ఫేమస్ బాలీవుడ్ సింగర్ కమ్ హీరో కిశోర్‌కుమార్ పక్కన కథానాయికగా నటించిన తెలుగమ్మాయి ఎవరో తెలుసా? క్లాసూ మాసూ, కామెడీ, సెంటిమెంట్ ఏదైనా చేయగల గ్లామరస్ యాక్ట్రెస్ గుర్తున్నారా?
సరే... ఇవన్నీ ఎందుకు... ‘పులుసు’ గుర్తుందా?
అరె.. ఆమెను ఎలా మర్చిపోతాం.
‘మా పల్లెలో గోపాలుడు’ సినిమా వచ్చి ఇప్పటికి 30 ఏళ్లయ్యింది.
అందులో ‘చేపల పులుసు’తో మగాళ్ళను పడేస్తూ వై. విజయ వేసిన వ్యాంప్ వేషం ఇప్పటికీ ఆమెకో బ్రాండ్ ఇమేజ్.
ఓ పాత్ర పేరుతో ఓ ఆర్టిస్టు ఇన్నేళ్లు గుర్తుండిపోవడమంటే చాలా లక్కీ. హీరోయిన్‌గా ఎదగాల్సిన ఆమెకేరక్టర్ ఆర్టిస్టుగా స్థిరపడిపోయారు.
అసలేం జరిగింది?
ఫుల్ డీటైల్స్ వై. విజయనే అడిగేద్దాం!
ఎన్నేళ్లయ్యిందండీ.. మిమ్మల్ని చూసి...
అవునవును. నన్ను కలిసిన చాలామంది ఇదే మాట అంటుంటారు. అందరికీ దూరంగా ఉండాలని నాకూ లేదు. అంతేకాదు, సినిమాలు కూడా చేయాలనే ఉంది. మంచి అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను. హెల్త్ బాగున్నంత కాలం యాక్టింగ్ మానే ఉద్దేశం లేదు.
ప్రస్తుతం ఏం చేస్తున్నారు?
వృత్తిపరంగా ఏమీ లేదు. కానీ, వ్యక్తిగతంగా మాత్రం బిజీగా ఉన్నాను. ఈ మధ్యనే అమ్మమ్మగా ప్రమోషన్ వచ్చింది. నా ఒక్కగానొక్క కూతురు అనూష్యకు కొడుకు పుట్టాడు. ఆ హడావిడిలో ఉన్నాను. వాడి ఆలనా పాలనా చూసుకోవడంతో టైమ్ అస్సలు ఉండడం లేదు.
మీ అమ్మాయిని హీరోయిన్ చేయాలనుకోలేదా?
తనకు ఇంట్రస్ట్ ఉండుంటే కచ్చితంగా చేసేవాళ్లం కానీ, బాగా చదువుకుని మంచి ఉద్యోగంలో స్థిరపడాలనుకుంది, స్థిరపడింది.
మీ శ్రీవారి గురించి చెప్పండి. మీ ఇద్దరిదీ ప్రేమ వివాహమా?
మావారి పేరు అమలనాథన్. మాది పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహంలాంటిదన్నమాట. ఆయన మా ఫ్యామిలీకి ముందునుంచీ తెలుసు. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టమని తెలుసుకున్న మా పెద్దలు మా పెళ్లి కుదిర్చేశారు. 1985 జనవరి 27న మా పెళ్లయ్యింది. ఆయన కాలేజ్ కరస్పాండెంట్‌గా పని చేసేవారు. రిటైరయ్యాక వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు.
యాక్టింగ్ విషయంలో మీవారి నుంచి అభ్యంతరాలేవీ ఎదురు కాలేదా?
అస్సల్లేదు. నటన వేరు, జీవితం వేరనే సంగతి ఆయనకు తెలుసు.
ఇప్పటికీ మీపై ‘పులుసు’ బ్రాండ్ పోలేదు...
అవును. ‘మా పల్లెలో గోపాలుడు’ సినిమాలోని ఆ పాత్ర నా జీవితాన్ని మలుపు తిప్పింది. సరిగ్గా ఆ టైమ్‌లోనే నాకు పెళ్లి కుదిరింది. ఆయనకు నా పాత్ర గురించి చెప్పి ఓకే అన్నాకనే నేను ఓకే చెప్పాను. ఇప్పటికీ నన్ను చాలామంది ‘పులుసు’ అనే పిలుస్తుంటారు. ఓ పాత్ర పేరుతో గుర్తున్నందుకు ఆనందమే కానీ, వాటిని మా నిజజీవితానికి ఆపాదించినప్పుడే బాధగా, ఇబ్బందిగా ఉంటుంది.
కరెక్టే.. మీ మీద ఉన్న ‘వ్యాంప్’ ముద్ర కారణంగా మీ గురించి వేరే రకంగానే అనుకునే అవకాశం ఉంది...
అది తప్పంటాను. ఎందుకంటే, సినిమా కోసం మేం ఏం చేసినా అది నటనే అవుతుంది. వ్యాంప్ పాత్రలు చేస్తే.. నిజంగా కూడా అలానే ఉంటామనుకుంటే పొరపాటు! నా జీవితం, జీవన విధానం నా సహనటీనటులకు బాగా తెలుసు. కానీ, ప్రేక్షకులకు తెలియదు కాబట్టి, వాళ్లు వేరేలా అనుకుంటారు. అందుకే అంటున్నా... నటీనటులు చేసే పాత్రలను బట్టి వారిని అంచనా వేయొద్దు.
వాస్తవానికి హీరోయిన్‌కి ఉండాల్సిన అందచందాలు మీకున్నప్పటికీ ఎందుకు రాణించలేదంటారు? ఎవరూ మిమ్మల్ని తొక్కయ్యలేదుగా?
లేదు, ఈ విషయంలో ఎవరినీ నిందించాల్సిన అవసరంలేదు. నాకు మొదట్లో సినిమాలంటే ఆసక్తి ఉండేది కాదు. అనుకోకుండా అవకాశం రావడంతో వచ్చేశాను. హీరోయిన్‌గానే చేయాలనే పట్టుదల ఉండేది కాదు. ఒకవేళ అది బలంగా ఉండి ఉంటే, అందుకు తగ్గట్టుగా ప్లాన్ చేసుకునేదాన్నేమో! ఆ యావ లేకపోవడంతో, వచ్చిన ప్రతి పాత్ర చేశాను. దాంతో ముందు హీరోయిన్‌గా తీసుకున్నవాళ్లు, తర్వాత కేరక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా తీసుకోవడం మొదలుపెట్టారు.
బరువు పెరగడమూ మైనస్ అనొచ్చా?
మొదట్లో సన్నగానే ఉండేదాన్ని. పాప పుట్టిన తర్వాత బరువు పెరిగాను. బొద్దుగా ఉండటం మా ఫ్యామిలీ జీన్స్‌లోనే ఉంది. మా అమ్మ బొద్దుగానే ఉండేది.
అసలు మీకు మొదటి అవకాశం ఎలా వచ్చింది?
మద్రాసులో వెంపటి చినసత్యంగారి దగ్గర డాన్స్ నేర్చుకునేదాన్ని. ‘నిండు హృదయాలు’ అనే సినిమాలో అడుక్కుంటూ, డాన్స్ చేసే కేరక్టర్ ఒకటి ఉందని, డాన్స్ తెలిసినవాళ్లు కావాలని మా డాన్స్ స్కూల్‌కి వచ్చారు ఆ చిత్ర దర్శక, నిర్మాతలు. అక్కడ నన్ను ఎంపిక చేశారు. ఆ సినిమాలో ఎన్టీఆర్, జమున హీరో హీరోయిన్లు!
ఆ తర్వాత ‘శ్రీకృష్ణ సత్య’లో మీకు ఎన్టీఆర్ సరసన నటించే అవకాశం వచ్చినప్పుడు ఎలా అనిపించింది?
వాస్తవానికి డాన్స్ స్కూల్‌లో పురందేశ్వరి, నేను స్నేహితులం. అందుకని, నాకు ఎన్టీఆర్‌గారి కుటుంబంతో ముందే పరిచయం ఉంది. ‘నిండు హృదయాలు’ తర్వాత ‘డబ్బుకు లోకం దాసోహం’ సినిమాలో ఎన్టీఆర్‌గారికి చెల్లెలిగా చేశా. ఆ తర్వాత ఆయన చేసిన ‘శ్రీకృష్ణ సత్య’లో జాంబవతి పాత్ర చేశా. ఆ పాత్ర ఒప్పుకున్న తర్వాత, ఓరోజు ఎన్టీఆర్‌గారు ‘అమ్మాయి.. నా పక్కన మరీ చిన్నపిల్లలా ఉంటావు. కాస్తంత బరువు పెరుగు’ అన్నారు. దాంతో నెయ్యి, పండ్లు తిని, ఐదు కిలోలు బరువు పెరిగాను.
మరి.. హీరోయిన్‌గా ఎప్పుడు అవకాశం వచ్చింది?
‘తల్లిదండ్రులు’ సినిమాకి పదహారేళ్లమ్మాయి కావాలంటూ ఓ పేపర్ యాడ్ ఇచ్చారు. దాదాపు రెండువేల ఫొటోలు వచ్చాయట! మా డాన్స్ స్కూల్‌కి కూడా ఆ చిత్ర నిర్మాత వచ్చారు. నాకప్పుడు పద్నాలుగేళ్లుంటాయి. ఆ రెండువేల ఫొటోలను కూడా పరిశీలించిన తర్వాత, నేను ఆ పాత్రకి కరెక్ట్ అని తీసుకున్నారు. అందులో శోభన్‌బాబుగారు హీరో.
మరి తమిళ సినిమాలలో అవకాశం ఎలా వచ్చింది?
1975లో తొలి నృత్యప్రదర్శన ఇచ్చాక, మా ఊరు (కడప) వెళ్లిపోదానుకున్నాను. కానీ, కె.బాలచందర్‌గారు ‘మన్మథలీలై’ సినిమాకి అడిగారు. కమల్‌హాసన్ హీరో. మంచి అవకాశం కదా అని చేశాను. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో వరుసగా అవకాశాలు రావడం మొదలెట్టాయి. శివాజీగణేశన్‌గారు, రజనీకాంత్‌గారు.. ఇలా ప్రముఖ హీరోల సరసన సినిమాలు చేశాను. హీరోయిన్‌గా, కేరెక్టర్ ఆర్టిస్ట్‌గా ఒక్క తమిళంలోనే 300 సినిమాలు చేశాను. హిందీలోనూ నటించా.
కిశోర్ కుమార్ బాలీవుడ్‌లో ఫేమస్. ఆయన సరసన ‘చల్తీ కా నామ్ జిందగీ’లో ఎలా అవకాశం వచ్చింది?
ఆ చిత్రంలో కథానాయిక తమిళమ్మాయి. అందుకని కిశోర్‌కుమార్‌గారు హీరోయిన్‌ని సెలక్ట్ చేయడానికి మద్రాసు వచ్చారు. అప్పటికి నేను బాలచందర్‌గారి సినిమాల్లో యాక్ట్ చేసి, బాగా పాపులర్ అయ్యాను. దాంతో, మేనేజర్ ద్వారా సంప్రదించారు. తర్వాత కిశోర్‌కుమార్‌గారు మా ఇంటికొచ్చి, నన్ను ఎంపిక చేశారు. అలాగే ‘మిస్ పమేలా’ అనే ఇంగ్లిష్ సినిమాలోనూ యాక్ట్ చేశాను.
తమిళంలో బిజీ అవ్వడంవల్లే కొన్నేళ్లు తెలుగుకు దూరమయ్యారేమో?
1976 నుంచి 1984 వరకు ఒక్క తెలుగు సినిమా కూడా చేయలేదు. తమిళంలో నేను చేసిన భారతీరాజాగారి ‘మన్‌వాసనై’ తెలుగులో ‘మంగమ్మగారి మనవడు’గా రీమేక్ అయ్యింది. ‘మన్‌వాసనై’లో నాది వ్యాంప్ తరహా పాత్ర. భారతీరాజాగారు అడిగినప్పుడు సంశయించాను. కానీ, పాత్రను పాత్రగా చూడమని ఆయన అనడంతో చేశా. ఆ పాత్రకు మంచి పేరు రావడంతో, ‘మంగమ్మగారి మనవడు’కి కూడా అడిగారు. కోడి రామకృష్ణగారి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందిన విషయం తెలిసిందే. ఇందులో నేను చేసినది వ్యాంప్ తరహా పాత్రే అయినా.. జుగుప్సాకరంగా ఉండదు.
ఆ పాత్ర తర్వాత ఏ దర్శకులైనా ‘గ్లామరస్’గా కనిపించాలని ఒత్తిడి చేసిన సందర్భాలున్నాయా?
నా అదృష్టమో ఏమో కానీ నాకలాంటి పరిస్థితులు ఎదురు కాలేదు. గ్లామరస్ రోల్ అనుకోండి. ‘స్లీవ్‌లెస్ జాకెట్ వేసుకోవాలి’ అని చెప్పేవారు. అంతకు మించి ఏ ఒత్తిడీ చేయలేదు.
అత్త పాత్రలు చేయడం వల్ల మీ మీద ‘గయ్యాళి’ ముద్ర కూడా ఉంది!
ఈ మాట నాతో చాలామంది అన్నారు. మామూలుగా ఎక్కడికైనా వెళ్లినప్పుడు, ఎవరైనా పలకరిస్తుంటారు కదా. అప్పుడు నా మాట తీరు చూసి, ‘ఇంత సాఫ్ట్‌గా మాట్లాడుతున్నారు. కానీ, మిమ్మల్ని గయ్యాళి అనుకున్నాం’ అనేవాళ్లు. బయటి ప్రపంచంలో సినిమా తారల గురించి ఏవేవో అనుకుంటారు. కానీ, వాళ్లతో మాట్లాడినప్పుడే వాళ్లేంటో తెలుస్తుంది.
సినిమా పరిశ్రమ ఇక్కడికొచ్చిన తర్వాత కూడా మీరు మద్రాసు నుంచి షిఫ్ట్ అవ్వకపోవడానికి కారణం?
అప్పుడు నేను రాలేని పరిస్థితి. ఎందుకంటే, మా అమ్మాయి మద్రాసులో చదువుకుంటోంది. మా ఆయన వ్యాపారం తంజావూరులో. అలా కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వల్ల హైదరాబాద్‌కు మారలేకపోయాం.
మరి.. మీ ఆర్థిక పరిస్థితి సంగతేంటి?
వై. విజయ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుందేమో? అని కొంతమంది సందేహిస్తుంటారు. కానీ, నేను ఫైనాన్షియల్‌గా మంచి స్థితిలో ఉన్నాను. అప్పట్లో కొంతమంది తారలు ఆర్థికంగా సరిగ్గా ప్లాన్ చేసుకోకపోవడంవల్ల, ఇబ్బందులపాలైన సంగతి తెలిసిందే. మనం అలా కాకూడదని నేను, నా భర్త అనుకున్నాం. సినిమాలు శాశ్వతం కాదు. బిజినెస్ కూడా అంతే. అందుకే, బాగా సంపాదిస్తున్నప్పుడే భవిష్యత్తు గురించి ప్లాన్ చేస్తే మంచిదనుకున్నాం. కల్యాణ మండపం, ఓ కాంప్లెక్స్ కట్టాం. వాటి ద్వారా మంచి ఆదాయమే వస్తోంది.
మీ వారు ఏం వ్యాపారం చేసేవారు?
మాకు పాప పుట్టిన తర్వాత నేను సినిమాల్లో బాగా బిజీ అయ్యాను. మా పాపను బయటివాళ్లు పెంచడం మాకిష్టం లేదు. అందుకని, మావారు వాలంటరీ రిటైర్‌మెంట్ తీసుకున్నారు. ఆ తర్వాత ఇండియన్ ఆయిల్‌లో డీలర్‌షిప్ తీసుకున్నారు. కన్‌స్ట్రక్షన్ బిజినెస్ కూడా చేశారు.
మీ అల్లుడు సినిమా పరిశ్రమకు చెందినవారేనా?
కాదు. రాయ్ ఆంటోని (అల్లుడి పేరు) యూఎస్‌లో సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌లో ఉన్నారు. అమ్మాయి, అల్లుడు అక్కడే ఉంటారు. ఈ మధ్య బాబు పుట్టాడు కాబట్టి, ప్రస్తుతం ఇక్కడకి వచ్చింది. వచ్చే నెల అమెరికా వెళ్లిపోతుంది. మేం చెన్నయ్‌లోని మహాలింగపురంలో ఉంటాం.
సో.. హ్యాపీ లైఫ్ అన్నమాట?
కచ్చితంగా! నా జీవితం మొత్తం ఆల్‌మోస్ట్ హ్యాపీగానే గడిచింది! జీవితంపట్ల ఎలాంటి నిరాశా నిస్పృహలు, పెద్దగా ఆశలు లేవు. అయితే త్వరలో తీరిక దొరకనుంది కాబట్టి మంచి పాత్రలు వస్తే చేయాలని ఉంది!
- డి.జి. భవాని
మీ కుటుంబ నేపథ్యం?
మాది కడప. మా నాన్నగారు కో-ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీలో డిస్ట్రిక్ట్ మేనేజర్‌గా చేసేవారు. మాది అప్పర్ మిడిల్ క్లాస్ అనొచ్చు. అమ్మానాన్నలకు మేం పది మంది. ఆరుగురు ఆడపిల్లలు, నలుగురు మగపిల్లలు. నేను ఐదోదాన్ని. నా సిస్టర్, బ్రదర్స్ అందరూ చక్కగా సెటిలయ్యారు. వై.రాజా అని నా బ్రదర్ టీవీ సీరియల్స్‌లో నటిస్తున్నారు. ఈ రంగంలో ఉన్నది నేను, నా బ్రదరే!
‘పులుసు’ పేరుతెచ్చింది కానీ...
Published Sat, Feb 1 2014 11:33 PM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM
Advertisement
Advertisement