రాణీ రాణమ్మా! ఆనాటి గురుతులు ఇవేనమ్మా!
చెన్నై సెంట్రల్ తెలుగువారి కబుర్లు
తెనాలిలో జన్మించారు... చెన్నపట్నం చేరుకున్నారు... ఆటుపోట్లతో నిండిన జీవితాన్ని గడిపారు. కట్టుబాట్లను ఎదుర్కొన్నారు. మూడు పదులు నిండకముందే నూరేళ్ల కష్టాలు ఎదుర్కొన్నారు... రాణి బుక్ సెంటర్ స్థాపించి... చెన్నైలోనిశివజ్ఞానం రోడ్ నుంచి పానగల్‌పార్కు మధ్యనున్న పాండీబజార్ రోడ్లను వాణిజ్య కేంద్రాలుగా మార్చారు... తెలుగు వారికి చేరువయ్యారు... తెలుగు సాిహ తీప్రముఖులకు కేంద్రబిందువు అయ్యారు... ఆమె త్రిపురనేని రామస్వామి, అన్నపూర్ణదేవిల కుమార్తె... పేరు చౌదరాణి
త్రిపురనేని రామస్వామి కుమార్తె త్రిపురనేని గోపీచంద్ చెల్లెలు అయిన చౌదరాణి ఎనిమిదో యేటే తండ్రి గతించారు. నేవల్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న అట్లూరి పిచ్చేశ్వరరావును వివాహం చేసుకున్నారు. ‘రాయల్ ఇండియన్ నేవీ’ తిరుగుబాటు జరిగిన సందర్భంలో తనున్న నౌకమీద తిరుగుబాటుని ముందుండి నడిపించారు. అది ఆంగ్లేయుల పాలనని ప్రతిఘటించడం. అయితే ఉన్నట్టుండి పిచ్చేశ్వరరావు గుండెపోటుతో మరణించారు. అంతే! ఆమెకు కళ్లముందు అంధకారం దట్టంగా అలముకుంది. చౌదరాణి ఒంటరివారయ్యారు. పదిసంవత్సరాలు కూడా నిండని ఏకైక కుమారుడు.
బతుకుపోరాటం చేయాల్సిన పరిస్థితి. తండ్రి దగ్గర నుంచి వచ్చిన విప్లవభావాలు, భర్త నుంచి నేర్చుకున్న స్వేచ్ఛాయుత జీవనం, ఇవన్నీ ఆమెను భావోద్వేగాలకు దూరం చేశాయి. ఆమె వంటింటికి పరిమితమై మరో వంటమనిషి కాకూడదని నిశ్చయించుకున్నారు. ఆ రోజుల్లో భర్తను పోగొట్టుకున్న వారంతా వంటగదికి పరిమితమైపోయేవారు. ఆమె మాత్రం ధైర్యంగా ముందడుగు వేయడానికి నిశ్చయించుకున్నారు. భర్త గతించేనాటికి ఆమె చేతిలో దమ్మిడీ లేదు.
కాని కొత్త జీవితం ప్రారంభించాలి. అందుకు ఏం చేయాలా అని తీవ్రంగా ఆలోచించారు. ఆవిడలోని ఆ స్వేచ్ఛాయుత ఆలోచనను పెద్దలు జీర్ణించుకోలేకపోయారు. అయినా ఆమె దృఢసంకల్పంతో ముందడుగు వేశారు. ఒక యువతి, అందునా వితంతువు... ఇంటిపట్టున ఉండక, బయటకు వచ్చి తన హక్కులకోసం పోరాడటాన్ని పెద్దలు భరించలేకపోయారు, అంగీకరించలేకపోయారు.
ఆమె ప్రాణానికి ముప్పు ఏర్పడే వరకు వెళ్లింది. ఒకానొక పరిస్థితుల్లో చౌదరాణి లెసైన్స్‌డ్ రివాల్వర్‌కి అర్జీ పెట్టుకోవలసి వచ్చిందంటే పరిస్థితి అర్థం అవుతుంది. ఇక యువ వితంతువు... 30 సంవత్సరాల వయసు... అది 1960ల నాటి కాలం... అన్ని ఆటంకాలను ఎంతో ఓర్పుతో, ధైర్యంతో ఎదుర్కొని ఒక్కో అడుగు ముందుకు వేయడం ప్రారంభించారు. ఆ రోజుల్లో ఆమె కొన్ని మాస పత్రికలకు, దినపత్రికలకు కరస్పాండెంట్‌గా పనిచేశారు. వాటిలో కొన్ని విశాలాంధ్ర, శ్రీమతి, జయశ్రీ వగైరా. కోయంబత్తూరు వెళ్లి అక్కడి అంశాలపై కథనాలు అందించిన తొలి తెలుగు జర్నలిస్టు ఈవిడే అయి ఉండవచ్చు. అంతేకాక, అక్కడి పరిశ్రమల నుంచి ప్రకటనలను కూడా ఆమె సేకరించి చరిత్ర సృష్టించారు.
పాండీబజార్ (సర్ త్యాగరాయ రోడ్)లో పాత ఇంటి నెంబరు 88లో పెనుగొండ నారాయణ చెట్టికి ఒక భవంతి ఉండేది. ఆయన ఎంతో ఉదారుడు. చౌదరాణికి దుకాణం కట్టించి అతి తక్కువ అద్దెకు ఇస్తానని ఆయన మాట ఇచ్చారు. అయితే మద్రాసు కార్పొరేషన్ ఇంకా ఇతర విభాగాల నుంచి పర్మిషన్లు తెచ్చుకునే బాధ్యతను ఆవిడకు వదిలేశారు. ఆవిడ ఈ విషయాన్ని సవాలుగా తీసుకున్నారు.
