అమలాపురం, న్యూస్‌లైన్ :పరిషత్ పోరు పరిసమాప్తమైంది. మండల పరిషత్ ఎన్నికల్లో టీడీపీ మెజార్టీ స్థానాలు సాధించగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గట్టిపోటీనిచ్చింది. పలు పరిషత్‌లలో నువ్వా.. నేనా అన్నట్టుగా పోటీ పడడంతో ఫలితం ఆఖరి వరకు తేలని పరిస్థితి నెలకొంది. జిల్లాలో 57 మండల పరిషత్‌ల పరిధిలో 1063 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, 23 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 1040 స్థానాలకు గాను గత నెల 11వ తేదీన పోలింగ్ జరిగింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కౌంటింగ్‌ను నెలరోజులకు పైగా వాయిదా వేశారు. పరిషత్‌కు సంబంధించి మంగళవారం కౌంటింగ్ జరిగింది. బ్యాలట్ పత్రాలతో ఎన్నికలు నిర్వహించిన కారణంగా కౌంటింగ్ ఆలస్యమైంది. కొన్ని మండలాల్లో బుధవారం తెల్లవారుజాము వరకు కౌంటింగ్ జరగడం గమనార్హం. పురష్క కాలం తరువాత పరిషత్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మెజార్టీ స్థానాలు గెలుచుకుంది. ఏకగ్రీవంగా 11 ఎంపీటీసీ స్థానాలు, ఎన్నికల జరిగిన చోట 597 స్థానాలతో కలుపుకుని మొత్తం 608 ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకుంది. 57 మండల పరిషత్‌లకు గాను, 40 మండల పరిషత్‌లను సాధించింది. స్థానికంగా నెలకొన్న రాజకీయ పరిస్థితులు ఆ పార్టీ విజయానికి దోహదపడ్డాయి.
పరిషత్ ఎన్నికలకు, సాధారణ ఎన్నికలకు మధ్య తక్కువ సమయం ఉండడం, ప్రత్యర్థి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలపైనే మొత్తం దృష్టి పెట్టడంతో టీడీపీకి మెజార్టీ స్థానాలు గెలుచుకునే అవకాశం కలిగింది. ఏజెన్సీ, మెట్టలోని తుని, ప్రత్తిపాడు, జగ్గంపేట నియోజకవర్గాల్లో మినహా మిగిలిన ప్రాంతాల్లో మండల పరిషత్ ఎన్నికల్లో ఆ పార్టీ గణనీయమైన విజయాన్ని సొంతం చేసుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 389 ఎంపీటీసీ స్థానాలను, 13 మండల పరిషత్‌లను గెలుచుకునే అవకాశం లభించింది. ఏలేశ్వరం మండల పరిషత్‌లో వైఎస్సార్‌సీపీ ఆరు, టీడీపీ ఏడు స్థానాలు సాధించింది. అయితే ఈ మండల పరిషత్ ఎంపీపీ స్థానం ఎస్టీలకు రిజర్వ్ కాగా, టీడీపీ తరఫున పోటీ చేసినవారు ఓడిపోయారు. దీనితో వైఎస్సార్‌సీపీ తరపున గెలిచిన ఎస్టీ ఎంపీటీసీ అభ్యర్థికి ఎంపీపీ స్థానం కేటాయించడం మినహా మరో అవకాశం లేకుండా పోయింది. వైఎస్సార్‌సీపీ ఓటమి చెందిన ఎంపీటీసీల్లో మూడొంతుల చోట్ల చాలా తక్కువ ఓట్లతో ఓటమి చెందడం గమనార్హం.
కాంగ్రెస్‌కు విభజన సెగ
రాష్ట్ర విభజనానంతరం జరిగిన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దాదాపు తుడుచుపెట్టుకుపోయింది. ఆ పార్టీ పెదపూడి, రాజానగరం ఎంపీటీసీ స్థానాలను మాత్రమే గెలుచుకొంది. బీఎస్సీ, బీజేపీలు అసలు బోణీయే చేయలేకపోయాయి.
