కోపముంటే నన్ను చంపాల్సింది...నా పిల్లలేం పాపం చేశారు? | ICFAI Professor Guru Prasad wife Suhasini Interview | Sakshi
Sakshi News home page

కోపముంటే నన్ను చంపాల్సింది...నా పిల్లలేం పాపం చేశారు?

Published Sun, Oct 12 2014 11:16 PM | Last Updated on Wed, Oct 3 2018 6:52 PM

విఠల్ విరించి, నంద విహారి - Sakshi

విఠల్ విరించి, నంద విహారి

ఏ బంధాన్నైనా తెంచుకోవడం సులభం... కలుపుకోవడం కష్టం. అది తెలిసే ఏ భార్యా తన వైవాహిక బంధాన్ని తెంచుకోవాలని అనుకోదు. పిల్లల బాగు కోసమో... సమాజం ఏమంటుందో అన్న భయానికో ఆ అడుగు వేయదు. కానీ భర్త మృగంగా మారి హింసిస్తున్నప్పుడు కూడా అలా తలొగ్గి ఉండటం ఎంతవరకూ సబబు? జీవితమంతా కాపాడతాడనుకున్న మనిషి, జీవితాన్నే కాలరాస్తున్నప్పుడు... కీడెంచి మేలెంచకుండా మౌనంగా ఉండిపోవడం ఎంతవరకూ సమంజసం? కాస్త కష్టమైనా ముందే ఓ కఠిన నిర్ణయం తీసేసుకుంటే అనర్థాలు ఆగవా? మహిళల్ని సంరక్షించడానికే 498 ఎ చట్టాన్ని చేశానంటోంది ప్రభుత్వం.

మహిళలు దాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, ఆ చట్టాన్ని రద్దు చేయమని అంటోంది పురుష సమాజంలోని ఓ వర్గం. అలా చేయడం ఎంతవరకూ సమర్థనీయం? ఇప్పుడివన్నీ మాట్లాడ్డానికి కారణం సుహాసిని. ఈ ప్రశ్నలన్నీ తలెత్తడానికి కారణం... ఆమె జీవితంలో సంభవించిన పెను విషాదం! సుహాసిని తన బిడ్డల కోసం నరకం లాంటి జీవితాన్ని స్తబ్దుగా నెట్టుకొచ్చింది. చివరికి ఆ స్తబ్దతే ఆమె జీవితంలో మిగిలింది. కట్టుకున్న భర్తే కాలయుముడై తన కన్నబిడ్డల ప్రాణాల్ని హరిస్తే... కన్నీరు మున్నీరవుతున్న ఆ కన్నతల్లితో ‘సాక్షి’ జరిపిన సంభాషణ ఇది!


ఎలా ఉన్నారు సుహాసినిగారూ?

సుహాసిని: కళ్లు మూసినా, తెరిచినా పిల్లలే గుర్తొస్తున్నారు. వాళ్లు నా పక్కనే ఉండి మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తోంది. పోయినవారం... సరిగ్గా ఇదే రోజు (ఇంటర్వ్యూ చేసిన రోజు)... నా పిల్లల్ని నేను చూసుకున్న చివరి రోజు...
 
అసలా రోజు ఏం జరిగిందో చెబుతారా?

ఎప్పటిలానే వచ్చాడు. పిల్లల్ని తీసుకెళ్లాడు. కొన్ని గంటల తర్వాత మళ్లీ ఒక్కడే వచ్చాడు. పిల్లలేరని అడిగితే, గుడిలో భోంచేస్తున్నారని చెప్పాడు. నన్నూ రమ్మన్నాడు. నేను రాను, పిల్లల్ని తీసుకు రమ్మని చెప్పాను. వెళ్లిపోయాడు. కానీ ఎంతసేపటికీ తీసుకురాలేదు. ఎన్ని మెసేజులు ఇచ్చినా రిప్లై లేదు. నాలుగున్నర వరకూ చూసి ఫోన్ చేశాను. పోలీసులు లిఫ్ట్ చేశారు. తను రైలుకింద పడి సూసైడ్ చేసుకున్నాడని చెప్పారు. షాకయ్యాను. పిల్లలేమైపోయారో తెలియలేదు. నన్ను ఏడిపించడానికి ఎక్కడైనా దాచిపెట్టి ఉంటాడనుకున్నాను. కానీ తన ఫోన్‌లో ఉన్న మెసేజ్‌ని చూశాకగానీ అర్థం కాలేదు... జరిగిన దారుణం!
     
పిల్లల్ని తీసుకెళ్లేపు్పుడు తనలో ఏ మార్పూ కన్పించలేదా?

