
ర్యాగింగ్ భూతానికి విద్యార్థిని బలి
గోపవరం (బద్వేలు) : ర్యాగింగ్ భూతానికి జిల్లాకు విద్యార్థిని బలైంది. ఈ ఘటన గురువారం కర్నూలు జిల్లా నంద్యాల ఆర్‌జీఎం ఇంజనీరింగ్ కళాశాలలో చోటుచేసుకుంది. మృతురాలు బద్వేలు మండలం పుట్టాయపల్లెవాసి కావడంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. కుటుంబసభ్యుల తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన బీరం జయరామిరెడ్డి, జయమ్మ దంపతుల రెండవ సంతానం బీరం ఉషారాణి (18) నంద్యాలలో ఉన్న ఆర్‌జీఎం ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతోంది. అయితే కొంతకాలంగా సీనియర్ విద్యార్థులు ర్యాంగింగ్ పేరుతో ఇబ్బందులు పెడుతుండేవారని, ఈ విషయాన్ని 15 రోజుల క్రితం తల్లిదండ్రుల దృష్టికి తీసుకువచ్చింది. వారంరోజుల క్రితం కాలేజీ నుంచి ఇంటికి వచ్చిన ఉషారాణిని గురువారం ఉదయం ఆమె తండ్రి కారులో కాలేజీకి తీసుకెళ్లి వదిలిపెట్టి కాలేజీలో పనిచేస్తున్న సిబ్బందికి కూతురు పడుతున్న ఇబ్బందులను తెలియచేశారు.
ఇకమీదట జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి కుమార్తెను హాస్టల్‌లోకి పంపాడు. అయితే వెంటనే ఇంటికి రాకుండా కాలేజీలోనే తండ్రి జయరామిరెడ్డి ఉన్నాడు. గంటన్నర తర్వాత రూములో నుంచి బయటికి వచ్చిన కుమార్తె ఇక్కడ ఉండలేను నాన్న, నన్ను తీసుకెళ్లు అని పట్టుబట్టడంతో వెంటనే కారులో ఎక్కించుకుని ఇంటికి బయలుదేరాడు. కొద్దిదూరం వచ్చిన తర్వాత ఉషారాణి వాంతులు చేసుకోవడం మొదలుపెట్టింది. ఏమి అని తండ్రి అడిగేటప్పటికి విషద్రావణం తాగానని చెప్పింది. దీంతో కారును వెనక్కి మళ్లిస్తే ఎక్కడ ట్రాఫిక్‌లో ఇబ్బందిపడతామన్న ఉద్దేశంతో కుమార్తె ప్రాణాన్ని కాపాడేందుకు కడపలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. కొద్దిసేపటికి ఆమె మృతిచెందింది. గురువారం రాత్రి స్వగ్రామమైన పుట్టాయపల్లె గ్రామానికి ఉషారాణి మృతదేహాన్ని తీసుకువచ్చారు. ఉషారాణి మృతితో ఆమె కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
కాగా ర్యాగింగ్‌కు పాల్పడుతున్నట్లు ఉషారాణితో పాటు తోటి విద్యార్థులు కూడా కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అయితే యాజమాన్యం ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే తమ కుమార్తె ర్యాగింగ్ భూతానికి బలైందని తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు. కాగా కాలేజీ యాజమాన్యం విద్యార్థిని మృతికి ర్యాంగింగ్కు సంబంధం లేదని ప్రకటించినట్లు తెలిసింది. కానీ కాలేజీలో చదువుతున్న విద్యార్థులు ర్యాంగింగ్ వల్లే విద్యార్థి మృతిచెందిందని ఆందోళనకు కూడా దిగారు. మృతురాలి తండ్రి ఫిర్యాదుమేరకు బద్వేలు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. మృతురాలు ఉషారాణి బద్వేలు జెడ్పీటీసీ సభ్యురాలు శిరీషా చెల్లెలు. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ శుక్రవారం సాయంత్రం గ్రామానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి కుటుంబసభ్యులతో మాట్లాడారు. ర్యాగింగ్‌కు పాల్పడిన వారు ఎంతటివారైనా సరే వదిలేది లేదని తెలిపారు.