ఆ నాలుగు చోట్లా ఉత్కంఠే
జిల్లాలో రెండు మండల పరిషత్ ఎన్నికల్లో ఎంపీపీ పీఠం ఉత్కంఠను రేపనుంది. రౌతులపూడి మండల పరిషత్ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ, టీడీపీలు చెరో ఏడు ఎంపీటీసీ స్థానాలు గెలుచుకున్నాయి. తాళ్లరేవు మండల పరిషత్‌లోను రెండు పార్టీలూ చెరో 12 ఎంపీటీసీ స్థానాల చొప్పున కైవసం చేసుకున్నాయి. దీనితో ఇక్కడ ఎంపీపీ ఎన్నిక ఉత్కంఠ భరితంగా మారనుంది. యూ.కొత్తపల్లి మండల పరిషత్‌లో సైతం వైఎస్సార్, టీడీపీలు చెరో 12 స్థానాలు చొప్పున గెలుచుకున్నాయి. కాజులూరులో సైతం రెండు పార్టీలు చెరో పది ఎంపీటీసీలు గెలుచుకోవడంతో ఎంపీపీ పీఠం ఏ పార్టీ సాధిస్తుందో వేచి చూడాల్సి ఉంది.
టీడీపీ గెలుచుకున్న స్థానాలు
1. అమలాపురం, 2. అల్లవరం. 3. మామిడికుదురు, 4. పి.గన్నవరం, 5. అయినవిల్లి, 6. అంబాజీపేట, 7. రాజోలు, 8. సఖినేటిపల్లి, 9. మలికిపురం, 10. కొత్తపేట, 11. ఆత్రేయపురం, 12. ఆలమూరు, 13. ముమ్మిడివరం, 14. ఐ.పోలవరం, 15. రాజానగరం, 16. కడియం, 17. సీతానగరం, 18. కోరుకొండ, 19.గోకవరం, 20. రామచంద్రపురం, 21. మండపేట, 22. అనపర్తి, 23. కపిలేశ్వరపురం, 24. బిక్కవోలు, 25. రాయవరం, 26. పెద్దాపురం, 27. గండేపల్లి, 28. రంగంపేట, 29. ప్రత్తిపాడు, 30.. శంఖవరం, 31. తొండంగి, 32. కాకినాడ రూరల్, 33. పెదపూడి, 34. సామర్లకోట, 35. పిఠాపురం, 36. కరప, 37. గొల్లప్రోలు, 38. రాజవొమ్మంగి, 39. ఏజెన్సీ గంగవరం, 40. అడ్డతీగల.
వైఎస్సార్‌సీపీ సాధించినవి
1. ఉప్పలగుప్తం, 2. కాట్రేనికోన, 3. రావులపాలెం, 4. కె.గంగవరం, 5. జగ్గంపేట, 6. కిర్లంపూడి, 7. ప్రత్తిపాడు, 8. తుని, 9. మారేడుమిల్లి, 10.దేవీపట్నం, 11. రంపచోడవరం, 12. వై.రామవరం, 13. ఏలేశ్వరం (టీడీపీకి ఒక ఎంపీటీసీ స్థానం ఎక్కువ వచ్చినా ఇక్కడ ఎస్.టి. రిజర్వ్ స్థానాలన్నీ వైఎస్సార్‌సీపీ ఖాతాలో పడ్డాయి.)చెరి సమానం
1. కాజులూరు, 2. తాళ్లరేవు, 3. రౌతులపూడి, 4. యు.కొత్తపల్లి.
మెజార్టీ ఎంపీపీలు సాధించిన టీడీపీ
Published Wed, May 14 2014 11:57 PM | Last Updated on Fri, May 25 2018 9:17 PM
Advertisement
Advertisement