ఆ అందగత్తె చివరి రోజులు... | heroine madhubala last days | Sakshi
Sakshi News home page

ఆ అందగత్తె చివరి రోజులు...

Published Sun, Aug 23 2015 10:45 PM | Last Updated on Wed, Aug 29 2018 8:24 PM

ఆ అందగత్తె చివరి రోజులు... - Sakshi

ఆ అందగత్తె చివరి రోజులు...

లాస్ట్ డేస్ / మధుబాల
 
సావిత్రి కొంచెం అదృష్టవంతురాలు. కనీసం 46 ఏళ్ల వరకైనా జీవించింది. కాని మధుబాల అంత ఆయువు చూడలేదు. 36 ఏళ్లకే (1969) కన్ను మూసింది. కిశోర్ కుమార్‌ను పెళ్లి చేసుకునే సమయానికే ఆమెకు గుండె జబ్బు ఉందని తెలుసు. గుండెలో రంధ్రం ఉండటం వల్ల     ఆ కాలంలో దానికి వైద్యం లేకపోవడం వల్ల ఆమె వైవాహిక జీవితం అంతంత మాత్రమే అని తెలిసినా కిశోర్‌కుమార్ ఆమెను చేసుకున్నాడు. ఆమె కిశోర్‌ను పెళ్లాడింది. ఇద్దరికీ కారణాలు ఉన్నాయి. కిశోర్ అప్పటికే తన మొదటి భార్య రుమాతో విడాకులు తీసుకున్నాడు. మధుబాల తన బాయ్‌ఫ్రెండ్ దిలీప్ కుమార్‌తో తెగదెంపులు చేసుకుంది. వీరి ప్రేమకథకు మధుబాల తండ్రి అతావుల్లా ఖాన్ విలన్‌గా మారాడు. అతడిది పాకిస్తాన్. చాలా కష్టాలు పడి ముంబైకు చేరుకున్నాడు. పేదరికం వల్ల పుట్టిన నలుగురు పిల్లలు పోయారు. మధుబాల కాకుండా ఇంకా నలుగురు ఆడపిల్లలు ఉన్నారు. పోషించే ఆధారం లేదు. మధుబాల స్టార్‌డమ్‌కు చేరుకున్నాక ఆమెకు అతడు కంచెలాగా మారాడు. మధుబాల మనసు దిలీప్ కుమార్ మీద ఉంది. దిలీప్ కుమార్‌కు మధుబాల అంటే ప్రేమ ఉంది. కాని ఈ లోపునే ఒక తగాదా వచ్చింది.

 బి.ఆర్.చోప్రా తన దర్శకత్వంలో దిలీప్ కుమార్, మధుబాలను పెట్టి ‘నయాదౌర్’ (1957) సినిమా తీయాలనుకున్నాడు. కథ రీత్యా అది ఔట్ డోర్‌లో తీయాలి. కాని ఇది దిలీప్‌ను మధుబాలను ఏకం చేయడానికి బి.ఆర్.చోప్రా పన్నిన పన్నాగం అని అతావుల్లా అనుమానించాడు. కొంత షూటింగ్ అయ్యాక మధుబాలను ఔట్‌డోర్ పంపడానికి నిరాకరించాడు. బి.ఆర్.చోప్రాకు నష్టం జరిగింది. కేసు కోర్టుకెక్కింది. దిలీప్ కుమార్ తన ప్రియురాలైన మధుబాల పక్షం వహించకుండా ఆమెదే తప్పు అని ఆమె తండ్రి నష్టపరిహారం చెల్లించాలని సాక్ష్యం చెప్పాడు. దీంతో అగాథం పెరిగిపోయింది. అయితే ఇంత జరిగినా పర్వాలేదు నా తండ్రిని క్షమాపణ అడుగు పెళ్లి చేసుకుందాం అని మధుబాల అడిగినట్టుగా కథనాలు ఉన్నాయి. కాని దిలీప్ కుమార్ అడగలేదు. దాంతో వాళ్లు విడిపోయారు.     ఆ విషాదంలో ఉన్న మధుబాల అప్పటికే గాయకుడిగా, నటుడిగా చలాకీగా ఉన్న కిశోర్ కుమార్‌లో తోడును వెతుక్కుంది. ఇందుకు వీళ్లిద్దరూ కలిసి నటించిన ‘చల్తీకా నామ్ గాడీ’ (1958) సహకరించింది. ఈ సినిమాలో కిశోర్ సరసన మధుబాల నటించిన ‘హాల్ కైసా హై జనాబ్ కా’, ‘ఏక్ లడ్‌కీ భీగీ భాగీసీ’ వంటి పాటలు చాలా హిట్.

 అయితే వాళ్ల కాపురం అంత సజావుగా సాగలేదు. కిశోర్ కుమార్ గాయకుడిగా బిజీ అయ్యాడు. అంతే కాకుండా ఆమె అనారోగ్యం వల్ల వైవాహిక జీవితంలోగాని సంతానం కలగడంలోగాని ఒక అసంతృప్తి అతణ్ణి వెంటాడింది. అతడు ఆమెను నిర్లక్ష్యం చేశాడని కొందరంటారు. కంటికి రెప్పలా చూసుకున్నాడని మరికొందరంటారు. కాని మధుబాల పెళ్లయిన నాటి నుంచే (1960) మంచానికి అతుక్కుపోయిందని చెప్పాలి. ఆమె శరీరంలో రక్తం ఎక్కువగా వృద్ధి అయ్యేది. అది ముక్కు గుండా నోటి గుండా బయటకు రాకుండా డాక్టరు తరచూ వచ్చి రక్తం తీయాల్సి వచ్చేది. అలాగే ఆమెకు శ్వాస సంబంధమైన సమస్య తలెత్తింది. ప్రతి ఆరు గంటలకూ ఆక్సిజన్ పెట్టకపోతే ఊపిరి అందక బాధపడేది. కిశోర్ కుమార్ లండన్‌లో వైద్యం చేయిద్దామని ప్రయత్నించాడు. లాభించలేదు.

 మధుబాల దేశంలోనే అత్యద్భుతమైన అందమైన నటిగా పొందిన గుర్తింపు సామాన్యమైనది కాదు. ‘మహల్’, ‘మిస్టర్ అండ్ మిసెస్ 55’, ‘బర్‌సాత్ కీ రాత్’, ‘హౌరా బ్రిడ్జ్’ వంటి సినిమాలు ఆమెను లక్షాలాది మంది ఆరాధ్య దేవతగా మార్చాయి. హాలీవుడ్‌లోలా దేశంలో తొలి పోస్టర్ గర్ల్‌గా మధుబాల మారింది. ఇప్పటికీ ఆమె పోస్టర్లు విస్తృతంగా అమ్ముడు పోతుంటాయి. వీటన్నింటికీ మించి ‘మొఘల్- ఏ- ఆజమ్’ (1960)లో ఆమె పోషించిన అనార్కలి పాత్ర ఆమె ఉత్త అందాల బొమ్మ కాదనీ నటన తెలిసిన గొప్ప నటి అని నిరూపించింది. విశేషం ఏమిటంటే ఈ సినిమా నిర్మాణ సమయంలో దిలీప్ కుమార్‌కు మధుబాలకు మాటల్లేవు. కాని తెర మీద వారి వ్యక్తిగత స్పర్థ కనిపించకుండా అమర ప్రేమికులుగా మెప్పించడంలో ఇద్దరూ సఫలమయ్యారు.

 ఇంత పేరూ డబ్బూ ఉన్నా అనారోగ్యం ఆమెను పూర్తిగా ఓడించింది. చివరి రోజుల్లో ఆమె ఎంతో నైరాశ్యంలోకి వెళ్లిపోయింది. ఆమెకు డైరీ రాసే అలవాటు ఉండేది. అందులో ఆమె ఎన్నో వ్యక్తిగత విషయాలు రాసుకునేది. చనిపోయాక ఆమెను ఆమె డైరీతో పాటు ముంబై శాంటాక్రజ్ ముస్లిం శ్మశానవాటికలో ఖననం చేశారు. కుటుంబం ఆమె సమాధిని పాలరాయితో కట్టించింది. కాని 2010లో దానిని స్థలాభావం రీత్యా కూల్చేశారు.

 మధుబాల ఫిబ్రవరి 14న జన్మించింది. కోట్లాది మంది యువకులకు కలల రాకుమారిగా వర్థిల్లింది. తరాలు మారినా ఇప్పటికీ ఆమె ప్రేమదేవతగానే ఉంది. ప్యార్ కియాతో డర్‌నా క్యా అని యువతరానికి ధైర్యం చెబుతూనే ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement