చంద్రబాబుతో కుదిరేలా లేదు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీజేపీ-టీడీపీ పొత్తు వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. చంద్రబాబు మొండిపట్టుతో విసిగిపోయిన కమలనాథులు తాము ఒంటరి పోరుకు కూడా సిద్ధమనే సంకేతాలిచ్చారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అసలు పొత్తు వద్దేవద్దని పార్టీ అధిష్టానానికి గట్టిగా చెప్పినప్పటికీ.. తెలంగాణలో కమలంతో పొత్తు ఉండాల్సిందేనన్న బలమైన అభిప్రాయంతో ఉన్న చంద్రబాబు బీజేపీ అధిష్టానంపై ఒత్తిడి తెచ్చిమరీ పొత్తు చర్చలకు సిద్ధమయ్యారు.
కానీ.. పొత్తు అవసరం తనదే అయినప్పటికీ బీజేపీకి అతి తక్కువ సీట్లు కేటాయించి ఎక్కువ స్థానాలు తనే పొందాలనే మొండిపట్టుతో కమలనాథుల సహనాన్ని పరీక్షిస్తున్నారని ఆ పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. టీడీపీ పక్షాన ఎంపీలు సుజనాచౌదరి, సి.ఎం.రమేశ్‌లు ఇప్పటికే పలు దఫాలుగా బీజేపీ నేతలతో చర్చించినప్పటికీ పొత్తు వ్యవహారం కొలిక్కి రాకపోవటంతో.. చంద్రబాబు శుక్రవారం సాయంత్రం స్వయంగా రంగంలోకి దిగి బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జి ప్రకాశ్ జవదేకర్‌తో రెండు గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారు. ఆదిలో కచ్చితంగా 60 అసెంబ్లీ స్థానాలు, 9 పార్లమెంటు సీట్లకు తగ్గకుండా డిమాండ్ చేసిన జవదేకర్ పట్టువిడుపులతో వ్యవహరించి 48 అసెంబ్లీ స్థానాలు ఇచ్చినా సరే సర్దుకుపోతామని బాబుతో చెప్పారు. కానీ చంద్రబాబు మాత్రం 35 అసెంబ్లీ స్థానాలు, 7 ఎంపీ సీట్లకు మించి బీజేపీకి వదిలేది లేదని మొండిపట్టు పట్టటంతో చర్చలు నిష్ఫలమయ్యాయి. తమ పార్టీలో ఎక్కువ మంది నేతలు పొత్తు వద్దన్నా తాము స్నేహహస్తం అందించటమే కాకుండా, ఏకంగా 12 అసెంబ్లీ సీట్లను తగ్గించుకుని మరీ చేసిన ప్రతిపాదనను కాదనటం సరికాదని జవదేకర్ బాబు ముందు అసహనం వ్యక్తంచేశారు. అయినా బాబు తీరు మారకుంటే విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకె ళ్తానని చెప్పి భేటీ నుంచి నిష్ర్కమించారు.
ఇక టీడీపీతో చర్చలు వద్దన్న కిషన్‌రెడ్డి!
చంద్రబాబు ఇంటి నుంచి వచ్చిన జవదేకర్ పార్టీ తెలంగాణ ఎన్నికల కమిటీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసినట్టు తెలిసింది. తెలంగాణలో పార్టీ ఇంతగా బలోపేతమై కూడా టీడీపీతో దేబరించుకోవాల్సిన దుస్థితి దారుణమని ఆయన పేర్కొన్నట్టు సమాచారం. చంద్రబాబు అవహేళన చేసేలా మాట్లాడినా పొత్తు చర్చలను కొనసాగించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో విషయాన్ని జవదేకర్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ దృష్టికి తీసుకెళ్లారు. టీడీపీ ప్రతిపాదన దారుణంగా ఉన్నందున దానికి అంగీకరించాల్సిన అవసరం లేదని రాజ్‌నాథ్ పేర్కొన్నట్టు తెలిసింది. దీంతో అధిష్టానం నుంచి ఎలాంటి నిర్ణయం వెలువడినా నేతలు సిద్ధంగా ఉండాలని జవదేకర్ సూచించారు. అవసరమైతే పొత్తును సీమాంధ్రకే పరిమితం చేయాలనే భావన ఈ సమావేశంలో వ్యక్తమైంది. అయితే బీజేపీ అధిష్టానం పెద్దలతో చంద్రబాబు ఫోన్‌లో మంతనాలు జరిపినట్టు తెలిసింది. తాము ఆఫర్ చేసిన సంఖ్య మెరుగ్గానే ఉందని, దానికి అంగీకరిస్తే ఇరు పక్షాలకు లబ్ధి ఉంటుందని పేర్కొన్నట్టు సమాచారం. శనివారం పొత్తు ఖరారు చేస్తే బాగుంటుందని సూచించినట్టు తెలిసింది.
గురువారం అలా.. తర్వాత ఇలా: గురువారం నగరానికి వచ్చిన జవదేకర్ సాయంత్రం నుంచి రాత్రి వరకు టీడీపీ ఎంపీలు సుజనాచౌదరి, సి.ఎం.రమేశ్‌లతో మంతనాలు జరిపారు. ఈ సందర్భంగా 40 సీట్లను బీజేపీకి వదిలేందుకు వారు సానుకూలంగా మాట్లాడారు. కానీ విషయాన్ని బాబుతో చర్చించి చెప్తామన్నారు. శుక్రవారం స్వయంగా బాబే చర్చలకు వచ్చి 35 సీట్లకు మించి ఇవ్వటం సాధ్యం కాదనడంతో కంగుతినటం జవదేకర్ వంతైంది.
బాబు పట్టువిడుపులు చూపాలన్న ఎర్రబెల్లి!
తెలంగాణలో బీజేపీతో పొత్తు లేకుంటే తీవ్రంగా నష్టపోతామని టీడీపీ తెలంగాణ ఎన్నికల కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్రబెల్లి దయాకర్‌రావు చంద్రబాబుతో పేర్కొన్నట్లు తెలిసింది. సీట్ల విషయంలో పట్టువిడుపుల ధోరణి అవలంబించైనా సరే పొత్తు ఖరారు చేయాల్సిందిగా ఆయన కోరినట్లు సమాచారం. మరోవైపు తెలంగాణకు సంబంధించిన పొత్తు చర్చల్లో తెలంగాణ నేతలకు అవకాశం ఇవ్వకుండా సుజనాచౌదరి, సి.ఎం.రమేశ్‌లు మాత్రమే ఉండటాన్ని కూడా ఆయన ప్రశ్నించినట్లు తెలిసింది. దీంతో తాను పాల్గొంటున్న పొత్తు చర్చలకు బాబు ఆయనను ఆహ్వానించటం విశేషం.