22న నిరుద్యోగ నిరసన ర్యాలీ | Unemployed Protest Rally On 22nd Feb Prof. Kodandaram | Sakshi
Sakshi News home page

22న నిరుద్యోగ నిరసన ర్యాలీ

Published Fri, Feb 3 2017 1:07 AM | Last Updated on Fri, Nov 9 2018 5:56 PM

22న నిరుద్యోగ నిరసన ర్యాలీ - Sakshi

22న నిరుద్యోగ నిరసన ర్యాలీ

ఇందిరాపార్కు వద్ద భారీ సభ నిర్వహిస్తాం: కోదండరాం
ఉద్యోగాల భర్తీలో ప్రభుత్వ నిర్లక్ష్యం
లక్షకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వమే చెప్పింది
ఇప్పుడు యువత ఆందోళనలో ఉన్నా పట్టించుకోవడం లేదు
జేఏసీ, సంఘాల నేతలను పోలీసులు వేధిస్తున్నారు


సాక్షి, హైదరాబాద్‌: నిరుద్యోగ యువతకు వెంటనే పని చూపించాలనే డిమాండ్‌తో ఈ నెల 22న నిరుద్యోగ నిరసన ర్యాలీని నిర్వహించనున్నట్టు తెలంగాణ జేఏసీ చైర్మన్‌ ఎం.కోదండరాం ప్రకటించారు. గురువారం హైదరాబాద్‌లో జేఏసీ స్టీరింగ్‌ కమిటీ సమావేశం అనంతరం నేతలు పిట్టల రవీందర్, పి.రఘులతో కలసి విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటైన రెండున్నరేళ్ల తర్వాత కూడా ఉద్యోగాలు ఇవ్వడంలో, నిరుద్యోగులకు ఉపాధిని కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని కోదండరాం విమర్శించారు. వివిధ శాఖల్లో 1.07 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వం 2014 లోనే ప్రకటించిందని గుర్తు చేశారు. ఇప్పటిదాకా మరో 30 వేల ఖాళీలు పెరిగాయని... త్వరలోనే ఇంకో 14 వేల పోస్టులు ఖాళీ కానున్నాయని చెప్పారు. వీటితోపాటు పబ్లిక్‌ రంగంలో మరో 50 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. మొత్తంగా 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే... ఇప్పటిదాకా టీఎస్‌పీఎస్సీ ద్వారా 50 నోటిఫికేషన్లు ఇచ్చిన ప్రభుత్వం 6 వేల ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేసిందని కోదండరాం స్పష్టం చేశారు. వాటికి పోలీసు ఉద్యోగాలను కలిపితే మొత్తం 15 వేల ఉద్యోగాలను భర్తీ చేసినట్లు తమకు సమాచారం ఉందన్నారు. ఉద్యోగాల విషయంపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని ప్రకటించారు

సతాయిస్తే వెనక్కి తగ్గుతామా?
పోలీసులు టీ జేఏసీ నేతలు, సంఘాల నాయకుల ఇళ్లకు నాలుగైదు సార్లు వచ్చి, వ్యక్తిగత వివరాల కోసం సతాయిస్తున్నారని కోదండరాం చెప్పారు. ఇది జుగుప్సాకరమైన, అన్యాయమైన పద్ధతి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా సతాయింపులకు దిగడం ద్వారా ప్రశ్నించే వారిని ఆపుతామనుకుంటే అవివేకమని విమర్శించారు. జేఏసీ చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ప్రజల కోసం పనిచేస్తున్న సంస్థ అని, జేఏసీ నేతలను ప్రశ్నించే హక్కు ప్రభుత్వానికి, పోలీసులకు లేదని పేర్కొన్నారు. ‘పోలీసుల వేధింపులు, సతాయింపులతో తెలంగాణ రాష్ట్రమే ఆగలేదు, హక్కుల కోసం చేసే పోరాటం ఆగుతుందా?’అని ప్రశ్నించారు. అవసరమైతే కోర్టులను ఆశ్రయిస్తామన్నారు. సీఎం పర్యటన ఉంటే ఆ రహదారిలోని వారందరినీ అరెస్టులు చేస్తున్నారని,  అలాంటివి మానుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా నిరుద్యోగ నిరసన ర్యాలీకి సంబంధించిన పోస్టర్‌ను జేఏసీ నేతలు ఆవిష్కరించారు. సమావేశంలో జేఏసీ నేతలు ప్రహ్లాదరావు, ఇటిక్యాల పురుషోత్తం, వెంకటరెడ్డి, గోపాలశర్మ, భైరి రమేశ్, మాదు సత్యంగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

యువత ఆశలు గల్లంతు
ప్రభుత్వం ఏటా 25 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించి, మాటతప్పిందని కోదండరాం విమర్శించారు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో వేలకు వేలు ఖర్చుపెట్టి కోచింగులు తీసుకున్న యువత పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇందిరాపార్కు వద్ద సభ
నిరుద్యోగ యువత ఆవేదనను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ఈ నెల 22న భారీ ర్యాలీ చేపడుతున్నామని కోదండరాం ప్రకటించారు. హైదరాబాద్‌లోని సుందరయ్య పార్కు నుంచి ఇందిరాపార్కు వరకు నిరసన ర్యాలీ నిర్వహించి.. ఇందిరాపార్కు వద్ద సభ నిర్వహిస్తామని తెలిపారు. ఉద్యోగాల భర్తీ చేపట్టాలంటూ యువతతో కలసి నిరసనల్లో పాల్గొంటామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement