దళిత సాహిత్యం
నిండార రాజు నిద్రించు నిద్రయు నొకటే అండనే బంటు నిద్ర అదియు నొకటే మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి యొకటే
చండాలుండేటి సరి భూమి యొకటే ఎప్పుడో వందేళ్ల క్రితం బ్రహ్మమొక్కటే అని గళమెత్తాడు అన్నమయ్య. చాపకూడుతో సమానత్వాన్ని సాధించ ప్రయత్నించాడు బ్రహ్మనాయుడు. మతం పేరుతో సాగుతున్న అమానవీయ వ్యవస్థని ఎండగట్టాడు వేమన. ఇవన్నీ ఎక్సప్షన్లే కానీ రూల్స్ కాదు.
భారతీయ సంస్కృతిపై మాయని మచ్చలా నిలిచిన ఈ ఆచారం ప్రజల నరనరాల్లో జీర్ణించుకుపోయింది. తారతమ్యాలు తెలియని లేతమనసుల ఆటపాటల్లో కూడా ఈ అసమానతని ఉగ్గుపాలతో పట్టించిందీ సమాజం. మధ్యయుగంలో వీరైశైవ, వీరవైష్ణవాలు, ఇస్లాం కొంత వరకూ నిమ్నజాతుల్లో చలనశీలతకి అవకాశమిచ్చినా ఆధునిక యుగారంభానికి కులవ్యవస్థ బిర్రబిగుసుకుంది. ఈస్టిండియా కంపెనీ రాజకీయాల్లో ముస్లిం అధికారవర్గం పట్ల వైరం, హిందూ అగ్రవర్ణాల పట్ల పక్షపాతం ఈ అమానుషం మరింత బలపడేందుకు పరోక్షంగా దోహదం చేసింది.
19వ శతాబ్దం చివర్లో గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కొత్తమార్పులు వచ్చాయి. స్థానిక యాజమాన్య వ్యవస్థ ప్రాముఖ్యం పోయి, వ్యవసాయం వ్యాపారమయమైంది (మానిటైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్). గ్రామాల్లో నిరుద్యోగం ప్రబలింది. కడుపు కూటికై పట్టణాలకి వలసలు మొదలయ్యాయి. క్రైస్తవ మిషనరీల వల్ల, పిఠాపురం రాజా వంటి సామాజిక సృ్పహ ఉన్న జమీందారుల వల్ల దళితవర్గాల్లో కొందరికి విద్యావకాశాలు లభించాయి. పాశ్చాత్య దేశాల్లోని సమానత్వ భావన, పెరుగుతున్న సోషలిస్ట్ సిద్ధాంతాల ప్రభావంతో ఆధునిక సాహిత్యంలో సాంఘిక అసమానతలపై నిరసనలు మొదలయ్యాయి. 1909లో ఆంధ్రభారతిలో అచ్చయిన ‘మాలవాండ్ర పాట’ తెలుగు దళిత సాహిత్యంలో మొట్టమొదటిది. ‘మంచియన్నది మాల అయితే మాల నేనవుతా’ అంటూ గురజాడ వంటి ఆధునిక కవులు తమ గళం విప్పారు. మంగిపూడి వేంకటశర్మ ‘నిరుద్ధ భారతం’, కొండపల్లి జగన్నాథరావు 1921లో రాసిన ‘మేలుకొలుపు’ గీతం, 1930లో జాలా రంగస్వామి ‘అంటరానివాడెవ్వడు’ పాట, 1933లో కుసుమ ధర్మన్న ‘మాకొద్దీ నల్లదొరతనము’ గేయం, ఆనాటి దళిత సాహిత్యంలో మైలు రాళ్లుగా నిలిచాయి.
ఉన్నవ లక్ష్మీకాంతం రచించిన ‘మాలపల్లి’ నవల హరిజనుల కష్టనష్టాలు, అవమానాల గురించి తెలియజేసి అగ్రవర్ణాల దృక్పథంలో మార్పుకి పురిగొల్పింది. కానీ ఆనాటి సాహిత్యంలో, పత్రికల వ్యాసాలలో దళితులపై శతాబ్దాలుగా సాగిన అణచివేతకు పశ్చాత్తాపం బదులు ఏడు కోట్ల హరిజనులు హిందూ సమాజానికి దూరమైపోతారేమో అన్న భయమే ఎక్కువగా కనిపిస్తుంది. అయినప్పటికీ దళిత సాహిత్య చైతన్యం కొనసాగింది. గుర్రం జాషువా రచించిన ‘గబ్బిలం’, గాంధీ-అంబేద్కర్‌ల భావాలకి అద్దంపడుతూ బోయి భీమన్న రచించిన ‘గుడిసెలు కాలిపోతున్నై’ ‘పాలేరు’ వంటి కావ్యాలు బడుగు వర్గాలకి మరింత ఆత్మస్థైర్యాన్నిచ్చాయి.
దళితుల్లో వచ్చిన ఆనాటి నూతన చైతన్యంలో మూడు నిర్దిష్టమైన కోణాలు కనిపిస్తాయి. మహారాష్ట్రలో జీవం పోసుకున్న అంబేద్కర్ భావాలు భాగ్యరెడ్డి వర్మ వంటి వారికి ఉద్యమస్ఫూర్తినిస్తే, గాంధీజీ నిర్దేశించిన సేవా విధానం ఎందర్నో కాంగ్రెస్ వాదానికి అనుకూలురను చేసింది. కమ్యూనిస్ట్ దృక్పథంలోని భూస్వామ్య వ్యతిరేకత కొందర్ని రాడికల్ ఉద్యమాలకి ప్రోత్సహించింది.
1919లో మాంటేగూ సంస్కరణల తరువాత వచ్చిన ప్రజాస్వామిక మార్పుల వల్ల రాజకీయాల్లో దళితుల సంఖ్యకి గుర్తింపు వచ్చింది. వివిధ రాజకీయ పార్టీలు బలహీన వర్గాలని తమవైపు తిప్పుకోవడంలో సఫలమయ్యాయి. కానీ అన్ని పార్టీల్లో నాయకత్వం అగ్రవర్ణాలకే స్వంతమై, దళిత మేధావివర్గం పక్కవాద్యాలకే సరిపోయింది.దళిత వర్గాల్లో కాస్తో కూస్తో కనిపించే ఆర్థిక, సామాజిక ప్రగతి పట్టణాలకే పరిమితమయింది. గ్రామాల్లో వ్యవసాయం, సాంప్రదాయక వృత్తులపై ఆధారపడిన వారి జీవన విధానంలో హోదాలో మార్పు శూన్యమే. విద్య, ఉద్యోగం, సంపాదన, సమాన హోదా విద్యావంతులని పట్టణాలలో కట్టేస్తాయి. ఆస్తిపాస్తులున్న అగ్రవర్ణాల వారు కొంత వరకూ గ్రామాలతో సంబంధాలు నిలుపుకున్నా, ఏ ఆస్తులూ లేని దళిత మేధావి వర్గం గ్రామాలకి మరింత దూరమైంది. ఈనాటికీ పట్టణాలకీ, గ్రామాలకీ మధ్య జీవనసరళిలో వ్యత్యాసం బలహీన వర్గాల్లో మరింత ప్రస్ఫుటంగా కనిపిస్తుందన్నది నిజం.