ఒక స్త్రీ ఇలా ముందుకు రావడాన్ని పురుష సమాజం అంగీకరించలేకపోయింది. ఆ విషయాన్ని విడిచిపెట్టేద్దాం. వ్యాపారం నడపడం? ఆ భూమి తాలూకు ఆసామికి బెదిరింపులు రావడం ప్రారంభమైంది. ఆయన ఆడిన మాట తప్పలేదు. షాపు నిర్మించి, చౌదరాణి చేతికి అందించారు. జీవితంలో పోరాటాలు అలవాటుపడిన ఆమె తను అనుకున్న లక్ష్యం చేరారు. తెలుగు పుస్తకాల షాపు ప్రారంభించారు. ఆమె సన్నిహితులంతా షాపుకి ఆమె పేరునే పెట్టుకోమని సూచించడంతో ‘రాణి బుక్ సెంటర్’ అని పేరు పెట్టారు.
‘‘ఓపెనింగ్ షార్ట్‌లీ’’ అనే బ్యానర్ తగిలించారు. ఆ బ్యానర్‌ని రాత్రికి రాత్రే కొందరు ఉన్మాదులు తొలగించేశారు. తెలుగు పుస్తక ప్రచురణారంగంలో విప్లవం తీసుకువచ్చిన కీ.శే.ఎం.ఎన్‌రావు అనే పెద్దమనిషి ఎంతో ఉదారంగా తన దగ్గర ఉన్న పుస్తకాలను అప్పు మీద ఆ దుకాణంలో అమ్మకానికి ఉంచారు. న్యూ సెంచరీ బుక్‌హౌస్‌కి చెందిన రాధాకృష్ణన్, ఇంకా ‘మక్కా ఆఫ్ తెలుగు పబ్లిషింగ్’గా ప్రసిద్ధి చెందిన విజయవాడలోని ఇతర ప్రచురణ సంస్థలు కూడా అభిమానంతో ముందుకు వచ్చాయి.
సరిగ్గా ఆమె భర్తను కోల్పోయిన మూడు సంవత్సరాల తరవాత 1969, డిసెంబరు 8వ తారీకున షాపు ప్రారంభమైంది. నగరంలోని తెలుగు ప్రముఖులంతా అక్కడకు రావడం ప్రారంభమైంది. కొందరు ఆమెను కలిసి అభినందనలు తెలియచేస్తూనే, పక్కకు వచ్చి ‘త్వరలోనే మూత పడిపోతుంది’ అనడం పరిపాటి అయిపోయింది. మొత్తానికి శివజ్ఞానం వీధి మూల నుండి పానగల్ పార్కు మధ్యనున్న పాండీ బజార్‌లో ఉన్న ఆవాసాలు వాణిజ్యకేంద్రాలుగా మారిపోయాయి.
అక్కడివారందరూ ఆమెను ఎంతో గౌరవాభిమానాలతో రాణమ్మ అని పిలుచుకునేవారు. చౌదరాణి తెలుగులో ‘శాంతినివాసం’ వంటి మేటి కథలను, ‘అగ్నిపూలు’, నిశ్శబ్ద తరంగాలు’ వంటి నవలలను రచించారు. హిందీ నుంచి తెలుగులోకి, తెలుగు నుంచి హిందీలోకి తర్జుమా చేశారు. ఆకాశవాణిలో కథలు చదివారు. నవలలు రచించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠ్యపుస్తకాలు సకాలంలో ప్రచురించి తమిళనాడులో ఉన్న తెలుగువారికి అందజేయలేక పోయినప్పుడు చౌదరాణి లాభాలు ఆశించకుండా అందించారు. ప్రభుత్వ ఉదాసీనవైఖరితో ఈ కార్యక్రమాన్ని కొనసాగించలేకపోయారు. ఆ కాలంలో జీవించిన తెలుగు ప్రముఖులందరూ అక్కడ గౌరవం అందుకున్నవారే. చిత్రనిర్మాత కాట్రగడ్డ మురారి తన పుస్తకం ‘నవ్వి పోదురు గాక’ లో ‘‘ఆవిడ నన్ను ఉత్తమ సాహిత్యం వైపు నడిపించారు.
ఆమెను సోదరి సమానురాలుగా భావిస్తున్నాను’’ అని చెప్పుకున్నారు. తమిళనాడులో జయలలిత ప్రభుత్వం పుస్తకాల మీద పన్ను విధించినప్పుడు, చౌదరాణి తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ విషయమై ఒక ప్రముఖ తెలుగు దినపత్రికకు వార్త అందించడం వల్ల అందులో ఎడిటోరియల్ కూడా వచ్చింది. 1996లో చౌదరాణి కన్ను మూశారు. చెన్నైలో అడుగుపెట్టిన తెలుగువారికి చౌదరాణి అంటే తెలుగు సాహిత్యకుటుంబానికి ఆడపడచు అనే ముద్ర పడిపోయింది.
- డా. పురాణపండ వైజయంతి, సాక్షి, చెన్నై
ఇన్‌పుట్స్: అనిల్ అట్లూరి (చౌదరాణి ఏకైక కుమారుడు)
జవహర్‌లాల్ నెహ్రూ తరవాత, చౌదరాణి కుటుంబంలోని ఇద్దరు వ్యక్తులకు పోస్టేజ్ స్టాంప్ ఆతిథ్యం లభించింది. ఒకటి- కవిరాజు త్రిపురనేని రామస్వామి, రెండు- త్రిపురనేని గోపీచంద్.