లేదు. ఎప్పటిలానే వచ్చాడు, తీసుకెళ్లాడు. ఇంత దారుణానికి ఒడిగడతాడనుకోలేదు. పిల్లలు సరదా పడ్డారని ఆ రోజు బ్యాంగ్‌బ్యాంగ్ సినిమాకి తీసుకెళ్తానన్నాను. దాంతో వెళ్లడానికి వాళ్లిష్టపడలేదు. వెళ్లిరండి, సినిమాకి సాయంత్రం తీసుకెళ్తాలే అని సర్దిచెప్పి పంపించాను. (కన్నీళ్లతో) కానీ వాళ్లు మళ్లీ రారని, నేనెప్పటికీ వాళ్లను చూడలేనని అనుకోలేదు.
 
ఆయన ఎందుకిలాంటి నిర్ణయం తీసుకున్నారంటారు?

నేను తనకి దూరంగా వచ్చేశానని, తన దగ్గరకు వెళ్లడం లేదని  నామీద కక్ష కట్టాడు. ఆ కసితోనే వాళ్లను పొట్టనబెట్టుకున్నాడు. వాళ్ల అమాయక ముఖాలు చూసయినా జాలి వేయలేదతనికి!
      
తనలో హింసా ప్రవృత్తి ముందెప్పుడూ కనిపించలేదా?


తను శాడిస్టని తెలుసు. కానీ పిల్లల్ని చంపుకునేంత కసాయివాడని మాత్రం తెలియలేదు. పెళ్లయిన నాటి నుంచీ నన్ను చిత్ర హింసలు పెట్టాడు. ఎంతసేపూ డబ్బు డబ్బు డబ్బు. సంపాదించినదంతా తన చేతిలోనే పెట్టేదాన్ని. నా డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, చెక్ బుక్కులు... అన్నీ తన దగ్గరే ఉండేవి. వారానికింత అని పాకెట్ మనీ ఇచ్చేవాడు. ఫోన్ రీచార్జ్ కూడా తనే చేసేవాడు. చివరికి నా సంతకాలు ఫోర్జరీ కూడా చేసేవాడు. అడిగితే చిత్రవధ చేసేవాడు. తొమ్మిదేళ్లు నరకం చూశాను.
     
ఇంట్లోవాళ్లకు చెప్పలేదా? చెప్పినా సర్దుకుపొమ్మన్నారా?

వాళ్లెప్పుడూ అలా చెప్పలేదు. నేనే సర్దుకుపోవడానికి ట్రై చేసేదాన్ని. మావాళ్లు మాట్లాడినప్పుడు బాగా చూసుకుంటాననేవాడు. వాళ్లు వెళ్లాక మళ్లీ మామూలే. అతని తరఫు వాళ్లయితే వాళ్ల ఎదురుగానే నన్ను కొడుతున్నా అడ్డుపడేవారు కాదు. మా అత్తగారుమాతోనే ఉండేది. నన్ను చిత్రహింస పెడుతున్నా ఏనాడూ కొడుకుని వారించలేదావిడ. ఇవాళ అతడు నా పిల్లల్ని పొట్టనబెట్టుకుంటే వాళ్లలో ఏ ఒక్కరూ ఫోన్ చేసి పలకరించలేదంటే ఏమనాలి!
     
మీరొక ఇండిపెండెంట్ ఉమన్ అయివుండీ, పిల్లల్ని పెంచుకోగల స్తోమత ఉండీ ఆ హింస ఎందుకు భరించారు? ఇన్ని సంవత్సరాల తర్వాత కేసు ఎందుకు పెట్టారు?

విడిపోతే ఎక్కువ సంపాదిస్తోందని అహంభావం అని అందరూ అనుకుంటారేమోనని భయం. దానికితోడు నా పిల్లలకు తండ్రిని దూరం చేయకూడదని కూడా అనుకున్నాను. కానీ తను పిల్లల్ని కూడా హింసించడం మొదలుపెట్టాడు. టీవీ చూడనిచ్చేవాడు కాదు. ఆరోగ్యానికి మంచిది కాదు అంటూ ఏదీ తిననిచ్చేవాడు కాదు. రోజూ పప్పన్నమే. తినకపోతే కొట్టేవాడు. వాతలు పెట్టేవాడు. తట్టుకోలేక పోయాను. పైగా అతణ్ని చూసి వారిలోనూ అలాంటి ప్రవృత్తి పెరుగుతుందేమోనని భయపడ్డాను. అందుకే వచ్చేశాను. అయినా వదలకుండా వేధిస్తుంటే కేసు పెట్టక తప్పలేదు.
     
