మా అక్కది పక్కా హత్యే | my sister was murdered | Sakshi
Sakshi News home page

మా అక్కది పక్కా హత్యే

Published Wed, Jan 25 2017 11:11 PM | Last Updated on Tue, Nov 6 2018 4:10 PM

మా అక్కది పక్కా హత్యే - Sakshi

మా అక్కది పక్కా హత్యే

ఎమ్మెల్యేలు నిందితులకే సహకరిస్తున్నారు  శ్రీగౌతమి చెల్లెలు పావని ఆరోపణ
గాయాలు మానిన అనంతరం టీడీపీ నేత బుజ్జి ఇంటిముందు దీక్ష చేపడతానని వెళ్లడి
చనిపోయినా.. తన అక్కకు అన్యాయమే జరుగుతోందని ఆవేదన
రోడ్డు ప్రమాదమే అంటున్న పోలీసులు


సాక్షి ప్రతినిధి, ఏలూరు/నరసాపురం : ’మా అక్కను ప్రణాళిక ప్రకారమే హత్య చేశారు. ఇందుకు బాధ్యులైన సజ్జా బుజ్జి, అతని భార్యపై ఫిర్యాదు ఇస్తానని అడిషనల్‌ ఎస్పీకి ఫోన్‌చేసి చెప్పాను. కోర్టు ద్వారా కేసు వేసుకోవాలన్నారు. ఈరోజు ఉదయం పాలకొల్లు సీఐ వచ్చారు. ఆయనా అదే చెబుతున్నారు. దీన్నిబట్టి చూస్తే పోలీసులు కూడా బుజ్జి కుటుంబానికే బాసటగా నిలుస్తున్నారని అర్థమవుతోంది. నరసాపురం, పాలకొల్లు ఎమ్మెల్యేలు బుజ్జిని తీసుకెళ్లి ఎస్పీని కలిశారంట. పోలీసులు బుజ్జి కుటుంబానికి రక్షణగా నిలుస్తున్నారు. మరి ఓ అమ్మాయిని చంపేశారు, దీనికి ఏం చెబుతారు. ఎమ్మెల్యేలు, పోలీసులు బుజ్జి లాంటి వారికి కాదు. మాకు, మాలాంటి అమ్మాయిలకు రక్షణ కల్పించాలి. కచ్చితంగా మా అక్కది హత్యే. ప్రస్తుతం నేను నడవలేకపోతున్నాను.

 కోలుకున్న తరువాత బుజ్జి ఇంటిముందు కూర్చుంటాను. నన్ను కూడా చంపేస్తారేమో చూస్తాను’ అని ఇటీవల మరణించిన దంగేటి శ్రీగౌతమి చెల్లెలు పావని చెప్పింది. బుధవారం ఉదయం నరసాపురంలో విలేకరులతో ఆమె మాట్లాడుతూ శ్రీగౌతమి కేసును పోలీసులు దారుణంగా పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించింది. ’ఓ అమ్మాయి హత్యకు గురైతే.. మాకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు బుజ్జి కుటుంబానికి బాసటగా నిలుస్తున్నారు’ అని వాపోయింది. కేసు మాఫీ చేయడానికి నరసాపురం, పాలకొల్లు ఎమ్మెల్యేలు బండారు మాధవనాయుడు, నిమ్మల రామానాయుడు ప్రయత్నిస్తున్నారని, ఈ వ్యవహారంలో మరికొందరు పెద్దలు కూడా ఉన్నారని ఆరోపించింది. తాను రోడ్డెక్కితే తప్ప న్యాయం జరిగేలా లేదని ఆవేదన వ్యక్తం చేసింది. గాయాల నుంచి కోలుకున్న తరువాత బుజ్జి ఇంటిముందు నిరాహార దీక్ష చేపడతానని స్పష్టం చేసింది.

పావనితో మాట్లాడిన సీఐ
పాలకొల్లు రూరల్‌ సీఐ ఎ.చంద్రశేఖర్‌ బుధవారం ఽఉదయం నరసాపురంలోని పావని ఇంటికి వచ్చారు. సుమారు 45 నిమిషాలపాటు పావని, ఆమె తల్లి అనంతలక్ష్మితో మాట్లాడారు. ఆయన తిరిగి వెళుతున్న సమయంలో విలేకరులు కేసు దర్యాప్తు, పావనితో మాట్లాడిన విషయాలపై వివరణ కోరగా.. ఈ కేసుకు సంబంధించి తాను దర్యాప్తు అధికారిని కాదన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కొన్ని విషయాలు మాట్లాడటానికి వచ్చానన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement