ఆయన చివరి ఆకాంక్షను ధిక్కరించాను...
నిన్ను నిన్నుగా ప్రేమించుటకు... అని పాట రాశారు శ్రీశ్రీ. ఆయనను ఆయనలాగే ప్రేమించి చివరి వరకూ తోడు నిలిచారు సరోజా శ్రీశ్రీ. ఆంధ్రుల అభిమాన కవి జీవితంలో భాగమయ్యి ఆయనను అతి దగ్గరగా గమనించే అదృష్టం ఆమెది. శ్రీశ్రీ 105వ జయంతి సందర్భంగా చెన్నైలో ఆమె సాక్షితో పంచుకున్న జ్ఞాపకాలు ఇవి....
నేను శ్రీశ్రీగారికి అసిస్టెంట్‌గా వచ్చి అర్ధాంగిగా సెటిల్ అయ్యాను. ఆయనను ‘గురు’ అని పిలిచేదాన్ని. ఆ మాటకు కోపం వచ్చేది. అయినా ఊరుకునేవారు. నేను శ్రీశ్రీగారితో 150 డబ్బింగ్ చిత్రాలకు పని చేశాను. మాటలు, పాటలు ఆయనే రాసినా డైలాగ్ డెరైక్టర్ యు.సరోజ అని టైటిల్స్‌లో వేసేవారు. రాసిన ప్రతిపాటా నాకు వినిపించేవారు. డబ్బింగ్ పాటల విషయంలో మాత్రం నేను సవరణలు చెప్పేదాన్ని. లిప్ మూమెంట్‌కి సరిపడాలి కదా. ఎక్కడకు వెళ్లినా వెంట తీసుకువెళ్లేవారు. కుళ్లు కాలవ దగ్గర నుంచి లండన్ దాకా ఆయన వెంట వెళ్లాను. ఆయన నా దారికి ఎప్పుడూ అడ్డు రాలేదు. మా చెల్లెలి భర్త రాజబాబు. అతనికి శ్రీశ్రీ గారంటే చెప్పరానంత ఇష్టం. శ్రీశ్రీగారు విదేశాలకు వెళ్లి వచ్చినప్పుడు పెద్ద పెద్ద బుట్టలతో పూలు తెచ్చి ఎంత హడావుడి చేసేవాడో.
సినీ పోరాటం : శ్రీశ్రీగారు మొదటి నుంచి సినీరంగంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చాలామంది ఆయనకు అవకాశాలు రాకుండా చూశారు. అయితే అన్నపూర్ణ, జగపతి, విశ్వశాంతి, పిఎపి, సురేష్ సంస్థలు అండగా నిలిచాయి. ఇవన్నీ మా సొంత సంస్థల కిందే లెక్క. ముఖ్యంగా కృష్ణగారి సోదరుడు జి. హనుమంతరావు మాకు చాలా కో ఆపరేటివ్‌గా ఉండేవారు. దుక్కిపాటి మధుసూదనరావుగారికి శ్రీశ్రీ గారంటే ప్రాణం. అయితే శ్రీశ్రీ గారి బలహీనతను ఆసరాగా తీసుకుని పాటలు రాయించుకున్న చాలామంది ఒక్క ఐదు రూపాయలు కూడా చేతికి ఇచ్చేవారు కాదు. ఆ సమయంలో నేను ఆయన పాటకు డబ్బులు ఇచ్చేవరకు పోరాటం చేశాను.
పిల్లలంటే ప్రాణం : ఆయనను ఒక తండ్రిగా వర్ణించడానికి మాటలు చాలవు. పిల్లలంతా ఆయన నెత్తి మీద తాండవం చేసినా చిరాకు వచ్చేది కాదు. ఆయన దగ్గర అంత చనువు వాళ్లకి. తండ్రిని ‘నువ్వు’ అని పిలవడం నాకు నచ్చేది కాదు. ఆయన మాత్రం ‘మీరు’ అని పిలిపించద్దు ‘నువ్వు’ అని పిలిస్తేనే చనువుగా అనిపిస్తుందనేవారు. పిల్లలకు నేనంటే భయం. ‘పిల్లల్ని అంత చదువులు చదివిస్తున్నావు. రేపు నేను వాళ్ల మీద ఆధారపడాలనా’ అనేవారు.
పసి బాలుడు : ఆయనకు భోజనం దగ్గర మూడే రకాలు ఉండాలి. వాటితో పాటు పక్కన ఉప్పు, ఆవకాయ ఉంటే చాలు. అయితే అన్నం వడ్డించాక కంచంలోకి చూస్తూ ‘సరోజా! ముందర ఏది తినాలి?’ అని ఆయన అడుగుతుంటే నాకు కళ్లలో నీళ్లు వచ్చేవి. ‘అయ్యో! ఈయనకు అన్నం తినడం కూడా రాదే. ఎంత అమాయకులు’ అనుకునేదాన్ని. బట్టలు ఎలా ఉంటే అలానే కట్టుకునేవారు. చిరిగిపోయాయని, పొట్టిగా ఉన్నాయని ఆలోచించేవారు కాదు. పైగా ‘నా బట్టలు ఎవడిక్కావాలి. నా కవిత్వం కావాలి కానీ’ అనేవారు. తల కింద పుస్తకాలు చుట్టూ పెన్నులు కాగితాలు పెట్టుకుని పడుకునేవారు.
ఇవీ సరదాలు... : చిల్లరంతా తీసి లెక్కపెట్టుకోవడం ఆయనకు సరదా. అంతా లెక్కపెట్టాక డిబ్బీలో వేసేవారు. శ్రీశ్రీ గారికి 733 నంబరంటే ఇష్టం. ఆయన ఫోన్ నంబర్‌లో చివరి మూడు సంఖ్యలు అవే. ఇప్పటికీ నేను చివరి మూడు సంఖ్యలు వాటినే తీసుకున్నాను (044 - 24939733). పప్పు అద్దిన చేకోడీలు ఆయనకు చాలా ఇష్టం. గులాబ్‌జామ్, మైసూర్‌పాక్, పులిహోర, సేమ్యాపాయసం, అల్లప్పచ్చడి, నువ్వు పచ్చడి కలిపి తినేవారు. ఆయనకు అద్దాలంటే చాలా ఇష్టం. పెద్ద పెద్ద అద్దాలు గోడకు రెండు వైపులా అమర్చి మధ్యలో కూర్చుని ఆనందించేవారు.
కవితాకన్య... : ఆరాధన చిత్రంలోని ‘నా హృదయంలో నిదురించే చెలి’ పాటలోని చెలి ఎవరు అని శ్రీశ్రీ గారిని ప్రశ్నిస్తే ఆయన చెప్పిన సమాధానం, ‘ఆ చెలి మరెవరో కాదు నా కవితాకన్య’ అన్నారు. శ్రీశ్రీ కోసం పోరాటం చేసిన ఏకైక వ్యక్తి అజంతా.
ఈ మాట అనలేదు... : ఆయన ఎన్నడూ ‘దేవుడు లేడు’ అనలేదు. ‘దేవుడు ఉంటే ప్రత్యక్షం అవ్వడు. అదొక శక్తి. ఆ శక్తి ఎవ్వరికీ కనిపించదు. నాకు ప్రజలే దేవుళ్లు, వీళ్ల కోసమే నా చరిత్ర, నా రచనలు. నీకు ఆకలి వేస్తే నీ నామాల దేవుడు అన్నం పెడతాడా’ అనేవారు.
పూర్తి చెకప్...: డా. పి. సత్యనారాయణ, డా.కృష్ణన్ అనే ఇద్దరు డాక్టర్లు ప్రతి సంవత్సరం శ్రీశ్రీ గారికి నఖశిఖ పర్యంతం చెకప్ చేసేవారు. శ్రీశ్రీగారు వారిని ఎందుకని ప్రశ్నించేవారు. అందుకు వారు, ‘ప్రపంచానికి మీరు కావాలి. మీకు మీరు కావాలి. మా కోసం మేం చేస్తున్నాం’ అన్నారు. అందరికీ శ్రీశ్రీ గారంటే అంత ప్రాణం.
మరణానంతర కాంక్ష... : ఆయన ఆసుపత్రిలో ఉన్నప్పుడు నేను దగ్గర ఉండి సేవలు చేస్తుంటే ‘తిండి తిప్పలు లేకుండా నాతో కూర్చున్నావు. పిల్లల్ని కూడా చూసుకోవట్లేదు’ అనేవారు. ‘ఎందుకలా భయపడతావు. గుండు పెట్టి పేల్చినా కూడా నేను చావను’ అన్నారు. ఎవరికైనా మరణం తప్పదు. ఆయన కూడా తనువు చాలించారు. శ్రీశ్రీగారి చివరి ఆకాంక్షను నేను ధిక్కరించాను. మరణించాక ఆయన శరీరాన్ని విశాఖపట్టణంలో ఆసుపత్రి వారికి ఇవ్వాలని శ్రీశ్రీగారి ఆకాంక్ష. కాని నేను ఆయన శరీరాన్ని ఇవ్వలేకపోయాను. మెదడు దగ్గర నుంచి ఒక్కో భాగాన్ని వాళ్లు కోసేస్తారనే వాస్తవాన్ని నేను తట్టుకోలేకపోయాను. పిల్లలు కూడా వారించారు. అలా ఆయన చివరి కోరికను నేను ధిక్కరించాను.
- డా. పురాణపండ వైజయంతి, సాక్షి, చెన్నై
ఏంటి నాయనా...
ఆయన చాలా మృదువైన మనిషి. నవ్వు చాలా బావుంటుంది. భలే నవ్వేవారు. ఆయన నవ్వుతుంటే చెవులు, బుగ్గలు, గుండె దగ్గర ఎర్రబడేది. అంతటి సుకుమారులు ఆయన. ఆయనకు బాగా కోపం వస్తే, ‘ఏంటి నాయనా’ అని గొణుక్కునే వారు.