కానీ అది తప్పుడు కేసంటూ ఉత్తరాలు రాశాడు కదా?

తప్పుడు కేసు పెట్టేదాన్నే అయితే తొమ్మిదేళ్లు ఆ హింస భరించేదాన్ని కాదు. నేనెప్పుడూ కాపురాన్ని సరి చేసుకోవాలని, అతణ్ని మార్చుకోవాలనే చూశాను. ఇక భరించలేని పరిస్థితి వచ్చాక కేసు పెట్టాను. 498 ఎ చట్టాన్ని తీసేయమంటూ ఎవరెవరికో ఉత్తరాలు రాశాడు. కానీ ఆ చట్టం లేకపోతే నాలాంటి వాళ్ల పరిస్థితి ఏంటి! చూశారుగా తనెంత దారుణమైన  మనిషో!
     
కాల్ రికార్డ్స్ చూస్తే... తాను చనిపోతానని ముందే హింట్ ఇచ్చినట్టు తెలుస్తోంది కదా?


ఎప్పుడూ అలా బెదిరిస్తూనే ఉండేవాడు. నన్ను తన దారిలోకి తెచ్చుకోవడానికి అదొక అస్త్రం తనకి. అందుకే పట్టించుకోలేదు. అయినా ఆ రికార్డ్స్ ఇప్పటివి కావు. ఎప్పుడెప్పుడో మాట్లాడినవన్నీ రికార్డ్ చేసి, అన్నిటినీ అతికి మీడియా వాళ్లకు పంపించాడు. అందుకే అందులో నా మాటలేం సరిగ్గా ఉండవు. తను నన్ను బతిమాలుతున్న మాటలే ఉంటాయి. అవి కావాలని మాట్లాడి రికార్డ్ చేసుకున్నాడు, తాను మంచివాడినని నిరూపించుకోవడం కోసం. అందులో నిజమెంతో తెలుసుకోకుండా మీడియా ప్రసారం చేసేసింది.

ఆ కాల్ రికార్డ్‌లో... కాగితం మీద సంతకం పెట్టనని పదే పదే అన్నాడు కదా, ఏమిటా కాగితం?

తనకి నా మీదసలు ప్రేమే లేదు. నేను తన దగ్గరికి ఎందుకు వెళ్లను అని పంతం! అందుకే మా పెద్దవాళ్లు... నాకేదైనా అయితే తనదే బాధ్యత అని రాసిన కాగితం మీద సంతకం పెట్టమన్నారు. కానీ అతను పెట్టడని నాకు ముందే తెలుసు. ఎందుకంటే, హింసించడం అతడి తత్వం. అలా చేయకుండా అతడు ఉండలేడు.
     
మరి ఇన్ని తెలిసీ పిల్లల కస్టడీకి మీరు ఎందుకు ఒప్పుకున్నారు?

నేను ఒప్పుకోలేదు. అతను మంచివాడు కాదని మొత్తుకున్నాను. కానీ కోర్టు నా మాట వినలేదు. ఇప్పుడేమయ్యింది! నా పిల్లల్ని కోర్టు తెచ్చివ్వగలదా?!
     
ఒకవేళ కేసు పెట్టకుండా ఉన్నా.. అతడితోనే కలిసున్నా పిల్లలు దక్కివుండేవారని ఇప్పుడనిపిస్తోందా?

ఏది ఎందుకు జరిగిందో ఆలోచించే పరిస్థితుల్లో నేను లేను. నాకు నా పిల్లలు కావాలి. వాళ్లు లేని జీవితాన్ని నేను ఊహించలేకపోతున్నాను. వాళ్ల కోసం ఎన్నో భరించాను. వాళ్ల కోసమే బతికాను. ఇప్పుడు వాళ్లే లేకుండా పోయారు. ఇక నా జీవితానికి అర్థమేముంది? అతనికి అంతగా నామీద కోపముంటే నన్ను చంపాల్సింది. నా పిల్లల్నెందుకు చంపాలి? వాళ్లేం పాపం చేశారు?
 
