత్రమే అరెస్ట్ చేసి ఎమ్మెల్యే కిషన్ రెడ్డిని ఎలా వదిలేస్తారని ప్రశ్నించారు. నయీం కేసు నిష్పక్షపాతంగా సాగాలంటే మంచిరెడ్డిని అరెస్ట్ చేసి సీబీఐ చేత విచారించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. తమ వద్ద ఉన్న ఆధారాలను సిట్ అధికారులకు అందించినట్లు తెలిపారు. ఇబ్రహీంపట్నం కాంగ్రెస్‌పార్టీ సర్పంచ్‌లు పాల్గొన్నారు.