నంబూద్రి కుటుంబాల వ్యధ - అగ్నిసాక్షి | Lalithambika antharjanam...Agnisakshi | Sakshi
Sakshi News home page

నంబూద్రి కుటుంబాల వ్యధ - అగ్నిసాక్షి

Published Sat, Apr 18 2015 12:41 AM | Last Updated on Sun, Sep 3 2017 12:25 AM

నంబూద్రి కుటుంబాల వ్యధ - అగ్నిసాక్షి

నంబూద్రి కుటుంబాల వ్యధ - అగ్నిసాక్షి

‘ఇంట్లో పెద్దవాళ్ళు పిచ్చి చిన్నమ్మల మీద గరిటెలు విసిరి గాయపరచడం నేను చూశాను. ఒక చేతిలో తాటాకు గొడుగు, ఇంకో చేతిలో పైన కప్పుకునే బట్టలను పట్టుకొని భర్త ఇంటికి పోయి, రాత్రిళ్ళు వాళ్ళు గొడవ పెట్టుకోవడం నేను చూశాను. పిల్లలు ‘మద పిచ్చిది’ అని రాళ్ళు విసరడం చూశాను. మైల పడిపోతామనే సందేహంతో వడివడిగా నడవడం, వెయ్యిన్ని ఎనిమిదిసార్లు మునిగినా కూడా చాలుతుందో లేదో అన్న సందేహంతో మళ్ళీ మళ్ళీ మునిగే ముత్తవ్వల్ని చూశాను. కోపం వచ్చినప్పుడు అంతా మరిచి నీచమైన భాషలో తిడుతూ శాపనార్థాలు పెట్టే బ్రాహ్మణోత్తముల్ని కూడా చూశాను.  వాళ్ళెవరూ యిప్పుడు లేరు. కానీ యింకో రూపంలో వాళ్ళని అనుకరిస్తున్న కొత్తతరం యిప్పుడు ఉంది కదా!’

లలితాంబికా అంతర్జనం రాసిన ‘అగ్నిసాక్షి’ నవలలోని మాటలు అవి. దాదాపు నలబైయేళ్ళ క్రితం మలయాళంలో సంచలనం సృష్టించి, సాహిత్య అకాడమీ బహుమతి పొందిన ఈ నవలని నాగపట్ల భక్తవత్సలరెడ్డి  తెలుగులోకి అనువాదం చేశారు.నంబూద్రి కుటుంబాల్లో పెద్దవాడికి మాత్రమే పెళ్ళి చేసుకునే హక్కు, స్వాతంత్య్రం ఉంటాయి. మిగిలిన అన్నదమ్ములు యితర కులాల స్త్రీలతో, ముఖ్యంగా ‘నాయర్’ కుటుంబంలోని స్త్రీలతో సంబంధాలు పెట్టుకునేవారు. వీరికి పుట్టిన పిల్లలు తండ్రిని తాకడానికిగాని, మిగిలిన కుటుంబ సభ్యులతో సన్నిహితంగా ఉండటానికిగాని వీలులేదు.

ఒకప్పుడు నంబూద్రీలు సమాజాన్ని, పాలకులనీ శాసించే స్థితిలో ఉండేవారు. వాళ్ళు చెప్పిందే వేదం. చంపడానికి, చంపించడానికి కూడా వాళ్ళకి అధికారం ఉండేది. ఇలాంటి వ్యవస్థలో ఆడవాళ్ళది బానిసల కన్నా తక్కువ స్థానం. చదువుకోవడం నిషిద్ధం. తాటాకు గొడుగు కప్పుకొని, మడి, మైల, పూజ తప్ప వేరే ప్రపంచం వీళ్ళకి తెలీదు. కట్టుబాట్లు తెంచుకోవడానికి ప్రయత్నిస్తే ప్రాణాలు పోగొట్టుకోవల్సిందే. మొగుడి చేతిలో దెబ్బలు తినడం సామాన్యమైన విషయం. చెవులు తెగ్గోయడం, కళ్ళు పెరికేయటం, కాళ్ళు విరిచేయటం లాంటివి జరక్కుండా ఉంటే ఆ భార్య చాలా అదృష్టవంతురాలని లెక్క. నంబూద్రీలు సొంత భార్యను కలవాలంటే ముహూర్తం కుదరాలి. మైల, మశూచి ఏదీ ఉండకూడదు. ఇంక దీక్షలో ఉంటే యివన్నీ మరిచి పోవల్సిందే. ‘అగ్నిసాక్షి’ కథను చిత్రించిన కాన్వాసు యిది.

కథలోకి వస్తే - అవి స్వాతంత్రోద్యమం జరుగుతున్న రోజులు. అధికారం, ఆస్తి, పలుకుబడి ఉన్న మానంబళ్ళి నంబూద్రి కుటుంబ వారసుడు ఉణ్ణి నంబూద్రీకి భార్యగా వచ్చింది దేవకి. చిన్నప్పుడే తండ్రిని పోగొట్టుకున్న ఉణ్ణి- పెదనాన్న ఉంపుడుగత్తె, ఆమె కూతురు లక్ష్మీ నాయర్ల సాన్నిహిత్యంలో పెరగటం వల్ల ఒక మానవత్వం ఉన్న మనిషిగా ఎదిగాడు. అయితే సంప్రదాయాలు, కుటుంబ కట్టుబాట్లు పాటించడం తన ధర్మంగా భావిస్తాడు. భార్య అంటే ప్రేమే. కాని ప్రదర్శించే తెగువ లేదు. వారసుడిగా రోజంతా తీరకలేని పని.

భార్యతో మాట్లాడే సమయం కూడా ఉండదు. దేవకి అన్న సంస్కరణవాది. సత్యాగ్రహంలో పాల్గొని జైలుకెడతాడు. అన్న భ్రష్ఠుడయ్యాడు కాబట్టి దేవకి పుట్టింటికి వెళ్ళకూడదని శాసిస్తాడు పెద నంబూద్రి. చదువు, సంస్కారమున్న దేవకిని ఆ యింటి పరిస్థితులు పిచ్చిదాన్ని చేస్తాయి. కుటుంబ సభ్యుల సూటిపోటి మాటలు, భర్త తీరకలేనితనంతో దేవకి విపరీతమైన ఒంటరితనం అనుభవిస్తుంది. ఆ పరిస్థితులలో ఆమెకున్న ఒకే ఒక్క స్నేహితురాలు లక్ష్మి నాయర్. తల్లి చావుబతుకుల్లో ఉందని తెల్సి అత్తింటివారి ఆజ్ఞను కాదని యిల్లు వదిలి వెళ్ళిపోతుంది దేవకి.

ఉణ్ణి మీద గౌరవం ఉన్నా ప్రాయశ్చిత్తం చేసుకుని మళ్ళీ ఆ కట్టుబాట్ల లోనికి రావడానికి యిష్టపడదు. స్వాతంత్రోద్యమంలో చురుగ్గా పాల్గొని గాంధీజీ ఆశ్రమానికి చేరుతుంది. మళ్ళీ పెళ్ళి చేసుకోవటం యిష్టం లేక రాగద్వేషాలకి అతీతంగా జీవితాన్ని భగవంతునికి అంకితం చేస్తాడు ఉణ్ణి. గాంధీజీ శిష్యురాలిగా దేవకి ఆశ్రమంలో చాలా పేరు తెచ్చుకొంటుంది. గాంధీజీ పోయిన తర్వాత ఆశ్రమ జీవితంలో పడిపోయిన విలువలు ఆమెని సన్యాసిని చేసి హిమాలయాల వైపు నడిపిస్తాయి. ఉణ్ణి పిచ్చివాడై ప్రాణాలు కోల్పోతాడు. కాలంతో పాటు పరిస్థితులూ మారాయి. నంబూద్రి స్త్రీల కట్టుబాట్లు, ఆచారాలలో చాలా మార్పులు వచ్చాయి.

ఈ కథ అంతా లక్ష్మీ నాయర్ జ్ఞాపకాలుగా నడుస్తుంది. అన్న ఉణ్ణి కోరిక మేరకు వదిన దేవకిని కలుసుకోవటం కోసం చేసే ప్రయత్నంగా నవల సాగుతుంది. ఈ నవల చదువుతున్నప్పుడు మనకి యించుమించు యిలాంటి పరిస్థితులలోనే జీవించిన అస్సాములోని గోస్వామి స్త్రీల జీవితాల గురించి ఇందిరా గోస్వామి రాసిన ‘విషాద కామరుప’ గుర్తుకు వస్తూ ఉంటుంది. ‘అగ్నిసాక్షి’ నవల అదే పేరుతో మలయాళంలో సినిమాగా కూడా వచ్చింది. శ్రీవిద్య, శోభన, రజిల్ కపూర్ నటించిన ఈ సినిమాను ‘యూ ట్యూబ్’లో చూడొచ్చు. చాలా బాగుంటుంది. ఈ నవల కిందటి యేడాది ఇంగ్లిష్‌లో కూడా వచ్చింది.

ప్రాంతాలు వేరు కావచ్చు. జాతులు వేరు కావచ్చు. కాని ఎక్కడ చూసినా యివే కథలు. సమాజంలో సగ భాగంగా ఉన్న స్త్రీల పట్ల మన ఆలోచనల్లో మార్పేం లేదు. బస్టాపుల్లో, మెట్రోల్లో, పబ్లిక్ ప్లేసుల్లో, సామాజిక వెబ్‌సైట్లల్లో, ఆసిడ్ దాడుల్లో, పరువు హత్యల్లో, గ్యాంగ్ రేపుల్లో, మరిన్ని రూపాల్లో హింస వికృతంగా బుసలు కొడుతూనే ఉంది. ఇది వరకు మొగుడు ఒక్కడే హింసిస్తే, యిప్పుడు మరింత మంది కలిశారంతే. దీన్నంతా కప్పెట్టి గతమంతా ఘనం మాకేసి చూడండంటూ ప్రపంచ వేదికలెక్కి గుండెలు బాదుకోవటమే విషాదం.
 - కృష్ణమోహన్‌బాబు, 9848023384
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement