సాక్షి, అనంతపురం : మండల పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో వైఎస్సార్‌సీపీ, టీడీపీల మధ్య పోరు నువ్వా.. నేనా అన్న రీతిలో సాగినా తుదకు విజయం టీడీపీని వరించింది. జిల్లాలోని 63 మండలాల పరిధిలో 849 ఎంపీటీసీ స్థానాలు (ప్రాదేశికాలు) ఉండగా, 837 స్థానాలకు ఏప్రిల్ 6, 11 తేదీలలో రెండు విడతలుగా ఎన్నికలు జరిగాయి. వీటికి సంబంధించి మంగళవారం ఓట్ల లెక్కింపు చేపట్టారు. కాగా నామినేషన్ల ఉపసంహరణ నాటికి 849 స్థానాల్లో 12 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.
ఇందులో ఎనిమిది స్థానాలను టీడీపీ కైవసం చేసుకోగా, ఒక స్థానంలో కాంగ్రెస్, మూడు చోట్ల స్వతంత్య్ర అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. 837 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మంగళవారం అర్థరాత్రి దాటినా కౌంటింగ్ కొనసాగింది. కడపటి వార్తలు అందేసరికి 820 ఎంపీటీసీల ఫలితాలు ప్రకటించారు. ఇందులో టీడీపీ 507, వైఎస్సార్‌సీపీ 295, కాంగ్రెస్ 5, సీపీఐ 1, ఇతరులు 12 స్థానాల్లో విజయం సాధించారు.
టీడీపీ గెలుస్తుందనుకున్న ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ పాగా వేయగా, వైఎస్సార్‌సీపీ గెలుస్తుం దన్న స్థానాల్లో టీడీపీ పాగా వేసింది. ఒక్కో రౌండ్‌లో..ఒక్కో పార్టీ ఆధిక్యత కనబరుస్తూ వచ్చింది. రాయదుర్గం, ఉరవకొండ, ఎల్లనూరు, పుట్లూరు, తలుపుల, నల్లచెరువు, కూడేరు, గుత్తి, తాడిమర్రి, వజ్రకరూరు మండలాల్లో వైఎస్సార్‌సీపీ స్పష్టమైన ఆధిక్యం కనబరిచి ఆ మండలాల్లో ఎంపీపీ కుర్చీలను కైవసం చేసుకుంది. అనంతపురం రూరల్ మండలంలో ఇరు పార్టీల మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది.
కాగా పెనుకొండలో మొత్తం 16 మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ స్థానాలుండగా వైఎస్సార్‌సీపీ 8, టీడీపీ 8 స్థానాల్లో గెలుపొందడంతో ఇక్కడ హంగ్ ఏర్పడింది. టీడీపీ మెజార్టీ ఎంపీపీ స్థానాలు గెలుచుకున్నా.. ఓట్ల శాతం మాత్రం వైఎస్సార్‌సీపీకే ఎక్కువగా ఉండడం గమనార్హం. కడపటి వార్తలు అందేసరికి టీడీపీ 386 స్థానాల్లో, వైఎస్‌ఆర్‌సీపీ 227 స్థానాల్లో, ఒక స్థానంలో సీపీఐ, 32 స్థానాల్లో స్వతంత్రులు విజయం సాధించారు. వైఎస్‌ఆర్‌సీపీ కొత్త పార్టీ, అందునా గ్రామీణ స్థాయిలో సంస్థాగత నిర్మాణం పెద్దగా లేకపోయినా మండల పరిషత్ ఎన్నికల్లో టీడీపీకి దీటుగా స్థానాలు సాధించడంతో వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో ఉత్సాహం పెల్లుబికింది. మునిసిపల్ ఫలితాలు టీడీపీకి అనుకూలంగా రావడంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆనందంలో మునిగిపోయారు. అయితే ఆ వెంటనే వెలువడిన పరిషత్ ఫలితాల్లో వైఎస్సార్‌సీపీ గట్టి పోటీనిచ్చింది. ఇదే ట్రెండ్ సార్వత్రిక ఎన్నికల నాటికి వైఎస్సార్‌సీపీకి పూర్తి అనుకూలంగా మారే పరిస్థితి ఉందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
క్షణ క్షణం.. ఉత్కంఠ
Published Wed, May 14 2014 3:05 AM | Last Updated on Tue, May 29 2018 4:06 PM
Advertisement