సుహాసిని సంధించిన ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి గురుప్రసాద్ బతికి లేడు. పోనీ ఆ ప్రశ్నకు సమాధానం మన దగ్గరయినా ఉందా?! అభం శుభం తెలియనివాళ్లు. అమ్మానాన్నలు ఎందుకు గొడవ పడుతున్నారో కూడా అర్థం చేసుకోలేని పసివాళ్లు. అన్యాయంగా అసువులు బాశారు. విరించి, విహారిలే కాదు... తల్లిదండ్రుల సమస్యలకి, వారి మధ్య కోపతాపాలకి మధ్య జీవితాలను, ప్రాణాలను కోల్పోతున్న చిన్నారులు చాలామందే ఉన్నారు. తల్లి పసుపుతాడు బిడ్డలకు ఉరితాడు అవ్వడం న్యాయమా? తండ్రి పంతం పిల్లల ప్రాణాలు తీసే యమపాశమవ్వడం ధర్మమా? ఆలోచించండి!
 సంభాషణ: సమీర నేలపూడి
 
ఈ పరిస్థితిని ముందే అంచనా వేయవచ్చు!

ఒక వ్యక్తి మానసిక స్థితిని బట్టి, ప్రవర్తనను బట్టి జరగబోయే అనర్థాలను ముందుగానే అంచనా వేయవచ్చు. భర్త హింసిస్తున్నా సమాజం ఏమనుకుంటుందోనన్న భయంతోనో, తల్లిదండ్రులకు తెలిస్తే బాధపడతారన్న ఉద్దేశంతోనో మౌనంగా భరించే మహిళలు చాలామంది ఉన్నారు. అయితే అతడలా ప్రవర్తించడానికి కారణం వ్యక్తిత్వ లోపం కావచ్చు. ఏదైనా మానసిక వ్యాధి కావచ్చు. ఒక్కసారి వైద్యుడిని కలిసి భర్త ప్రవర్తన గురించి చెబితే, అతడికేదైనా మానసిక సమస్య ఉందా అన్నది వాళ్లు కనిపెడతారు. దానికి చికిత్స చేయిస్తే అతడు మంచిగా మారవచ్చు. ఇలాంటి ఘోరాలకు పాల్పడకపోవచ్చు. ఒకవేళ వారు ట్రీట్‌మెంట్‌కి ఒప్పుకోకపోతే, మెంటల్‌హెల్త్ యాక్ట్ (సెక్షన్ 23)ని ఆశ్రయించవచ్చు. దాని ప్రకారం... ఒక వ్యక్తిలో తనను తాను కానీ, ఇతరులను కానీ హింసించే లక్షణాలు ఉంటే అతడికి బలవంతంగా కూడా చికిత్స చేయించవచ్చు. కాబట్టి హింసాత్మక ప్రవృత్తి కనిపించగానే వైద్యుల సలహా తీసుకుంటే... ఇలాంటి ఘోరాలు జరగకుండా అడ్డుకునే అవకాశం దొరుకుతుంది.
 - డాక్టర్ శ్రీనివాస్ ఎస్.ఆర్.ఆర్.వై., సైకియాట్రిస్టు
 
చట్టాల్ని తప్పు పట్టకూడదు!

ఎంత నాణ్యమైన బియ్యంలోనైనా ఒకటో రెండో రాళ్లు ఉంటాయి. మంచి ముత్యాల్లో కూడా ఒకటి రెండు నకిలీవి తగులుతుంటాయి. అందుకని మొత్తాన్నీ పారేయలేం కదా! చట్టాలూ అంతే. అప్పటి పరిస్థితులను బట్టి, అంతవరకూ చూసిన కేసుల్ని బట్టి రూపొందుతాయి. వాటిని సద్వినియోగం చేసుకోవాలి. ఒకటో రెండో తప్పుడు కేసులు వచ్చాయని అసలు ఆ చట్టమే సరికాదంటే ఎలా? 498 ఎ అక్కడక్కడా దుర్వినియోగం అవుతోందన్నది నిజమే కావచ్చు. కానీ, కొందరలా చేశారని చట్టాన్నే లేకుండా చేస్తే నిజమైన బాధితుల పరిస్థితేం కావాలి! కాకపోతే మారుతున్న పరిస్థితులను బట్టి, మానసిక ప్రవృత్తులను బట్టి చట్టాల్లో మార్పులు జరగాలి. భర్త తనని వేధిస్తున్నాడని ఓ భార్య కేసు పెట్టినప్పుడు... అతడి ప్రవర్తన మీద నిఘా ఉంచాలి. ఆమె చెప్పింది నిజమని తేలితే ఆలస్యం చేయకుండా తీర్పు వెలువరించాలి. ఎందుకంటే ఆలస్యం జరిగేకొద్దీ మానసిక ఒత్తిడి పెరిగిపోతుంది. అది కొన్నిసార్లు హింసకు పాల్పడేలా ప్రేరేపిస్తుంది. ఇలాంటి సంఘటనలు జరగడానికి కారణమవుతుంది!
 - ఎస్.ప్రదీప్ కుమార్, న్యాయవాది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement